మరో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ ఘటన HCU డిపో ఎదుట చోటు చేసుకుంది. దీంతో అక్కడ కలకలం రేగింది. ఇటీవలే ఖమ్మం జిల్లాలో డ్రైవర్ శ్రీనివాసరెడ్డి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. కార్మికులు బలవన్మరణాలకు దిగొద్దని సూచిస్తున్నారు.
ఆర్టీసీ సమ్మె 10వ రోజుకు చేరుకుంది. దశలవారీగా ఆందోళన చేపడుతున్నారు కార్మికులు. అందులో భాగంగా హెచ్‌సీయూ డిపో వద్ద కార్మికులు వంటవార్పు చేపట్టారు. ఈ కార్యక్రమానికి అదే డిపోకు చెందిన సందీప్ అనే కార్మికుడు పాల్గొన్నాడు. ప్రభుత్వ వైఖరితో తీవ్రమనస్థాపానికి గురయ్యాడు. వెంటనే తన వెంట తెచ్చుకున్న బ్లేడ్‌తో ఎడమ చేయిపై గాయం చేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అక్కడనే ఉన్న తోటి కార్మికులు వారించారు. అనంతరం కొండాపూర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, భయపడాల్సిన పరిస్థితి లేదని వైద్యులు వెల్లడించారు.
అక్టోబర్ 05వ తేదీ నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెలోకి వెళ్లారు. ఈ సమ్మెపై ప్రభుత్వం తీవ్ర ఆగ్రహంగా ఉంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపడుతోంది. కార్మికులతో చర్చల ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. దీంతో కార్మికులు పట్టు వీడడం లేదు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలని, ఇతర డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.
Read More : చర్చలకు సై : ఆర్టీసీ కార్మికులకు కేకే లేఖ