TV9లో రవిప్రకాశ్‌ వాటా ఎంత? చక్రం తిప్పాలనే ఇలా చేశాడా?

  • Publish Date - May 9, 2019 / 10:22 AM IST

Tv9 మాజీ సీఈఓ రవిప్రకాశ్‌ కేసుల విషయంలో లోతైన పరిశీలన చేస్తే రవిప్రకాశ్‌ దురుద్దేశ పూర్వక చర్యలు స్పష్టంగా అర్థం అవుతాయి.

1. ABCLలో పెట్టుబడికి సంబంధించి తలెత్తిన ఒక వివాదంలో మారిషస్‌కు చెందిన సైఫ్ త్రీ మారిషస్ కంపెనీ లిమిటెడ్ అనే సంస్థ జనవరి, 2018లో NCLTని ఆశ్రయించింది. దీనిపై  విచారణ జరిపిన NCLT..   ABCL తన ఆస్తులను కానీ, షేర్లను కానీ అమ్మరాదని సెప్టెంబర్ 4, 2018న ఒక మధ్యంతర ఉత్తర్వును జారీ చేసింది. ఈ ఆదేశాలను యదావిధిగా కొనసాగిస్తూ NCLT జనవరి 21, 2019న మరో మధ్యంతర ఉత్తర్వును ఇచ్చింది.

ఆ తర్వాత శ్రీనిరాజుకు, సైఫ్ త్రీ మారిషస్‌కంపెనీ లిమిటెడ్‌కు మధ్య సెటిల్‌మెంట్‌ఒప్పందం కుదిరింది.   ఇదే విషయాన్ని గత వారం NCLT  కి తెలియపరిస్తూ, ఉపసంహరణ పిటిషన్‌ను ఇరుపక్షాలు దాఖలు చేశాయి. దీనికి సంబంధించి NCLT  తుది ఉత్తర్వులను వెలువరచాల్సి ఉంది. అయితే,  ABCL కంపెనీ షేర్లు కలిగి ఉన్న వ్యక్తుల మధ్య లావాదేవీలపై మాత్రం NCLT మధ్యంతర  ఉత్తర్వుల్లో ఎలాంటి ఆంక్షలు లేవు. అలాంటప్పుడు శివాజీకి వ్యక్తిగత హోదాలో తన వద్ద ఉన్న షేర్లు అమ్మేందుకు అంగీకరించిన రవిప్రకాశ్ ఈ ఉత్తర్వులను సాకుగా చూపించి షేర్ల బదిలీని నిలిపివేయడం వెనుక ఆంతర్యం ఏంటి?

2. NCLT ఉత్తర్వులు ఎప్పుడో సెప్టెంబర్ 4, 2018లో వెలువడగా, ఈ విషయం తనకు కొద్ది రోజుల ముందే తెలిసిందని ఆ కంపెనీ సీఈవో, డైరెక్టర్ గా ఉన్న రవిప్రకాశ్ మార్చి 17,2019న శివాజీకి లిఖిత పూర్వకంగా చెప్పడం ఈ వ్యవహారంలో ఉన్న మతలబును బయటపెడుతోంది.

3.  కంపెనీకి సీఈవోగా, డైరెక్టర్‌గా రవిప్రకాశ్‌కు NCLT జారీ చేసిన న్యాయపరమైన ఉత్తర్వులు తెలియకపోవడం ఏ మాత్రం నమ్మశక్యం కానిదిగా కనిపిస్తోంది. పైగా ఈ వ్యవధిలో కనీసం రెండుసార్లు ABCL బోర్డు సమావేశాలు జరగడం గమనార్హం.

4. NCLT  ఉత్తర్వులు వచ్చిన తర్వాత కూడా, కొత్త యాజమాన్యానికి సంబంధించిన నలుగురు డైరెక్టర్లను ABCL బోర్డులో చేర్చుకునేందుకు 2018 అక్టోబర్‌లో ఒకసారి, 2019 జనవరిలో మరోసారి బోర్డు మీటింగులు నిర్వహించి, కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ అనుమతి కోరేందుకు ఎలాంటి ఇబ్బంది లేని రవిప్రకాశ్‌కు… తన దగ్గర వ్యక్తిగత హోదాలో ఉన్న 40 వేల షేర్లను శివాజీకి బదలాయించడానికి ఉన్న అడ్డంకి ఏంటో అంతుపట్టనిదిగా ఉంది. పైగా ఈ వ్యవహారం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిందే కానీ, ఈ విషయంలో ABCLకి ఏమాత్రం ప్రమేయం లేదు. వాస్తవం ఇలా ఉండగా, దీన్ని ఒక వివాదంగా సృష్టించి, న్యాయపరమైన చిక్కులు కల్పించి ABCL కొత్త యాజమాన్యానికి ఆ కంపెనీ నిర్వహణలో అడ్డంకులు కల్పించడమే రవిప్రకాశ్ దురుద్దేశ్యమని స్పష్టం అవుతోంది. 

