చర్చలకు సై : ఆర్టీసీ కార్మికులకు కేకే లేఖ

  • Publish Date - October 14, 2019 / 09:45 AM IST

సమ్మె విరమణకు ప్రభుత్వం..ఆర్టీసీ కార్మికుల మధ్య మళ్లీ చర్చలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కార్మికులు చర్చలకు సిద్ధపడాలంటూ అక్టోబర్ 14వ తేదీ సోమవారం ఎంపీ కేకే లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిపై ఆర్టీసీ కార్మిక సంఘాలు సానుకూలంగా స్పందించాయి. చర్చలకు సిద్ధమేనంటూ ప్రకటించాయి. అయితే..కేకే మధ్యవర్తిత్వం వహిస్తే..చర్చలకు సిద్ధమేనంటూ వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీ జేఏసీని ప్రభుత్వం మళ్లీ చర్చలకు పిలుస్తుందా ? ఉత్కంఠ నెలకొంది. 

ఆర్టీసీ విలీనం తప్ప..మిగతా డిమాండ్లు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేకే కోరారు. పరిస్థితులు చేయి దాటక ముందే..కార్మికులు చర్చలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు తనను బాధించాయని, బలిదానాలు సమస్యలకు పరిష్కారం కాదన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రతిపాదన టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో లేదని గుర్తు చేశారు. విధానపరమైన నిర్ణయాల్లో ప్రజా ప్రభుత్వాన్ని ఎవరూ శాసించలేరని కేకే వెల్లడించారు. 

మరోవైపు ఆర్టీసీ ఐకాస నేతలు గవర్నర్ తమిళిసైను కలిశారు. ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామ రెడ్డితో పాటు పలువురు కార్మిక సంఘ నేతలు రాజ్ భవన్‌కు వెళ్లి ఆర్టీసీ సమ్మె, తదనంతర పరిణామాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాల్సింది ప్రభుత్వమేనని అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. కార్మికులవి ఆత్మహత్యలు కావు..ప్రభుత్వ హత్యలంటూ ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఆహ్వానిస్తే చర్చలకు రావడానికి సిద్ధమేనని ప్రకటించారు. మరి ప్రభుత్వం చర్చలకు పిలుస్తుందా ? లేదా ? అనేది చూడాలి. 
Read More : ఆర్టీసీ సమ్మె ఉధృతం : కుటుంబసభ్యులతో బైఠాయింపు

ట్రెండింగ్ వార్తలు