ఇప్పటి వరకు సైకిల్..బైకు..అది కాదంటే కార్ల దొంగతనం గురించి విన్నాం. కానీ హైదరాబాద్‌లో ఏకంగా బస్సునే దొంగతనం చేశారు. అదేదో ప్రైవేట్ బస్సు అనుకోకండి…ఆర్టీసీ బస్సునే దొంగిలించారు. పార్క్ చేసిన బస్సును ఎత్తుకెళ్లి కేటుగాళ్లమని నిరూపించుకున్నారు. CBS వద్ద జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 2019, ఏప్రిల్ 23వ తేదీ మంగళవారం రాత్రి 11 గంటలకు CBSలో బస్సును డ్రైవర్ పార్క్ చేశాడు. బస్సుకు సంబంధించి డ్రైవర్, కండక్టర్ ఏలాగు లేరనుకొని నిర్ధారించుకున్న కేటుగాళ్లు తమ పని కానిచ్చేశారు.
తెల్లవారి వచ్చి చూసి షాకవడం డ్రైవర్, కండక్టర్ వంతైంది. బస్సు కన్పించకపోవడంతో ఆశ్చర్యపోయారు. వెంటనే ఆ బస్సు డ్రైవర్ అధికారులకు ఫిర్యాదు చేయగా…సీసీ కెమెరాల ఆధారంగా తూప్రాన్ గేట్ వద్ద ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం అధికారులు బస్సును వెతికే పనిలో పడ్డారు. ఈ విషయం ఆలస్యంగా బయటకు వచ్చింది. అయితే బస్సు మిస్సై .. ఒకరోజు గడుస్తోన్నా ఇంకా దొరకలేదు. అయినా గతంలో ఎన్నడూ లేనివిధంగా బస్సు చోరికి గురవడం సంచలనం రేపింది.