ఆర్టీసీ సమ్మె 26వ రోజు : సకల జనుల సమరభేరి..తరలివస్తున్న కార్మికులు

  • Publish Date - October 30, 2019 / 09:13 AM IST

ఆర్టీసీ సమ్మె 26వ రోజుకు చేరుకుంది. అక్టోబర్ 05వ తేదీ నుండి సమ్మె కొనసాగుతోంది. దశల వారీగా ఆందోళనలు చేస్తున్న ఆర్టీసీ జేఏసీ..అక్టోబర్ 30వ తేదీ బుధవారం మధ్యాహ్నం సకల జనుల సమర భేరీ నిర్వహిస్తోంది. ఈ సభకు హైకోర్టు ఆంక్షలతో కూడిన అనుమతినిచ్చింది. సమరభేరికి అనుమతివ్వాలని కోరినా.. పోలీసులు అనుమతించకపోవడంతో జేఏసీ నేతలు హైకోర్టులో పిటిషన్‌ వేసిన సంగతి తెలిసిందే. సభకు విపక్షాలు మద్దతిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్టీసీ కార్మికులు..తమ కుటుంబసభ్యులతో స్టేడియానికి చేరుకుంటున్నారు. సభలో కళాకారులు పాటలు, నృత్య ప్రదర్శనలు ఇస్తున్నారు. సభకు సంబంధించిన విషయాలు తెలుసుకొనేందుకు ఆర్టీసీ జేఏసీ నేతలతో 10tv మాట్లాడింది.

ఆర్టీసీ కార్మికులు చేపట్టనున్న సకల జనుల సమర భేరికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నేతలు వెల్లడించారు. రవాణా రంగంలో కనివినీ ఎరుగని విధంగా సభ నిర్వహించడం జరుగుతుందని, అనుమతినివ్వాలని కోరినా..నో చెప్పడం దారుణమన్నారు. ఓపెన్ గ్రౌండ్ ఇవ్వాలని కోరడం జరిగిందని, క్రమశిక్షణతో తాము సభ నిర్వహించడం జరుగుతుందన్నారు. సభకు వచ్చే కార్మికులను పోలీసులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు ఆర్టీసీ జేఏసీ నేతలు. 

సమ్మె వ్యవహారంపై హైకోర్టులో వాదనలు కొననసాగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తదుపరి విచారణకు ఆర్టీసీ ఎండీతో పాటు, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు సమగ్ర సమాచారంతో హాజరు కావాలని ఆదేశించింది. కేసును నవంబర్ 01వ తేదీ శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. దీంతో ఎలాంటి తీర్పు వస్తుందనే ఉత్కంఠ నెలకొంది.  
Read More : సమ్మె విరమించమని కార్మిక సంఘాలను ఆదేశించలేమన్న హైకోర్టు