హైదరాబాద్‌లో ఓ ట్రాఫిక్ ఇన్స్‌పెక్టర్ మానవత్వాన్ని చాటుకున్నాడు. శుక్రవారం హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఎల్‌బీ నగర్ – సాగర్ రింగ్‌రోడ్డుకు వెళ్లే దారిలో భారీగా నీళ్లు నిలిచాయి. ట్రాఫిక్ ఇన్స్‌పెక్టర్ అంజపల్లి నాగమల్లు వాటర్ క్లియర్ చేసే పనిలో ఉన్నారు.
ఇదే సమయంలో అనారోగ్యంతో ఉన్న తండ్రిని ఓ కుమారుడు స్కూటీపై తీసుకెళ్తుండగా వరద నీటిలో ఆ బండి ఆగిపోయింది. నడవలేని స్థితిలో ఉన్న ఆ వృద్ధుడిని ట్రాఫిక్ ఇన్స్‌పెక్టర్ తన వీపుపై మోస్తూ నీళ్ల నుంచి బయటకు తీసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్‌పై వీడేలా పోలీస్ అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కూడా స్పందించారు. పోలీసును అభినందించారు. ఈ మేరకు ట్విట్టర్లో వీడియో ట్వీట్ చేశారు.
మరోవైపు పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతూ ఎత్తుకి వెళ్లే కొద్దీ నైరుతి వైపు వంగి ఉందని విశాఖపట్నంలోని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. దీనికి అనుబంధంగా వాయువ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ బెంగాల్ పరిసరాల్లో కొనసాగుతోంది.
దీని ప్రభావం ఏపీ పై అంతగా ఉండదని విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 2019, సెప్టెంబర్ 02వ తేదీన మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ గురువారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. దీని ప్రభావంతో ఆగస్టు 31 శనివారం, సెప్టెంబర్ 1, 2 తేదీల్లో కోస్తాలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని ఐఎండీ వెల్లడించింది.