తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా చేసుకుంటున్నారు అభిమానులు, టీఆర్ఎస్ కార్యకర్తలు. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు రాజకీయ, సినీ, ఇతర రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు బర్త్ డే విషెస్ చెబుతున్నారు.
ఈ క్రమంలోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్మన్ రోజా.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. కేసీఆర్ బర్త్‌డే సందర్భంగా ఇవాళ(ఫిబ్రవరి 17) ప్రగతి భవన్‌లో ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ప్రముఖుల రాకతో ప్రగతి భవన్‌లో సందడి నెలకొంది.
ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ను కలిసి బర్త్‌డే విషెస్ చెప్పిన వారిలో స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు, వివిధ సంఘాల నాయకులు ఉన్నారు.
మరోవైపు సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్యమంత్రికి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.