తెలంగాణ ప్రజల్లో అంతర్లీనంగా రగులుతోన్న ఆకాంక్షలు.. ఆంక్షల నడుమ అణచివేతకు గురవుతోన్న తరుణంలో TRS ఆవిర్భవించింది. టీఆర్‌ఎస్ రాకతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులే మారిపోయాయి. ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమాన్ని ముందుండి నడిపించింది. ఉద్యమకారులు, కవులు, మేధావులను ఒకే వేదికపై తీసుకొచ్చి స్వరాష్ట్ర కలను సాకారం చేసింది. అనంతరం ఉద్యమ పార్టీ నుంచి రాజకీయ పార్టీగా అవతరించి పాలనా పగ్గాలను సైతం అందుకుంది.
వందల గంటల మేథోమథనంలోంచి ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తన లక్ష్యమైన తెలంగాణ రాష్ర్టాన్ని ముద్దాడి, ప్రభుత్వ పగ్గాలు అందుకుంది. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం, పరిణామం, ఉత్థాన పతనాలు, మహాశక్తిగా మారిన తీరు తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. హుస్సేన్‌సాగర్ ఒడ్డున జలదృశ్యంలో 2001 ఏప్రిల్ 27న కేవలం కొంతమంది ప్రతినిధుల సమక్షంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఊపిరిపోసుకుంది. ఇప్పుడు కోట్ల మంది ఆ పార్టీ వెన్నంటి ఉన్నారు. కేసీఆర్ నాయకత్వంపై విశ్వాసంతో బలపరుస్తున్నారు. ఉద్యమ పార్టీని రాజకీయంగా మార్చడమేంటన్న ప్రశ్నలకు కేసీఆర్ సరైన సమాధానాలే చెబుతూ వచ్చారు. పార్లమెంటు వ్యవస్థ ద్వారానే లక్ష్యం సాకారమవుతుందన్న విశ్వాసంతోనే ఆయన ఎన్నికల బరిలో పోటీ చేస్తూ వచ్చారు. చివరకు పార్టీ అనుకున్న గమ్యానికి చేరుకుంది. తెలంగాణ వచ్చింది.
TRS ఆవిర్భావంతో దశాబ్దాలుగా అణచివేతకు గురైన ఆకాంక్ష ఒక్క ఉదుటున ఉవ్వెత్తున ఎగసి పడింది. తెలంగాణవాదం.. టీఆర్‌ఎస్ పార్టీ మఖలో పుట్టి పుబ్బలో పోయే బాపతు కాదని నిరూపించింది. జేఏసీతో మమేకమై టీఆర్‌ఎస్ ఉద్యమ పంథా అనుసరించింది. మిలియన్ మార్చ్‌లు, సాగరహారాలు, సకలజనుల సమ్మెలు ఆందోళన ఏదైనా టీఆర్‌ఎస్ అగ్రభాగాన నిలిచింది. చివరకు కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను చేపట్టింది. ఆరు దశాబ్దాల కల ఫలించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. 14 ఏళ్లు అవిశ్రాంతంగా శ్రమించిన టీఆర్‌ఎస్‌ను ప్రజలు గుండెకు హత్తుకున్నారు. అధికార పీఠాన్ని అప్పజెప్పారు.
శనివారం (ఏప్రిల్ 27,219) టీఆర్‌ఎస్ మిగిలిన పార్టీలేవీ అందుకోనంత ఎత్తుకు ఎదిగింది. సమీప భవిష్యత్తులో ఇంకే పార్టీ పోటీపడే అవకాశం కూడా ఇవ్వలేనంతగా బలపడింది. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సభ్యత్వాల్లో 50 లక్షల మార్కు దాటిపోవడం ఇదే సూచిస్తోంది. అటు ప్రభుత్వంగా జనం గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించే దిశగా అడుగులు వేస్తోంది. సమర్థ నాయకత్వం, అంకితభావం కలిగిన కార్యకర్తలు, బంగారు తెలంగాణ రూపశిల్పిగా ప్రజలు విశ్వసిస్తున్న తీరు పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. ఒకప్పుడు టీఆర్ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేయమని సోనియా అడిగితే… ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీయే టీఆర్ఎస్‌లో విలీనమయ్యే పరిస్థితుల ఎదురు కావడం చూస్తోంటే.. ఓడలు బండ్లవుతాయి.. బళ్లు ఓడలవుతాయన్న నానుడి నిజమే అనిపించక మానదు.