హూజూర్ నగర్ ప్రజాకృతజ్ఞత సభ : హాజరు కానున్న సీఎం కేసీఆర్

  • Publish Date - October 26, 2019 / 12:54 AM IST

సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి 43 వేలకు పైగా ఓట్లతో మెజార్టీతో ప్రజలు గెలిపించారు. భారీ విజయాన్ని కట్టబెట్టిన హుజూర్‌నగర్ ప్రజలకు కేసీఆర్ కృతజ్ఞత తెలపనున్నారు. ఫలితాలు వెలువడిన తరువాత మాట్లాడిన కేసీఆర్.. 2019, అక్టోబర్ 26వ తేదీ శనివారం హుజూర్‌నగర్‌కు వస్తానని ప్రకటించారు. కృతజ్ఞత సభావేదక నుంచి తానే స్వయంగా ప్రజలకు ధన్యవాదాలు చెబుతానన్నారు. హుజూర్‌నగర్  సెగ్మెంట్ అభివృద్ధి డిక్లరేషన్ ప్రకటిస్తానని వెల్లడించారు.

సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో.. మంత్రి జగదీశ్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఇతర టీఆర్ఎస్ నేతలు, కలెక్టర్ అమోయ్ కుమార్, ఎస్పీ భాస్కరన్ కృతజ్ఞత సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీకి ఘన విజయం కట్టబెట్టిన హుజుర్‌నగర్ నియోజకవర్గ అభివృద్దికి కేసీఆర్ వరాలు ప్రకటించనున్నారని తెలుస్తోంది. ఎన్నికల వేళ కేసీఆర్ సభ రద్దయినప్పటికీ కూడా ప్రభుత్వం మీద ఉన్న నమ్మకంతో.. టీఆర్ఎస్ అభ్యర్ధిని గెలిపించిన ఓటర్లకు పల్లా రాజేశ్వర్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

అదే క్రమంలో ఇక్కడి ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా కేసీఆర్  హుజుర్‌నగర్‌కు వరాల జల్లు కురిపించనున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ రాక కోసం ప్రజలు స్వచ్ఛందంగా ఎదురు చూస్తున్నారని చెప్పారు. లక్ష మందితో సీఎం కేసీఆర్ కతజ్ఞత సభ నిర్వహించేలా టీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాట్లు చేశాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్డు మార్గంలో హుజుర్‌నగర్‌ చేరుకోనున్న నేపథ్యంలో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. 
Read More : ఓయూలో టెన్షన్ టెన్షన్ : టీఆర్ఎస్‌వి విద్యార్ధి నేతల అరెస్టు