కేంద్ర ప్రభుత్వం సెప్టెంబరు 1, 2019 నుంచి అమల్లోకి తీసుకువచ్చిన కొత్త మోటారు వాహన సవరణ చట్టం అమలుపై తెలుగు రాష్ట్రాలు నిర్ణయం తీసుకోలేదు. ఆ చట్టంపై సమీక్షించిన తర్వాతే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఒక నిర్ణయం తీసుకునే అవకాశముంది. ప్రస్తుతమున్న పెనాల్టీలను ఏకంగా 10 రెట్లకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టంపై మళ్లీ ఆలోచించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. భారీ మొత్తంలో ఫైన్‌లు ఒకేసారి పెంచితే సాధారణ ప్రజానీకంపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నట్లు ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో కొత్త చట్టంపై ప్రజల్లో ఇంకా అవగాహన కల్పిస్తామని తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ చెప్పారు. ఏపీ, కర్ణాటక, కేరళ లో కూడా అమలు చేయటం లేదని ఆయన అన్నారు. రవాణా శాఖాధికారులతో చర్చించిన తర్వాతే రెండు తెలుగు ప్రభుత్వాలు చట్టం అమలుపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కనుక తెలుగు రాష్ట్రాల్లో చట్టం అమలు నిర్ణయంపై మరికొంత సమయం పట్టే అవకాశముంది.
వీటికి తోడు బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలు కూడా చట్టం అమలుకు నిరాకరించాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మోటారు వాహన చట్ట సవరణను పశ్చిమ బెంగాల్‌తో పాటు కాంగ్రెస్ పాలిత ప్రాంతాలైన మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు జరిమానాలు అధికంగా ఉన్నాయంటూ ఆయా రాష్ట్రాల్లో అమలు పరిచేందుకు నిరాకరించాయి. కాగా రాజస్థాన్ ప్రభుత్వం మాత్రం కేంద్రం విధించిన జరిమానాలపై సమీక్ష సమావేశం నిర్వహించనుంది.
కేంద్రం తీసుకువచ్చిన చట్టంలో భారీ ఎత్తున జరిమానాలు విధించారు. ముఖ్యంగా లైసెన్స్ లేకుంటే రూ.5000 , హెల్మెంటే లేకుండా నడిపితే రూ.2000, సీటు బెల్టు పెట్టుకోకుండా వాహనం నడిపితే 1000 రుపాయలు జరిమానా. మద్యం సేవించి పట్టుపడినా, అత్యవసర వాహనాలకు దారి ఇవ్వకున్నా 10వేల రుపాయాల ఫైన్ విధించనున్నారు. మరోవైపు అతివేగంతో పట్టుబడిన వాహనాలకు రూ.2000 జరిమానా విధించనున్నారు. ఈ చట్టం అమలుకు తెలుగు రాష్ట్రాల్లో మరికొంత సమయం పట్టే అవకాశం ఉండటంతో వాహనదారులకు కొంత ఊరట లభించినట్లు అయ్యింది.
Also Read : సోషల్ మీడియా పుణ్యమా అని : 24గంటల్లో రూ.89లక్షల ట్రాఫిక్ చలాన్లు చెల్లింపు