హైదరాబాద్ : తెలంగాణ దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ ఆవర్తనం నుంచి కోమోరిన్ ప్రాంతం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావం వల్ల రాష్ట్రంలో రాగల 24 గంటల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అదే సమయంలో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మరో వైపు ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.