దిగివచ్చిన కూరగాయల ధరలు

  • Publish Date - October 21, 2019 / 03:33 AM IST

గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అక్టోబర్‌ రెండో వారం నుంచే హైదరాబాద్ నగరంలో కూరగాయల ధరలు  చాలావరకు తగ్గుముఖం పట్టాయి. పోయిన ఏడాది ఆన్‌ సీజన్‌లో (ఫిబ్రవరి నుంచి అక్టోబర్‌) కూరగాయల ధరలు ఆకాశాన్నంటి సామాన్యుడి నడ్డి విరిచాయి. 2019 సెప్టెంబర్‌ చివరివారం నుంచే శివారు జిల్లాల నుంచి, నగరానికి కూరగాయల దిగుమతులు రోజు రోజుకు పెరగటంతో, దాదాపు అన్ని కూరగాయల ధరలు కిలో రూ.40 లోపు చేరుకున్నాయి. రాబోయే రోజుల్లో ధరలు మరింతగా తగ్గుతాయని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి.

శివారు జిల్లాల నుంచే దిగుమతి
సాధరణంగా ఆన్‌ సీజన్‌లో నగర మార్కెట్‌కు ఇతర రాష్ట్రాల నుంచి కూరగాయలు దిగుమతి అవుతాయి. అన్‌ సీజన్‌లో నగర ప్రజల కూరగాయల అవసరాలు తీర్చడానికి కమిషన్‌ ఏజెంట్లు ఇతర రాష్ట్రాలపై అధారపడాల్సి ఉంటుంది. హైదరాబాద్ శివారు జిల్లాలైన నిజామాబాద్, రంగారెడ్డి, మెదక్, వికారాబాద్‌ల నుంచి ఎక్కువ మోతాదులో నగరంలోని బోయిన్‌పల్లి, గుడిమల్కాపూర్, ఎల్‌బీనగర్‌తో పాటు ఇతర మార్కెట్‌లకు రోజుకు 70 నుంచి 80 శాతం వివిధ రకాల కూరగాయలు దిగుమతి అవుతున్నాయి. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్, కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రల నుంచే కూరగాయల దిమతులు ఉండేవి. ప్రస్తుతం నగర శివారుతో పాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి కూడా కూరగాయల దిగుమతులు పెరగడంతో ధరలు తగ్గుముఖం పట్టాయి. 

ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది
ఈ ఏడాది అక్టోబర్‌ ప్రారంభం నుంచే కూరగాయల ధరలు స్ధిరంగా ఉన్నాయి. ఇందుకు కారణం హైదరాబాద్ శివారు ప్రాంతాల నుంచి నగర మార్కెట్‌కు రోజు దాదాపు అన్ని రకాల కూరగాయలు దిగుమతి అవుతున్నాయి. గతంలో శివారు ప్రాంతాల నుంచి రోజూ కూరగాయల దిగుమతులు ఉండేవి కావు.  ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా నీటి లభ్యత ఎక్కువగా ఉండడంతో రైతులు ఎక్కువగా కూరగాయలు పండిస్తున్నారు. ప్రత్యేకంగా రంగారెడ్డి, వికారాబాద్, మెదక్‌ జిల్లాల రైతులు ఈ ఏడాది జూలై నుంచే కూరగాయలను సాగు చేస్తున్నారు. దీంతో సెప్టెంబర్‌ చివరి వారం నుంచే పంట చేతికొచ్చింది.   గతంలో ఇతర రాష్ట్రాల నుంచి మార్కెట్లకు రాని కూరగాయలను కమిషన్‌ ఏజెంట్లు దిగుమతి చేసేవారు. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి అయ్యే కూరగాయల ధరలు ఎక్కువగా  ఉండడంతో ధరలు నిలకడగా ఉండేవి కావని వ్యాపారులు చెబుతున్నారు.