ఎవరైతే బాగుంటుంది : కొత్త TPCC Chiefపై కసరత్తు

  • Publish Date - December 10, 2020 / 07:00 AM IST

Who after Uttam ? : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ర‌థసార‌థి ఎంపిక‌పై క‌స‌ర‌త్తు ప్రారంభ‌మైంది. పీసీసీ చీఫ్‌ పదవికి ఉత్తమ్ రాజీనామా చేయ‌డంతో.. కొత్తవారి ఎంపిక అనివార్యమైంది. దీంతో.. పార్టీ రాష్ట్ర వ్యవ‌హారాల ఇంచార్జ్ మానిక్కమ్ ఠాగూర్‌ను రంగంలోకి దింపింది కాంగ్రెస్ అధిష్టానం. మరి పీసీసీ ఛీప్‌ ఎంపిక ఎక్కడి వరకు వచ్చింది.. తర్వాత కుర్చీ ఎవరికిస్తారు. తెలంగాణ పీపీసీ ఎంపికపై కసరత్తు చేస్తోంది కాంగ్రెస్ అధిష్టానం. పీసీసీ ఎంపిక‌ను గతంలో పార్టీ అధిష్టానం నేరుగా నియ‌మించేది. కానీ ఈసారి కాస్త భిన్నమైన ప్రక్రియ‌ను చేప‌ట్టింది. పార్టీ ప‌ద‌విని ఆశిస్తున్న వారు అధికంగా ఉండ‌టంతో.. విస్తృత అభిప్రాయ సేక‌ర‌ణ త‌ర్వాతే అధ్యక్షుడిని ప్రక‌టించాల‌ని డిసైడ్ అయ్యింది. దీనికోసం కోసం హైదరాబాద్‌ వచ్చారు ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జ్‌ మానిక్కమ్‌ ఠాగూర్‌.



మూడు రోజుల అభిప్రాయ సేకరణలో భాగంగా.. మొదటి రోజు కోర్‌ కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త అధ్యక్షుడు వచ్చే వరకు ఉత్తమ్‌ టీపీసీసీ చీఫ్‌గా ఉంటారని తేల్చిచెప్పారు. ఇక స‌భ్యులంద‌రికీ ఠాగూర్ స్పష్టమైన సందేశం ఇచ్చిన‌ట్లు పార్టీ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. స‌మావేశంలో జ‌రిగిన వివ‌రాలు లేదా.. ఒక్కొక్కరిగా వెలువ‌రించిన అంశాల‌ను మీడియాతో షేర్ చేసుకోకూడ‌ద‌ని కండీష‌న్ పెట్టార‌ట‌. అలాగే.. పార్టీలో ప‌ద‌వి కోసం గ్రూపులుగా విడిపోయి.. సోష‌ల్ మీడియాలో ఒకరిపై మ‌రొక‌రు కామెంట్లు చేసుకోవ‌డం కూడా స‌రైంది కాద‌ని హెచ్చరించినట్లు తెలుస్తోంది.



పార్టీ ఇంచార్జ్ ఇచ్చిన స్వీట్ వార్నింగ్‌తో సీనియ‌ర్ నేత‌లు సైతం.. స‌మావేశం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాక నోరు మెదిపిన దాఖ‌లాలు లేవు. సీనియ‌ర్ నేత జానారెడ్డి సైతం.. పార్టీ లైన్ ఎక్కడా దాట‌నంటూ చెప్పుకొచ్చారు. త‌న అభిప్రాయాన్ని పార్టీకి చెప్పాన‌ని.. అంతిమంగా పీసీసీ ఎవ‌ర‌నేది పార్టీ డిసైడ్ చేస్తుంద‌ని చెప్పుకొచ్చారు. పార్టీలో వ్యక్తిగ‌త అభిప్రాయానికి తావుండ‌ద‌ని.. అంతిమంగా అధిష్టానం తీసుకునే నిర్ణయ‌మే ఫైన‌ల్ అంటూ చెప్పుకొచ్చారు.  అయితే అభిప్రాయ సేకరణపై కాంగ్రెస్‌ నేతలు భిన్నవాదనలు వినిపిస్తున్నారు. పీసీసీ చీఫ్‌ కోసం మొదటిసారి అభిప్రాయ సేకరణ జరగడం తమ దురదృష్టమన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. గతంలో ఇలా అభిప్రాయ సేకరణ ఎన్నడూ జరగలేదని చెప్పారు.



సో మొత్తం మీద మొద‌టి రోజు జ‌రిగిన.. కోర్ క‌మిటీలో ఎక్కడా ఎలాంటి విభేదాలు బ‌య‌ట‌కు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు కాంగ్రెస్‌ నేతలు. ఇక 2020, డిసెంబర్ 10వ తేదీ గురువారం కేంద్ర, రాష్ట్ర మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల‌తో ఒక్కొక్కరి అభిప్రాయాల‌ను సేక‌రించ‌నున్నారు. పార్టీలోని అన్ని విభాగాల నేత‌ల‌తో స‌మాచారం సేక‌రించ‌నున్నారు మానిక్కమ్ ఠాగూర్‌.