హైదరాబాద్ : తెలంగాణలో జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో, టీఆర్ఎస్ పార్టీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గోనే నాయకుల వెహికల్ పాసుల కోసం ఎన్నికల సంఘానికి ఇచ్చిన స్టార్ క్యాంపెయనర్ జాబితాలో హరీష్ రావుకు స్ధానం కల్పించకపోవటంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో పార్టీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. హరీష్ రావుపేరు మీద కారు పాస్ కావాలని కోరుతూ సోమవారం ఎన్నికల సంఘానికి పార్టీ మరోక లేఖ పంపించింది.
ఇప్పటికే కేబినెట్ లో హరీష్ రావుకు అవకాశం ఇవ్వని గులాబీ బాస్…. లోక్ సభ ఎన్నికలలో కూడా ఆయన్నుపక్కన పెట్టారు. శనివారం నాడు ఎన్నికల సంఘానికి పార్టీ ఇచ్చిన స్టార్ క్యాంపెయినర్ జాబితాలోనూ హరీష్ రావు పేరు ఎక్కడా కనిపించలేదు. సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, క్యాబినెట్ లోని 11 మంది మంత్రులు, కే.కేశవరావు, అయిదుగురు ప్రధాన కార్యదర్శుల పేర్లతో ఎన్నికల సంఘానికి ఓ లేఖ పంపింది. హరీష్ రావు పేరు లేక పోవటంతో హరీష్ రావును పూర్తిగా పక్కన పెట్టేశారనేవార్తలు వచ్చాయి. దీంతో ఇప్పుడు హరీష్ రావుకు ప్రచారం చేసేందుకు, కారు పాస్ కోసం అనుమతి కోరుతూ సోమవారం నాడు టీఆర్ఎస్ పార్టీ మరో లేఖను ఎన్నికల సంఘానికి పంపింది. మొదట ఇచ్చిన లిస్టులోని పార్టీ ప్రధాన కార్యదర్శి జె.సంతోష్ కుమార్ కు బదులుగా హరీష్ రావు పేరు మీద పాస్ ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని టీఆర్ఎస్ లేఖలో కోరింది.