తెలంగాణ సరిహద్దులు మూసివేత

  • Publish Date - March 23, 2020 / 07:43 AM IST

కరోన వైరస్ వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం వారం రోజులపాటు లాక్ డౌన్ ప్రకటించినప్పటికీ ప్రజలు  నిర్లక్ష్యంగా రోడ్లపైకి రావటంతో తెలంగాణ  ప్రభుత్వం కఠినంగా వ్యవహరించటం మొదలెట్టింది. రోడ్లపైకి వచ్చిన  వాహనాలను పోలీసులు సీజ్ చేస్తున్నారు. మరో వైపు తెలంగాణలోకి ఇతర రాష్ట్రాలనుంచి వచ్చే అన్ని రహదారులను మూసి వేశారు. ఆంధ్రప్రదేశ్ , కర్ణాటక, మహారాష్ట్ర, చత్తీస్ ఘడ్ ల నుంచి వచ్చే అన్ని రహదారులను మూసివేసి ఆయా రాష్ట్రాలనుంచి వాహనాలు రాష్ట్రంలోని ప్రవేశించకుండా నిరోధించారు.  దీంతో సరిహద్దులోనే వాహనాలన్నీ నిలిచిపోయాయి. 

తెలంగాణ రాష్ట్ర సరిహద్దైన సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం క్రాస్‌రోడ్డులో చెక్‌పోస్టు వద్ద పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి వాహనాలను రాష్ట్రంలోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారు. సరిహద్దులోకి వచ్చిన లారీలు, డీసీఎం వంటి వాహనాలను పక్కనే ఉన్న వెంచర్‌లో పార్కింగ్‌ ఏర్పాటు చేసి నిలిపారు. కార్లను సైతం నిలిపివేశారు. ఈనెల 31 వరకు లాకౌడౌన్‌ కొనసాగుతుండటంతో రాష్ట్రంలోకి వాహనాలను అనుమతించబోమని స్పష్టం చేశారు. ఎవరికీ ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో డ్రైవర్లకు, క్లీనర్లకు రవాణా శాఖ అధికారులు భోజన సదుపాయం ఏర్పాటు చేశారు.

మరో వైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వారం రోజులపాటు లాక్ డౌన్ ప్రకటించినప్పటికీ చాలామంది రోడ్లపైకి వచ్చారు, జాతీయ రహదారిపై పక్క రాష్ట్రమైన తెలంగాణకు పయనం కాగా కంచికచర్ల మండలం దొనబండ చెక్‌పోస్టు వద్ద పోలీసుల వారిని అడ్డుకున్నారు. దీంతో కొంతసేపు గందరగోళ పరిస్ధితి నెలకొంది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలకు అనుమతి లేదంటూ పోలీసులు వాహనాలను నిలిపివేయగా వాహనదారులు పోలీసులతో వాగ్వాదం చేశారు. 

తెలంగాణలో అనేక చెక్‌పోస్టులు ఏర్పాటయ్యాయని వెళ్ళటం కుదరదని  పోలీసులు చెప్పినప్పటికీ  వాహనదారులు గొడవకు దిగారు. ఈ క్రమంలో పరిస్థితి అదుపు తప్పకుండా కొన్ని వాహనాలను అనుమతించారు. అయినప్పటికీ ఆ వాహనాలను రామాపురం చెక్ పోస్టు వద్ద  తెలంగాణ పోలీసులు నిలిపివేశారు. ఈ నేపథ్యంలో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. 

See Also | రోడ్డెక్కితే వెహికల్స్ సీజ్.. 7దాటితే మనుషులు కనిపించొద్దు: డీజీపీ