Myanmar Earthquake : మియన్మార్‌లో భూకంప బీభత్సం.. క్షతగాత్రులతో నిండిపోయిన వెయ్యి పడకల ఆస్పత్రి, వీధుల్లోనే బాధితులకు చికిత్స..

బాధితులను కుటుంబసభ్యులు ఓదార్చుతున్న భవనం వెలుపలి దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి.

Myanmar Earthquake : మియన్మార్ లో భూకంపం బీభత్సం సృష్టించింది. భూకంపం కారణంగా అనేక భవనాలు పేకమేడల్లా కుప్పకూలాయి. ఇప్పటివరకు 20 మంది ప్రాణాలు కోల్పోగా మరో 50 మంది వరకు గాయపడినట్లు అధికారులు తెలిపారు. భూకంపంతో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్లుగా నివేదికలు అందుతున్నాయి.

మియన్మార్ రాజధాని నెపిడాలోని వెయ్యి పడకల ఆసుపత్రి క్షతగాత్రులతో నిండిపోయింది. గాయపడిన వారికి ఆసుపత్రి భవనం వెలుపల వీధుల్లో చికిత్స అందిస్తున్నారు. బాధితులను కుటుంబసభ్యులు ఓదార్చుతున్న భవనం వెలుపలి దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి.

260 కిలోమీటర్ల దూరంలో ఉన్న సాగింగ్ నగరానికి సమీపంలో 7.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆసుపత్రిలో మృతుల సంఖ్యపై ఎటువంటి నిర్ధారణ లేదు. దేశవ్యాప్తంగా 20 మంది మరణించినట్లు తెలుస్తోంది. ఇంకా పేరు పెట్టని ఈ ఆసుపత్రి నగరంలోని అతిపెద్ద ఆసుపత్రిలలో ఒకటి. “చాలా మంది బాధితులు ఆసుపత్రికి వస్తున్నారు. ఆ ఆసుపత్రి కూడా తీవ్రంగా దెబ్బతింది. పడిపోయిన ప్రవేశ ద్వారం భారీ కాంక్రీటు కింద ఒక కారు నుజ్జు నుజ్జు అయ్యింది” అని డాక్టర్లు తెలిపారు.

Also Read : మియన్మార్, బ్యాంకాక్ లో భారీ భూకంపం.. కుప్పకూలిన భవనాలు.. వీడియోలు వైరల్.. ధాయ్ లాండ్ లో ఎమర్జెన్సీ

భూకంపం మండలేలోని నివాస భవనాలను కూడా దెబ్బతీసింది. ఇరావడి నదిపై ఉన్న పాత వంతెనను ధ్వంసం చేసింది. థాయిలాండ్ సరిహద్దులో ఉన్న ఒక మఠం కూడా ధ్వంసమైంది. ఉత్తర థాయిలాండ్ వరకు ప్రకంపనలు సంభవించాయి. బ్యాంకాక్‌లో కొన్ని మెట్రో సేవలు నిలిపివేశారు. థాయిలాండ్ ప్రధాని పేటోంగ్‌టార్న్ షినవత్రా నగరంలో ఎమర్జెన్సీ ప్రకటించారు.

బ్యాంకాక్‌లోని చతుచక్‌లో నిర్మాణంలో ఉన్న 30 అంతస్తుల భవనం పూర్తిగా కూలిపోవడంతో 78 మంది చిక్కుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాల కోసం ఉద్దేశించిన భవనం కొన్ని సెకన్లలో శిథిలాలు, లోహపు దిబ్బగా మారింది. వందలాది మంది గాయపడినట్లు అంచనా వేసిన అధికారులు.. మృతుల సంఖ్యను నిర్ధారించలేకపోతున్నారు.