ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రైతు సమ్మాన్ నిధి పథకాన్ని గులాబి పార్టీ స్వాగతిస్తూనే….. చురకలు అంటించింది. ఇది ఓటాన్ బడ్జెట్ గా లేదని ఓటర్ల బడ్జెట్ గా ఉందని ఎద్దేవా చేసింది. రైతు సమస్యలపై కేసిఆర్ కు ఉన్న ముందు చూపు ప్రధాని మోడీకి లేదని ఎంపీ అసదుద్దీన్ ఘాటుగా స్పందించారు. కేంద్రానికి ముందు చూపులేదని….ఈ సమయంలో దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కేసిఆర్ లాంటి నేత అవసరమని అభిప్రాయ పడ్డారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఓటాన్ బడ్జెట్ పై గులాబి పార్టీ విమర్శలు గుప్పించింది. నాలుగున్నరేళ్లు ప్రజలను పట్టించుకోని కేంద్రం ఇప్పుడు ఓటర్లను ఆకట్టుకునేందుకు అనుగుణంగా బడ్జెట్ ప్రవేశ పెట్టిందని పార్టీ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ స్థాయిలో రైతు బంధు పథకం మాదిరిగానే ప్రకటించిన పథకం కేంద్రం కాపీ కొట్టిందని టీఆర్ఎస్ ఎంపీ కవిత అన్నారు. కేంద్ర బడ్జెట్‌పై ట్విట్టర్ ద్వారా స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం ఎకరాకు రెండు దఫాలుగా 5 వేలు ఇస్తోందని, కానీ కేంద్ర ప్రభుత్వం తమ పథకంలో ఎకరాకు 6 వేలు కేటాయించినట్లు ఆమె చెప్పారు. cమోడీ రైతు బందు పథకాన్ని మెరుగు పర్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయ పడుతూనే ఈ పథకాన్ని స్వాగతిస్తున్నట్లు ఆమె తెలిపారు.
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ కూడా కేంద్ర బడ్జెట్ పై ట్విట్టర్ ద్వారానే స్పందించారు. రైతుల కోసం ప్రకటించిన పథకం బుజ్జగింపు పథకంగా అభివర్ణించారు. తెలంగాణా ముఖ్యమంత్రి కేసిఆర్ మదిలో మెరిసిన రైతు బంధు పథకం ఆదర్శంగా నిలుస్తోందన్నారు. కాగా…బడ్జెట్ పై గులాబి పార్టీ ఎంపీలు పెదవి విరిచారు.
కేటిఆర్ చేసిన వ్యాఖ్యలను ఎంపీ అసదుద్దీన్ సమర్ధిస్తూనే కేంద్ర ప్రభుత్వ అనుసరించిన విధానాన్ని తప్పుబట్టారు. రైతుల కోసం దూరదృష్టితో తెలంగాణా ముఖ్యమంత్రి కేసిఆర్ అమలు చేసిన పథకాన్ని కేంద్రం కాపీ, పేస్ట్ చేసిందని ఎద్దేవా చేశారు. సొంత ఆలోచనలతో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ను రూపొందించడంలో విఫలమైందన్నారు. ఇదే సమయంలో కేసిఆర్ లాంటి నేత దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమని అభిప్రాయ పడ్డారు.