Russia Soldiers Die : యుద్ధంలో 19,600 మంది రష్యా సైనికులు మృతి-యుక్రెయిన్ ఆర్మీ

సైనిక చర్య మొదలు ఇప్పటివరకు 19వేల 600 మంది రష్యా సైనికులు హతమైనట్లు యుక్రెయిన్ రక్షణశాఖ ప్రకటించింది.(Russia Soldiers Die)

Russia Soldiers Killed (1)

Russia Soldiers Die : యుక్రెయిన్‌లో రష్యా అరాచకాలు ఆగడం లేదు. సైనిక చర్య పేరుతో ఆ దేశంలోకి చొరబడిన రష్యా బలగాలు.. యుక్రెయిన్ పౌరుల పట్ల పైశాచికంగా ప్రవర్తిస్తున్నాయి. ఒకవైపు యుద్ధం.. మరోవైపు యుక్రెయిన్లపై రష్యా బలగాల కీచక పర్వం కొనసాగుతోంది. దీంతో యుక్రెయిన్ ప్రజలు పడుతున్న బాధలు వర్ణనాతీతం. రష్యా ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి రావడంతో ప్రపంచదేశాలు ఉలిక్కిపడుతున్నాయి.

యుక్రెయిన్ పై రష్యా సైనిక చర్య ప్రారంభించి మంగళవారానికి (ఏప్రిల్ 12,2022) 47వ రోజుకు చేరుకుంది. యుక్రెయిన్ లో పలు ప్రాంతాలపై ఇంకా రష్యా సేనలు దాడులు చేస్తున్నాయి. బాంబులు, మిస్సైళ్ల వర్షం కురిపిస్తున్నాయి. ప్రస్తుతం రష్యా తన దాడులను కీవ్‌ నుంచి తూర్పు యుక్రెయిన్‌ వైపు కేంద్రీకృతం చేసినట్లు వార్తలు వస్తున్నాయి.(Russia Soldiers Die)

Russia ukraine war : అత్యాచారాలను కూడా రష్యా ఆయుధాలుగా వాడుతోంది..ఐరాసకు వెల్లడించిన యుక్రెయిన్

యుక్రెయిన్‌లో రష్యా సేనలు భారీ విధ్వంసమే సృష్టించాయి. ఈ దాడుల్లో యుక్రెయిన్ సైన్యంతో పాటు సాధారణ ప్రజలూ అనేకమంది చనిపోయారు. అయితే, ఎవరూ ఊహించని విధంగా యుక్రెయిన్ సేనల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురవుతోంది. యుక్రెయిన్ బలగాలు రష్యా దాడులను ధీటుగా తిప్పికొడుతున్నాయి. యుక్రెయిన్‌ సైన్యం ప్రతి దాడులతో రష్యా బలగాలు చుక్కలు చూస్తున్నాయి. ఈ యుద్ధంలో చాలామంది రష్యన్ సైనికులను హతమార్చినట్లు ఇప్పటికే పలుమార్లు ప్రకటనలు సైతం చేసింది యుక్రెయిన్ ఆర్మీ.

తమ దేశంలో రష్యా కొనసాగిస్తున్న దండయాత్రను తీవ్రంగా ప్రతిఘటిస్తున్నట్టు యుక్రెయిన్ ఆర్మీ తెలిపింది. రష్యా సేనల దూకుడును దీటుగా ప్రతిఘటిస్తూనే.. శత్రుదేశాన్ని దెబ్బకొడుతున్నట్టు వెల్లడించింది. సైనిక చర్య మొదలు ఇప్పటివరకు 19వేల 600 మంది రష్యా సైనికులు హతమైనట్లు యుక్రెయిన్ రక్షణశాఖ మంగళవారం ప్రకటించింది. దీంతోపాటు 732 యుద్ధ ట్యాంకులు, 1946 సాయుధ వాహనాలను ధ్వంసం చేసినట్లు తెలిపింది. 157 యుద్ధ విమానాలు, 140 హెలికాప్టర్లు, 124 యూఏవీలను నేలకూల్చినట్లు వెల్లడించింది.

