కరోనా ఎఫెక్ట్ : వీడియో కాలింగ్ ద్వారా శుభాకాంక్షలు

  • Publish Date - March 20, 2020 / 03:51 PM IST

కోవిడ్-19 (కరోనా) వైరస్  వ్యాప్తి నిరోధానికి  ఎవరికి వారు వీలైనంత వరకు జాగ్రత్తలు పాటిస్తూనే ఉన్నారు. సామూహికంగా  కార్యక్రమాలకు హాజరు కాకపోవటం, షేక్ హ్యాండ్ లివ్వటం మానేశారు. చుట్టుపక్కల వారు ఎవరైనా తుమ్మినా, దగ్గినా అప్రమత్తమవుతున్నారు. సాధ్యమైనంత వరకు మాస్క్ లు ధరించి తిరుగుతున్నారు. కొన్ని చోట్ల పెళ్ళిళ్లు వాయిదాలు వేసుకుంటుంటే జరుగుతున్న పెళ్ళిళ్లకు బంధువుల తక్కువ సంఖ్యలో హాజరవుతున్నారు. సీఎ కేసీఆర్ పెళ్లిళ్ళను వాయిదా వేసుకోమని కూడా కోరారు. సీఎం కేసీఆర్ సూచనలను టీఆర్ఎస్ ఎంపీ (రాజ్యసభ) జోగినిపల్లి సంతోష్ కుమార్ ఆచరించి చూపారు. 

నూతన వధూవరులను వీడియో కాలింగ్‌ ద్వారా రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్‌ ఆశీర్వదించారు. తన వద్ద సెక్యురిటీగా పనిచేస్తున్న నరేందర్ గౌడ్  వివాహం  శుక్రవారం  మార్చి 20న ఉమారాణితో  జరిగింది. భువనగిరి పట్టణంలోని వైఎస్ఆర్ గార్డెన్‌లో జరిగిన ఈ పెళ్లికి సంతోష్‌కుమార్‌ తన కుటుంబ సభ్యులతో సహా హాజరవ్వాలను కున్నారు. కానీ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆయన తన ప్రయాణాన్ని విరమించుకుని, తన అంగరక్షకుడికి ఫోన్‌ ద్వారా శుభాశీస్సులు అందజేశారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఎవరు కూడా బయటకు వెళ్లవద్దని, వివాహాలకు శుభకార్యాలకు ఎక్కువమంది హాజరు కావద్దని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

స్వయంగా వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వదించాలని అనుకున్నప్పటికీ కరోన వైరస్ ప్రభావం వల్ల వెళ్లలేకపోయానని ఎంపీ సంతోష్‌కుమార్‌ తెలిపారు. పెళ్లికి వెళ్లలేకపోయినందుకు మనసులో బాధ ఉన్నప్పటికీ కరోనా వైరస్ ప్రభావాన్ని తగ్గించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచనలను పాటించినట్టు చెప్పారు. ప్రముఖులు, ప్రజలు అందరు కూడా జనసమూహానికి దూరంగా ఉండాలని.. అవసరమైతే తప్ప బయటికి వెళ్లవద్దని సంతోష్‌కుమార్‌ విజ్ఞప్తి చేశారు.