చైనానే కరోనాను సృష్టించింది…20ట్రిలియన్ డాలర్ల నష్టపరిహారం కోరుతూ కేసు వేసిన అమెరికా లాయర్

కరోనా వైరస్ ను చైనీస్ వైరస్ అంటూ తరచుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇదే సమయంలో కరోనా వైరస్ ను చైనానే సృష్టించి వ్యాప్తి చేసిందని ఆరోపిస్తూ 20 లక్షల కోట్ల డాలర్ల పరిహారం కోరుతూ వాషింగ్టన్‌ కు చెందిన లాయర్ లారీ క్లేమన్‌ చైనాపై కేసు దాఖలు చేశారు. అమెరికన్లతో పాటు తమ ప్రత్యర్ధి దేశాలకు చెందిన ప్రజలను చంపే ఉద్దేశంతోనే తమ లేబొరేటరీలో ఈ వైరస్‌ను చైనా అభివృద్ధి చేసిందని క్లేమన్‌ ఆరోపించారు.

లారీ క్లేమన్‌ కు చెందిన ఫ్రీడం వాచ్‌ అండ్‌ బజ్‌ ఫోటోస్‌ అనే సంస్థ టెక్సాస్‌ లోని కోర్టులో ఈ కేసు నమోదు చేసింది. బయో వెపన్(జీవరసాయన ఆయుధం)గా కరోనా వైరస్‌ను చైనా డిజైన్‌ చేసిందని క్లేమన్‌ ఆరోపించారు. ఈ వైరస్‌ను సృష్టించిన చైనా… అమెరికా చట్టంతో పాటు అంతర్జాతీయ చట్టాలు, ఒప్పందాలు, నిబంధనలను ఉల్లంఘించిందన్నారు.

జీవరసాయన ఆయుధంగా ఈ వైరస్‌ను వ్యాప్తి చేసిన చైనా ప్రపంచానికి వాటిల్లిన నష్టానికి గాను 20 లక్షల కోట్ల డాలర్లను పరిహారంగా చెల్లించాలని లా సూట్‌లో క్లేమన్‌ పేర్కొన్నారు. కరోనావైరస్‌ బయటపడిన చైనాలోని వుహాన్‌ ప్రాంతంలో నెలకొన్న వుహాన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ ఈ వైరస్‌ను విడుదల చేసిందని ఆరోపించారు.

అయితే,మరోవైపు అమెరికా సేనలు ఈ వైరస్‌ను తమకు అంటగట్టారని చైనా ఆరోపిస్తోంది. మరోవైపు చైనానే ఈ మహమ్మారిని సృష్టించిందని అమెరికా ఆరోపించింది. ఈ వైరస్‌పై హెచ్చరించిన వారిని సైతం చైనా శిక్షించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తెలిపారు. అమెరికాలో కూడా కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటివరకు అమెరికా వ్యాప్తంగా 46వేల 168 కేసులు నమోదవగా,582మరణాలు సంభవించాయి.