Teenager Aman Duggal Surprises Mother (Image Credit To Original Source)
Emotional Video Goes Viral: మీ తల్లిదండ్రులకు లక్షల రూపాయల అప్పులు ఉన్నాయా? ఆ అప్పులను మీరు తీర్చగలరా? “వారు చేసిన అప్పులను నేనెందుకు తీర్చుతాను” అని వదిలేసేవారే చాలా మంది ఉంటారు.
అందులోనూ టీనేజ్ పిల్లలు తల్లిదండ్రుల అప్పుల గురించి అస్సలు పట్టించుకోరు. ఫ్రెండ్స్‌తో కలిసి జల్సాలకు వెళ్లే వారే అధికంగా కనపడతారు. అంతేగానీ, తల్లిదండ్రుల బాధల గురించి పట్టించుకోరు. అలాంటిది ఓ 17 ఏళ్ల కుర్రాడు తన తల్లికి ఉన్న సుమారు రూ.12 లక్షల అప్పులను తీర్చేశాడు.
అంత డబ్బును ఇంత చిన్న వయసులో కష్టపడి సంపాదించి తీసుకొచ్చి అమ్మకు ఇచ్చాడు. ఈ డబ్బుతో ఆమెకున్న అప్పులన్నీ తీర్చుకోవాలని చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
యునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన అమన్ దుగ్గల్ అనే కుర్రాడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో పోస్ట్ చేసి, తన తల్లి అప్పులన్నీ తీర్చానని చెప్పాడు. తన తల్లికి సర్‌ప్రైజ్ ఇస్తానని చెప్పి, అంతకుముందు ఆమెపై తనకున్న ప్రేమ, కృతజ్ఞతను వ్యక్తం చేస్తాడు.
Also Read: బైక్‌లపై తుపాకులతో వచ్చి విచ్చలవిడిగా కాల్పులు.. 30 మంది మృతి, పలువురి అపహరణ
వీడియోలో అమన్ తన తల్లితో మాట్లాడుతూ.. ఐ లవ్యూ అమ్మా అని అంటాడు. కొంతకాలంగా తన తల్లికోసం ఓ పని చేయాలనుకుంటున్నానని చెబుతాడు. దీంతో అతడి తల్లి ఎంతో ఉత్కంఠతో, భావోద్వేగంతో చూస్తుంది. తన కోసం ఆమె చేసిన ప్రతి విషయానికి అమన్ కృతజ్ఞతలు తెలుపుతాడు. తన జీవితంలో ఆమెనే “అత్యంత ప్రత్యేకమైన మహిళ” అని పేర్కొంటాడు.
భావోద్వేగానికి లోనైన తల్లి.. “ఐ టు లవ్యూ, నేను ఎందుకు ఏడుస్తున్నానో కూడా నాకు తెలియదు” అని స్పందిస్తుంది. అనంతరం అమన్ ఆమెను కళ్లు తెరవాలని కోరుతూ డబ్బు అందజేస్తాడు. “ఇది నీకున్న అప్పులన్నీ తీర్చడానికి. ఇక నుంచి ప్రతి నెల నీ బిల్లులన్నీ నేను చూసుకుంటాను. మాట ఇస్తున్నాను” అని చెబుతాడు. భావోద్వేగంతో తల్లి కన్నీళ్లు పెట్టుకుని అతడిని గట్టిగా ఆలింగనం చేసుకుంటుంది.
“నా అమ్మ నా కోసం చేయగలిగిన ప్రతిదీ చేసింది. చివరికి నేను ఆమెను చూసుకునే స్థితిలోకి రావడం నాకు చాలా ఆనందం, గర్వం. దీన్ని నేను మాటల్లో చెప్పలేను. ఈ క్షణం రావాలని చాలాసార్లు అనుకున్నాను. ప్రయత్నం ప్రారంభించిన ఏడాది తర్వాత నా కల నిజమైంది. దేవుడికి, నా అమ్మకు, నాకు నేను చాలా కృతజ్ఞుడిని” అని అమన్ పేర్కొన్నాడు.