యుద్ధం మొదలుపెట్టిన కొన్ని రోజుల్లోనే యుక్రెయిన్‌ రాజధానిని వశపర్చుకుని ప్రభుత్వాన్ని మార్చవచ్చని పుతిన్ భావించారు. కానీ, ఆ అంచనాలు ఏవీ నిజం కాలేదు. పుతిన్ ఊహించని విధంగా యుక్రెయిన్ సేనల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురవుతోంది. యుక్రెయిన్ సేనలు తగ్గేదేలా అన్నట్టు పోరాటం సాగిస్తున్నాయి. ఈ యుద్ధంలో రష్యాకు ఊహించని విధంగా నష్టం జరుగుతోంది. భారీ సంఖ్యలో తన సైనికులను కోల్పోతోంది రష్యా.(Russia Soldiers Die)

ఇప్పటికే పలు నగరాలను పూర్తి స్థాయిలో ధ్వంసం చేసింది రష్యా. కాగా, యుక్రెయిన్‌పై అణ్వాయుధాలను రష్యా ప్రయోగించవచ్చనే వార్తలు యావత్ ప్రపంచాన్ని భయాందోళనకు గురి చేశాయి. దీనిపై స్పందించిన రష్యా.. తమ దేశ ఉనికికి ముప్పు వాటిల్లే సందర్భంలోనే అణ్వాయుధాలను ప్రయోగిస్తామని తేల్చి చెప్పింది. అంతేకానీ ప్రస్తుతం యుక్రెయిన్‌ సైనిక చర్యలో మాత్రం కాదని స్పష్టం చేసింది.

Russia-Ukraine War : రష్యా సైనిక దాడితో.. నిరాశ్రయులుగా మారిన 4.8 మిలియన్ ఉక్రెయిన్ చిన్నారులు

కాగా, ఈ యుద్ధం కారణంగా రష్యా దగ్గర పలు కీలక ఆయుధాలు దాదాపుగా నిండుకున్నాయని ఇంగ్లండ్‌ రక్షణ వర్గాలు చెబుతున్నాయి. వాటిని ఇప్పుడప్పుడే భర్తీ చేసుకునే అవకాశాలు కూడా లేవంటున్నాయి. హెలికాప్టర్లు, ఫైటర్‌ జెట్లు, క్రూయిజ్‌ మిసైళ్ల కొరత రష్యాను తీవ్రంగా వేధిస్తున్నట్టు చెప్పాయి. పలు కీలక విడి భాగాలను యుక్రెయిన్‌ నుంచే రష్యా దిగుమతి చేసుకుంటోందని సమాచారం. 2014 క్రిమియా యుద్ధానంతరం రష్యాకు ఆయుధాల ఎగుమతిని ఉక్రెయిన్‌ బాగా తగ్గించింది. యుద్ధ నేపథ్యంలో అవి పూర్తిగా ఆగిపోయాయి.

యుక్రెయిన్ బలగాలే కాదు సాధారణ పౌరులు కూడా రష్యా దళాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. ఉక్రెయిన్‌లోని కొందరు ఐటీ నిపుణులు బృందంగా ఏర్పడి రష్యా దళాలను తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. వీరు పౌర అవసరాలకు వినియోగించే సాధారణ డ్రోన్లలో మార్పులు చేసి వాటిని రష్యా వాహనాలపై బాంబులు జారవిడిచేందుకు వాడుతున్నారు. ఈ దళంలో చాలా మంది పీహెచ్‌డీ చేసిన వారు, ఐటీ సహా ఇతర పరిశ్రమల్లో పని చేసే వారున్నారు. వాస్తవానికి ఈ యూనిట్‌ను 2014లో రష్యా క్రిమియాను ఆక్రమించిన తర్వాత ప్రారంభించారు. వీరు గతంలో డాన్‌బాస్‌ ప్రాంతంలో రష్యా మద్దతుదారులపై పోరాడారు. కాగా, రష్యన్‌ బలగాల ఉపసంహరణ తర్వాత ఉత్తర యుక్రెయిన్‌లో బుచా పౌర హత్యలు సహా అనేక దారుణాలు వెలుగుచూస్తున్నాయి.

రానున్న రెండు, మూడు వారాల్లో తూర్పు ఉక్రెయిన్‌లో పోరాటం తీవ్రమయ్యే అవకాశం ఉందని బ్రిటన్‌ రక్షణ శాఖ తన తాజా ఇంటెలిజెన్స్‌ నివేదికలో తెలిపింది. ప్రస్తుతం రష్యన్ దాడులు డొనెట్స్క్‌, లుహాన్స్క్ సమీపంలోని ఉక్రెయిన్ స్థావరాలపై కేంద్రీకృతమై ఉన్నాయని చెప్పింది. మరోవైపు.. తూర్పు ఉక్రెయిన్‌లోకి ప్రవేశించేందుకుగానూ బెలారస్‌ భూభాగం నుంచి రష్యన్‌ బలగాలు వెనక్కి వెళ్తున్నట్లు చెప్పింది.