తెలంగాణ కేబినెట్ విస్తరణ ఎప్పుడు.. మంత్రివర్గాన్ని విస్తరిస్తే కేటీఆర్, హరీష్‌రావుకు చోటు ఉంటుందా.. ఉండదా?
హైదరాబాద్ : తెలంగాణ కేబినెట్ విస్తరణ ఎప్పుడు.. మంత్రివర్గాన్ని విస్తరిస్తే కేటీఆర్, హరీష్‌రావుకు చోటు ఉంటుందా.. ఉండదా? ఏ ఇద్దరు టీఆర్ఎస్ కార్యకర్తలు కలిసినా.. ఈ విషయంపైనే చర్చించుకుంటున్నారు. రెండోసారి అధికారం చేజిక్కించుకున్న సీఎం కేసీఆర్.. మంత్రివర్గ విస్తరణకు మంచి ముహూర్తం కోసం ఎదురుచూస్తున్నారు. తొలి విడతలో కేసీఆర్‌తో పాటు హోం మంత్రి మహమూద్ అలీ పదవీ బాధ్యతలు చేపట్టారు. రెండో విడత మంత్రి వర్గ విస్తరణ కోసం టీఆర్ఎస్ నేతలు ఎదురుచూస్తున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోపు మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశముందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే టీఆర్ఎస్ ముఖ్య నేతలు కేటీఆర్, హరీష్ రావుకు ఈ విడత మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కుతుందా.. లేదా అన్నది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
కేసీఆర్ సెంటిమెంట్ కు అనుగుణంగా శుభముహూర్తాల సమయం కూడా వచ్చింది. ఫిబ్రవరి 5 నుంచి మాఘ మాసం ప్రారంభం కానుంది. ఆరవ తేదీ తర్వాత… మంత్రి వర్గ విస్తరణ ఎప్పుడైనా జరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అయితే ఈ విడతలో పూర్తిస్థాయి మంత్రివర్గ విస్తరణ జరగకపోవచ్చని.. పార్లమెంట్ ఎన్నికల తర్వాతే పూర్తిస్థాయి కేబినెట్ కొలువుదీరుతుందని టీఆర్ఎస్ నేతలు అభిప్రాయ పడుతున్నారు. మినీ కేబినెట్ ఏర్పాటు చేస్తే కేటీఆర్, హరీష్‌రావుకు చోటు ఉండబోదన్న వార్తలు వినిపిస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికల తర్వాతే వీరిని కేబినెట్‌లోకి తీసుకోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మంత్రి వర్గంలో కొందరికే ఛాన్స్ ఉండటంతో.. వారికి సహాయకులుగా పార్లమెంటరీ కార్యదర్శులను నియమించేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అయిన సీఎం కేసీఆర్.. మంత్రివర్గంలో ఎవరికి చోటు కల్పిస్తారో వేచి చూడాలి మరి.