TSLPRB : మే 19న డ్రైవర్ల తుది రాత పరీక్ష

  • Publish Date - May 13, 2019 / 01:40 AM IST

పోలీసు శాఖలో డ్రైవర్లు, మెకానిక్‌ల పోస్టులకు తుది రాత పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మే 19వ తేదీ పరీక్ష నిర్వహించడం జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి ఛైర్మన్ వి.వి. శ్రీనివాసరావు ప్రకటించారు. ఈ మేరకు మే 12వ తేదీ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉదయం 10 గంటలకు డ్రైవర్లకు, మధ్యాహ్నం 2.30గంటలకు మెకానిక్‌ అభ్యర్థులకు పరీక్ష జరగనుంది. 

మే 2వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు అంబర్ పేట సిటీ పోలీసు లైన్‌లో ప్రావీణ్య పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందులో పాస్ అయిన వారందరూ రాత పరీక్షకు హాజరు కావచ్చని తెలిపారు. హాల్ టికెట్లు మే 14వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి మే 18వ తేదీ అర్ధరాత్రి 12గంటల వరకు వెబ్ సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని వెల్లడించారు. 
అయితే హాల్ టికెట్‌పై అభ్యర్థి ఫొటో తప్పనిసరిగా ఉండాలని, ఫలితాలు వచ్చే వరకు దీనిని భద్రపరుచుకోవాలని అభ్యర్థులకు సూచించారు. ఏదైనా సమస్యలు ఉంటే support@tslprb.in సంప్రదించాలన్నారు.