తెలుగు రాష్ట్రాల్లో మార్చి31 వరకు లాక్ డౌన్ 

  • Publish Date - March 22, 2020 / 03:38 PM IST

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నకరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి రెండు తెలుగు రాష్ట్రాలు మార్చి31వరకు లాక్ డౌన్ ప్రకటించాయి.  తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ ఆదివారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలను ప్రకటించారు. కరోనా వైరస్ ను అడ్డుకునేందుకు  కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగా మద్దతు తెలుపుతూ రెండు రాష్ట్రాల్లోనూ మార్చి31వరకు లాక్ డౌన్ ప్రకటించారు. 

తెలంగాణ రాష్ట్రంలో  తెల్ల రేషన్ కార్డు దారులకు 12 కిలోల చొప్పున రేషన్ బియ్యం ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్రంలో 87.59 లక్షల మంది తెల్లరేషన్ కార్డుదారులు ఉన్నారు. ఈ తెల్లరేషన్ కార్డుదారులకు రూ.1500 వరకు ఆర్థిక సాయం అందిస్తామని కూడా సీఎం కేసీఆర్ తెలిపారు. అత్యవసర సర్వీసులు తప్ప మిగిలిన ప్రభుత్వ ఉద్యోగులు ఆఫీసులకు రావాల్సిన అవసరం లేదన్నారు. 20 శాతం ఉద్యోగులు మాత్రమే రొటేషన్ పద్ధతిలో విధులకు హాజరవుతారని తెలిపారు.

నిత్యావసరాల కోసం కుటుంబం నుంచి ఒకరిని మాత్రమే అనుమతిస్తామని కేసీఆర్ తెలిపారు. లాక్ డౌన్ తో నిరుపేదలు ఆదాయం కోల్పోతారని చెప్పారు. నిరుపేదలు ఆకలికి గురికాకూడదన్నారు. ప్రైవేటు ఉద్యోగులకు ఈ సెలవుల కాలానికి కంపెనీలు వేతనాలు చెల్లించాలని కేసీఆర్ చెప్పారు.  

ఆంధ్రప్రదేశ్ లో 

అటు ఏపీ లోనూ సీఎం జగన్ మోహన్ రెడ్డి  లాక్ డౌన్ వల్ల పేదలు ఇబ్బందులు పడకుండా గ్రామ వాలంటీర్ల ద్వారా రేషన్ ను అందచేస్తున్నారు. మార్చి 29వ తేదీ నాటికి రేషన్ అందుబాటులో ఉంచుతామని, రేషన్ బియ్యంతో పాటు కేజీ కందిపప్పు ఉచితంగా ఇస్తామన్నారు. ఏప్రిల్ 4న ప్రతీ తెల్ల రేషన్ కార్డుదారుని ఇంటికి వెళ్లి గ్రామ వాలంటీర్ రూ.1000 అందిస్తారని జగన్ స్పష్టం చేశారు.

10 మందికి మించి ఎవరూ గుమిగూడవద్దని జగన్ సూచించారు.  ఏపీలో పదో తరగతి పరీక్షలు యథాతథంగా జరుగుతాయని జగన్ తెలిపారు. అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపు ఇవ్వనున్నట్టు  ఆయన చెప్పారు. నిత్యావసర సర్వీసులు మాత్రం పనిచేస్తాయన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు పరిమిత సంఖ్యలో రొటేషన్ పద్ధతిలో పనిచేస్తారని తెలిపారు.

బడ్జెట్ ఆమోదం కోసం వీలైనంత త్వరలో అసెంబ్లీ సమావేశం కానున్నట్టు సీఎం జగన్ చెప్పారు.నీళ్లు, కూరగాయలు, పాలు, ఎలక్ట్రిసిటీ, మెడికల్, గ్యాస్, పెట్రోల్ బంకులు, వాటర్ సర్వీసులు ప్రజలకు అందుబాటులో ఉంటాయని చెప్పారు. 10 ఏళ్ల లోపు పిల్లలను తల్లిదండ్రులు బయటకు పంపొద్దన్నారు. 60 ఏళ్ల దాటిన వృద్ధులపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు. 

ఆంధ్రప్రదేశ్ లోని 3 జిల్లాల్లో మార్చి 31 వరకు లాక్ డౌన్ ప్రకటించాలకి కేంద్ర ప్రభుత్వం  రాష్ట్ర  ప్రభుత్వాన్ని ఆదేశించింది. దేశ వ్యాప్తంగా ఇప్పటికే 75 జిల్లాల్లో కరోనా నిర్భంధం కొనసాగుతోంది. విశాఖ, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో లాక్ డౌన్ ప్రకటించాలని కేంద్ర ఆదేశించింది. 

కాగా…. సోమవారం(మార్చి 23) ఏపీలో  జరగాల్సిన ఇంటర్మీడియట్‌ చివరి పరీక్ష వాయిదా పడింది. ఈ మేరకు ఇంటర్‌ బోర్డ్‌ ప్రకటన చేసింది. త్వరలోనే వాయిదాపడిన పరీక్షకు సంబంధించిన కొత్త తేదీని ప్రకటిస్తామని తెలిపింది.