ఇంకెన్ని రోజులో : ఆర్టీసీ సమ్మె..ప్రయాణికుల అవస్థలు

  • Publish Date - October 12, 2019 / 02:59 AM IST

ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. 8వ రోజుకు చేరుకుంది. ఆర్టీసీ సమ్మెలాగే..ప్రయాణీకుల కష్టాలు కూడా కొనసాగుతున్నాయి. సమ్మె మొదలై 8 రోజులైనా ప్రజా రవాణా గాడిన పడడం లేదు. మూడొంతుల బస్సుల్లో రెండొంతులు డిపోలకు పరిమితవ్వగా..తిరుగుతున్న ఒక వంతు బస్సుల్లో టికెట్ల విషయంలో వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని బస్సుల్లో రూ. 10తో కనీస టికెట్ ధరతో చార్టులు అతికించారు.

మరి కొన్నింటిలో రూ. 5 కనీస టికెట్ ధరతో చార్టులు పెట్టారు. అన్ని బస్సుల్లో చార్టులు అతికించకపోవడంతో తాత్కాలిక కండక్టర్ల టికెట్ వసూళ్లు ఇష్టారాజ్యంగా కొనసాగుతున్నాయి. ఆర్టీసీ బస్సుల్లో కనీస టికెట్ ధర రూ. 5, ఎక్స్ ప్రెస్‌ బస్సుల్లో ఈ ధర రూ. 10గా ఉండేది. చాలా వరకు కనీస టికెట్ ధ రూ. 10 వసూలు చేస్తున్నారని ప్రయాణీకులు వాపోతున్నారు. 
ఇదిలా ఉంటే..తాత్కాలికంగా నియమించబడిన కండక్టర్లు అధికంగా టికెట్లు వసూలు చేస్తున్నారా అనే దానిపై అధికారులు నజర్ పెట్టారు. క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కూకట్ పల్లి

డివిజన్ మేనేజర్ సైబరాబాద్ పరిసరాల్లో పోలీసులు, డిపో మేనేజర్ల సహకారంతో బస్సుల్లో తనిఖీలు చేశారు. బస్సుల్లో ఉంచిన టికెట్ ధరల పట్టిక ప్రకారమే డబ్బులు చెల్లించాలని కండక్టర్లకు సూచించారు. బస్సులను మార్గమధ్యంలో ఆపి ప్రయాణీకుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. మరోవైపు ప్రధాన మార్గాల వరకే కొన్ని బస్సులు తిరుగుతుండడంతో శివార్లలోని కాలనీల వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మెయిన్ రోడ్డుకు వెళ్లే ఆటోలు అధిక చార్జీలు వసూలు చేస్తున్నారు. దీంతో అధికంగా డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తోందంటున్నారు. కూలీలు, సామాన్యుడి పరిస్థితి చెప్పనవసరం లేదు. సమ్మె ఎప్పటి వరకు కంటిన్యూ అవుతుందో స్పష్టంగా తెలియకపోయేసరికి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 
Read More : సిలిండర్‌ పేలి ముగ్గురు మృతి