తెలంగాణ ఆర్టీసీ సమ్మె ప్రయాణీకులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దసరా పండుగ సీజన్‌లో కార్మికులు సమ్మె బాట పట్టడంతో ఎంతో మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమ్మెను ప్రైవేటు వాహనదారులు క్యాష్ చేసుకుంటున్నారు. సొంత గ్రామాలకు వెళ్లాలని అనుకున్న వారి జేబు గుల్లవుతోంది. భారీగా ఉన్న ఛార్జీలు చూసి ఘోల్లుమంటున్నారు. 200 శాతానికి పైగా అదనంగా డబ్బులు వసూలు చేస్తుండడం పట్ల తీవ్ర ఆందోళనలకు గురవుతున్నారు.
చిన్న ఫ్యామిలీ వెళ్లాలంటేనే..భారీగా డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తోందంటున్నారు. పండుగ దృష్ట్యా ప్రైవేటు వాహనాలను ప్రయాణీకులు ఆశ్రయిస్తున్నారు. దీనిని క్యాష్ చేసుకుంటున్నారు వాహన యజమానులు. జూబ్లి బస్ స్టేషన్ ఎదుట వందల సంఖ్యలో ప్రైవేటు వాహనాలు బారులు తీరి నిలబడ్డాయి. రూ. 150 ఉండాల్సిన టికెట్‌కు రూ. 500 నుంచి రూ. 600 వసూలు చేస్తున్నారు. కరీనగర్ నుంచి జగిత్యాలకు రూ.150, కరీంనగర్ నుంచి హైదరాబాద్ కు రూ.750, కరీంనగర్ నుంచి వరంగల్ కు రూ.300లు చార్జీలు డిమాండ్ చేస్తున్నారు.
ఇక నగర ప్రయాణీకుల విషయానికి వస్తే..బస్సులు లేక..పడరాని పాట్లు పడుతున్నారు. చాలా మంది మెట్రో రైళ్లను ఆశ్రయిస్తున్నారు. క్యాబ్, ఆటో డ్రైవర్లు అమాంతం ధరలు పెంచడంతో అయోమయానికి గురవుతున్నారు. రెండు కిలోమీటర్ల దూరానికే రూ. 100 డిమాండ్ చేస్తుండడంతో తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఆటో కనీసం ఛార్జీ రూ. 50 నుంచి రూ. 100 డిమాండ్ చేస్తున్నారు.
ఇదేమని అడిగితే…ఇష్టముంటే ఎక్కండి..లేకపోతే దిగిపోండి అంటున్నారని పలువురు వెల్లడిస్తున్నారు. సమ్మె కొన్ని రోజులు కంటిన్యూ అయితే..మాత్రం తాము ఆర్థికంగా ఇబ్బందులు పడుతామని అంటున్నారు నగర వాసులు. ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికులు, ప్రభుత్వం మెట్టు దిగి సమస్య పరిష్కారానికై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Read More : ఆర్టీసీ సమ్మె : బస్సులు నిల్..మెట్రో ఫుల్