జర జాగ్రత్త : హైదరాబాద్‌లో ఉరుములు, పిడుగులతో వర్షాలు

  • Publish Date - October 10, 2019 / 03:29 AM IST

భాగ్యనగరాన్ని వరుణుడు వీడడం లేదు. కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నగర జనజీవనం స్తంభిస్తోంది. ఉదయం, సాయంత్రం వేళల్లో కుంభవృష్టిగా వర్షం కురుస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రహదారులపై భారీగా వర్షపు నీరు నిలిచిపోతోంది. ముందుకు వెళ్లలేక వాహనదారులు, గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకపోతున్నారు.

కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోతుండడంతో జనాలు నరకయాతన పడుతున్నారు. ఉరుములు, మెరుపులతో నగర వాసులు భయపడిపోతున్నారు. అక్టోబర్ 09వ తేదీ సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. భారీగా ఉరుములతో కూడిన శబ్దాలు రావడంతో ఆందోళన చెందారు. గడిచిన 48 గంటల్లో రాజధానిలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. మంగళవారం ఉప్పల్‌లో అత్యధికంగా 60.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. క్యుములోనింబస్ మేఘాల కారణంగా అలకాపురి, నాగోల్‌లో 46.8, రాక్ టౌన్‌లో 43.5, రామంతాపూర్‌లో 40, ఫిర్జాదీగూడలో 36.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. 

మరోవైపు దేశంలోని పంజాబ్, హరియాణా, రాజస్థాన్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాల ఉపసంహరణ బుధవారం నుంచి ప్రారంభమైంది. రానున్న రెండు రోజుల్లో వాయువ్య భారత్‌లోని మరికొన్ని ప్రాంతాల నుంచి రుతుపవనాలు నిష్క్రమిస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర కోస్తాంధ్ర దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపారు. ఈ ఉపరితల ఆవర్తనం నుంచి కోమెరిన్ ప్రాంతం వరకు రాయలసీమ, తమిళనాడు మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. 
Read More : చుక్ చుక్ బండి : హైదరాబాద్ రైలుకు 150 ఏళ్లు

ట్రెండింగ్ వార్తలు