సామాన్యుడి జేబుకు చిల్లు : కొండెక్కిన కూరగాయల ధరలు

  • Publish Date - April 25, 2019 / 04:36 AM IST

ఎండలు మండుతున్నాయి. వీటితో పాటు కూరగాయల ధరలు సుర్రుమంటున్నాయి. ధరలు కుతకుత ఉడుకుతూ..సామాన్యుల గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి. టమాట మోత మోగిస్తుంటే..చిక్కుడు చికాకు పెడుతోంది. పచ్చిమిర్చి మరింత ఘాటు ఎక్కితే..బీన్స్ బెంబేలెత్తిస్తోంది. కూరగాయాల ధరలను పైకి ఎగబాకుతున్నాయి. నగరంలో కూరగాయల ధరలు మండుతున్నాయి. ఎండలు మండిపోతుండటం..నీటి కొరతతో కూరగాయల ఉత్పత్తి పడిపోవడం కారణమంటున్నారు. ఈ ధరలు నగరంలోని ఏ ఒక్క మార్కెట్‌కు పరిమితం కాలేదు. మెహిదీపట్నం, మోండా మార్కెట్, గుడి మల్కాపూర్..ఏ మార్కెట్‌కు వెళ్లినా ధరలు భగ్గుమంటున్నాయి. దీంతో సామాన్యుడి జేబుకు చిల్లులు పడుతున్నాయి. 

నగరంలోని ప్రధాన మార్కెటలతో పాటు రైతు బజార్లకు సరఫరా త్గగడంతో కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. రెండు వారాల క్రితం కిలో 15 రూపాయలు వున్న టమాటా ధర ఇప్పుడు ఏకంగా 40 రూపాయలకు చేరింది. మార్చి చివరి వారంలో కిలో 10 నుండి 15 రూపాయలు ఉంటే..ఏప్రిల్ మొదటి వారంలో 15 నుండి 18 రూపాయల మధ్య ఉన్న ధరలు ఒక్క సారిగా పెరిగాయి. టమాటా కిలో 40 రూపాయలు వుండగా పచ్చిమిర్చి కిలో 60 రూపాయలు, వంకాయ 50 రూపాయలు, బెండకాయ 50 రూపాయలు ఇలా ప్రతి కూరగాయి ధర పెరిగింది.

రంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, సిద్దిపేట, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల నుంచి అధికంగా నగరానికి దిగుమతి అవుతున్నాయి. వీటితో పాటు కర్నాటక, మహారాష్ట్ర నుంచి వచ్చే టమాటా, క్యాప్సికం, ఆలు ఉత్పత్తులు తగ్గాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి దిగుమతులు బాగా తగ్గాయని కూరగాయల వ్యాపారులు అంటున్నారు. ఎండాకాలం వలన నీటి కొరత వలన పంట దిగుబడి తగ్గిందని అంతేగాకుండా మోటారు బోర్ల నుండి నీరు రావడం లేదని..వ్యాపారులు అంటున్నారు. జూన్ నెల వచ్చే వరకు కూరగాయల ధరలు అధికంగా వుండే అవకాశం ఉందని చెప్తున్నారు.

కూరగాయల రేట్లు అధికంగా వుండటంతో కొనుగోలు దారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజు వారి ప్రక్రియలో భాగంగా కొనాల్సిందేనని కానీ రైతు బజార్లలో వీటి రేట్ల ధరలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. కిలో టమాటా 40 రూపాయలు, పచ్చిమిర్చి 60 రూపాయలు ధరలు పలుకుతున్నాయన్నారు. మిగతా కూరగాయల ధరలు అలాగే ఉన్నాయని..దీంతో కూరగాయలు కొనాలంటే భయపడాల్సి వస్తుందని..ధరలు తగ్గించాలని కోరుతున్నారు. ఎండాకాలం వలన నీటి కొరత ఏర్పడటంతో నగరానికి సమీప జిల్లాల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుండి కూరగాయల దిగుమతి తగ్గడంతో కూరగాయల ధరలు పెరిగాయి. జూన్ వరకు కూరగాయల రేట్లు అధికంగానే ఉంటాయని వ్యాపారులు అంటున్నారు.