హైదరాబాద్ : మరఠ్వాడా నుంచి కోమోరిన్ ప్రాంతం వరకు ఇంటీరియర్ కర్ణాటక, ఇంటీరియర్ తమిళనాడు మీదుగా 0.9 కి.మీ ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారలు పేర్కొన్నారు. అలాగే దక్షిణ ఛత్తీస్‌గఢ్, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. హిందూ మహాసముద్రం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ ఆగ్నేయ బంగాళాఖాతం మధ్య ప్రాంతాల్లో అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావం వలన రానున్న మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో (గంటకు 40 నుంచి 50 కి.మీ) తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
కాగా…. గురువారం మూహబూబ్ నగర్ లో అత్యధికంగా 41.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, భద్రాచలంలో 41, ఆదిలాబాద్, రామగుండంలలో 40 , నిజామాబాద్ 39.5, నల్గొండ 39.4, హైదరాబాద్ 39,హన్మకొండలో 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
మరో వైపు ఏపీ లో కూడా రానున్న మూడు రోజుల్లో రాయలసీమ, కోస్తాంధ్రలో తేలికపాటి వర్షాలు కురవొచ్చని విశాఖపట్నంలోని వాతావరణ శాఖ అధికారుల తెలిపారు. ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో జల్లులు పడతాయని, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ వివరించింది. రాయలసీమలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా రెండు, మూడు డిగ్రీలు అదనంగా పెరుగుతాయని తెలిపింది.