న్యాయం కావాలి : రెవెన్యూ అధికారులపై రైతన్నల నిరసన

  • Publish Date - November 7, 2019 / 12:28 AM IST

తెలుగు రాష్ట్రాల్లో రెవెన్యూ అధికారుల తీరుపై అన్నదాతలు రోడ్డెక్కుతున్నారు. తమకు అన్యాయం జరుగుతోందంటూ నిరసనలతో హోరెత్తిస్తున్నారు. ఏళ్ల తరబడి ఆఫీసుల చుట్టూ తిరగలేమంటూ వాపోతున్నారు. రెండు రాష్ట్రాల్లో పలుచోట్ల రెవెన్యూ అధికారుల తీరుపై రైతన్నలు నిప్పులు చెరుగుతున్నారు. ఎమ్మార్వో కార్యాలయాల్లో పర్సంటేజీ లేనిదే పని ముందుకు కదలదని వాపోతున్నారు. తమకు న్యాయం చేయాలంటూ ఎక్కడికక్కడ నిరసన తెలుపుతున్నారు

> శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం డోకులపాడులో అల్లు జగన్మోహన్‌ రావు అనే రైతు ఆత్మహత్యా యత్నం చేయడం కలకలం రేపింది. రైతు భరోసాలో తనకు అన్యాయం జరిగిందన్న ఆవేదనతో… జగన్మోహన్‌రావు ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యా యత్నం చేశాడు. 
> చిత్తూరు జిల్లా రామకుప్పం ఎమ్మారో కార్యాలయంలో ఐదు రైతు కుటుంబాలు ఆందోళనకు దిగాయి. తాము 40 ఏళ్లుగా సాగు చస్తున్న భూములపై ఇతరులకు పాస్‌బుక్కులు ఇచ్చారంటూ నిరసన వ్యక్తం చేశారు రైతులు. తమకు న్యాయం జరక్కపోతే కార్యాలయంలోనే ఆత్మహత్య చేసుకుంటామని అధికారుల్ని హెచ్చరించారు. ఈ ఘటన కలకలం రేపింది. 
> అదే చిత్తూరు జిల్లా కురబలకోటలో బాలకృష్ణ అనే రైతు వినూత్న నిరసనకు దిగాడు. ఆర్నెల్లుగా అధికారులు తన పాస్ పుస్తకం ఇవ్వకుండా… రేపు, మాపు అని చెప్పడంతో విసిగివేసారిపోయిన బాలకృష్ణ… తహశీల్దార్ కార్యాలయంలోనే నిరసనకు దిగాడు. అక్కడే నిద్రపోతూ తన ఆందోళనను తెలియజేశాడు. బాలకృష్ణకు న్యాయం చేయాలని అధికారుల్ని స్థానికులు కోరుతున్నారు. లేదంటే తాము కూడా మద్దతిచ్చి ఆందోళన చేపతామని హెచ్చరించారు. 
> మరోవైపు కడప జిల్లా కొండాపురంలో తహశీల్దార్‌ వేధింపులు తాళలేక ఆదినారాయణ అనే రైతు ఆత్మహత్యా యత్నం చేశాడు. ఎమ్మార్వో కార్యాలయంలోనే ఒంటిపై కిరోసిన్‌ పోసి నిప్పంటించుకునేందుకు ప్రయత్నించగా… రెవెన్యూ సిబ్బంది అడ్డుకున్నారు.
> ముంపు గ్రామమైన దత్తపురానికి చెందిన ఆదినారాయణ… తన తల్లి పేరుతో ఉన్న భూమిని తన పేరుమీదకు మార్చి… నష్టపరిహారం చెల్లించాలని ఏడాదిగా కోరుతున్నాడు. అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో… చివరకు కార్యాలయంలోనే ఆత్మహత్యా యత్నం చేశాడు. మొత్తానికి రెవెన్యూ అధికారులపై రైతన్నలు చేస్తున్న నిరసనలు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్నాయి. 
తహాసీల్దారు విజయారెడ్డి సజీవ దహనంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న ఓ వీఆర్వోకు లంచం సెగ తగిలింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని గుండాల తహాసీల్దారు కార్యాలయం వద్ద మండల వీర్వోలు మూకుమ్మడిగా నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలోనే… అక్కడికి వచ్చిన ఓ భూ యజమాని నిరసనలో కూర్చున్న వీఆర్వోపై విరుచుకుపడింది. నేను కష్టపడి తెచ్చి ఇచ్చిన 2వేలు ఇచ్చేయ్.. ఇయ్యకుంటే ఇపుడు నీ గల్ల పడ్తా అంటూ మారుతమ్మ సదరు వీఆర్వోను నిలదీసి అడుగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మారుతమ్మ నిలదీయడంతో నిరసన తెలుపుతున్న సిబ్బంది మధ్యలోనే లేచి కార్యాలయంలోకి వెళ్లి పోయారు.
Read More : ఆర్టీసీ తేలేనా : హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