Tv9 నిర్వహణలో రవిప్రకాశ్ మొదటి నుంచి వ్యవహరించిన తీరును చూస్తే, మరిన్ని అనుమానాలు కలగక మానవు. అవి ఏమిటంటే..
1. టీవీ9 స్థాపించినప్పటి నుంచి ఆ కంపెనీలో అత్యధిక వాటా వేరే వారిదైనా నామమాత్రపు వాటా కలిగిన రవిప్రకాశ్ Tv9ను తన సొంత కంపెనీ అన్నట్లుగా వ్యవహరించడం. మొదటి నుంచి కూడా Tv9ను రవిప్రకాశ్‌దే అన్నట్లుగా ఆయన జనాల్లోకి తీసుకుని వెళ్లిన విషయం తెలిసిందే. 
2. Tv9 సంస్థను అమ్మేందుకు Tv9 పాత యాజమాన్యం గత కొన్ని సంవత్సరాలుగా చేసిన  ప్రయత్నాలు, వివిధ సంస్థలతో జరిపిన చర్చలను సఫలం కాకుండా చేసేందుకు రవిప్రకాశ్ తనదైన శైలిలో వ్యవహిరంచారని ప్రచారంలో ఉంది.
3. గతేడాది ఆగష్ట్‌లో జరిగిన లావాదేవీ ద్వారా టీవీ9 సంస్థ కొత్త యాజమాన్యం చేతుల్లోకి వెళ్లిపోయింది. దీనిని ఏమాత్రం జీర్ణించుకోలేని రవిప్రకాశ్, టీవీ9లో ఎప్పటికీ చక్రం తిప్పాలనే దురుద్దేశంతో అన్నీ రకాల ప్రయత్నాలు చేశారనేది ప్రచారంలో ఉన్న విషయమే. 
4. టీవీ9 సంస్థ నిర్వహణకు సీఈవో హోదాలో గుడిలోకి పూజారి మాదిరిగా వచ్చిన రవిప్రకాశ్… చివరికి తానే దేవుణ్ణి నేనే అన్నట్లుగా తయారయ్యారని, 10 శాతం కూడా వాటా లేని రవిప్రకాశ్.. 90 శాతం వాటాదారులకి అడ్డంకులు కలిగించారని, ప్రస్తుత తీరు చూస్తే..  ఏకు మేకై కూర్చోవడం లాగా కనిపిస్తోంది. 

మొత్తం వివాదంలో తలెత్తుతున్న అనుమానాస్పద అంశాలు:

1. టీవీ9 స్థాపించినప్పటి నుంచీ రవిప్రకాశ్‌ది మైనార్టీ వాటానే. ప్రధాన పెట్టుబడి అంతా ఇతర వ్యక్తులు, సంస్థల నుంచే వచ్చింది. అయినప్పటికీ రవిప్రకాశ్ అంతా తానై వ్యవహరించడం మొదటి నుంచి వివాదాస్పదమే.
2. కంపెనీలను అమ్మడం, కొనడం కార్పొరేట్ రంగంలో సర్వసాధారణం. టీవీ9లో మైనార్టీ వాటా ఉన్న రవిప్రకాశ్, ఈ సంస్థలో మెజార్టీ వాటా ఉన్న యాజమాన్యానికి అడ్డంకులు సృష్టించడం వెనుక ఆంతర్యం ఏంటి?
3. ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా క్షణాల్లో తెలుసుకునే టెలివిజన్ ఛానెల్‌ను నిర్వహిస్తున్నానని గొప్పగా చెప్పుకునే రవిప్రకాశ్‌… తాను సీఈవోగా, డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న టీవీ9కి సంబంధించి NCLT జారీచేసిన ఉత్తర్వులు నెలల తరబడి తెలియని పరిస్థితిలో ఉన్నారంటే…  నమ్మశక్యమేనా?
4. టీవీ9 నిర్వహణలో భాగంగా గత కొన్నేళ్లుగా జరిగిన ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలు జరిగాయనే అనుమానాలు బలంగా ఉన్న నేపథ్యంలో, ఈ బండారం బయటపడుతుందన్న భయంతోనే కొత్త యాజమాన్యానికి ఇబ్బందులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారా..?
5. టీవీ9 కొత్త యాజమాన్యం చేతుల్లోకి వెళ్లిపోవడానికి వ్యతిరేకంగా కొన్ని వెబ్‌సైట్లలో, సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారం వెనుక ఉన్న హస్తం ఎవరిది? దీనివల్ల ప్రయోజనం ఎవరికి? ఈ ప్రక్రియలో భాగంగా, కంపెనీకి సంబంధించిన రహస్య సమాచారం కూడా బయటకు పొక్కడానికి బాధ్యులెవరు?
6. వ్యక్తిగత హోదాలో డబ్బులు తీసుకుని, షేర్లను బదలాయించకుండా ఉంది రవిప్రకాశ్ అయితే, ఈ వివాదంలోకి ABCL ను  శివాజీ లాగడం వెనుక మర్మమేంటి? ఓ వైపు రవిప్రకాశ్‌ తనను నమ్మించి మోసం చేశారని ఆరోపిస్తున్న శివాజీ, మరోవైపు మాత్రం టీవీ9 నిర్వహణలో యదాతథస్థితిని (అంటే రవిప్రకాశ్ నేతృత్వంలోనే టీవీ9 పనిచేయాలని) కొనసాగించేలా ఆదేశించాలని NCLTని కోరడం వెనుక ఉద్దేశ్యం ఏంటి? 
7. నిజంగా రవిప్రకాశ్ మోసం చేస్తే, అతనికి వ్యతిరేకంగా కోర్టులో సివిల్ సూట్‌నో లేదా పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసునో దాఖలు చేయాలి. కానీ నేరుగా NCLT ని శివాజీ ఆశ్రయించడం, ఈ మొత్తం వ్యవహారంలో దాగి ఉన్న దురుద్దేశాన్ని బయటపెడుతోంది.