dinosaur footprint
Dinosaurs: భూమిపై మనుగడ సాగించిన డైనోసార్ల గురించి పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే, తాజాగా బ్రిటన్ లో జరిపిన పరిశోధనల్లో 166 మిలియన్ సంవత్సరాల క్రితం నాటి వందలాది డైనోసార్ల పాదముద్రలను కనుగొన్నారు. బ్రిటన్ లోని ఆక్స్‌ఫర్డ్ మరియు బర్మింగ్‌హామ్ విశ్వవిద్యాలయాల పరిశోధకులు వందలాది విభిన్న డైనోసార్ల పాదముద్రలను గుర్తించారు. ఓ సున్నపురాయి క్వారీలో సుమారు రెండు వందల భారీ పాదముద్రలను గుర్తించారు.
డైనోసార్ల పాదముద్రలు భారీ ట్రాక్ లను కలిగిఉన్నాయి. వీటిలో కొన్ని ట్రాక్‌వేలు 180 మీటర్ల పొడవు వరకు ఉన్నాయి. 1997లో ఈ ప్రాంతంలో చేసిన పరిశోధనల్లో 40కంటే ఎక్కువ డైనోసార్ల పాదముద్రలను పరిశోధకులు కనుగొన్నారు. ఆ సమయంలో జురాసిక్ కాలంలో బ్రిటన్ లో ఉన్న డైనోసార్ల రకాల గురించి ప్రధాన సమాచారాన్ని పరిశోధకులు సేకరించారు. ప్రస్తుతం.. అదే ప్రాంతంలోని మరో సున్నపు క్వారీలో తవ్వకాలు జరుపుతున్న సమయంలో కొత్తగా డైనోసార్ల పాదముద్రలను కనుగొన్నారు. ఒక ఎక్స్కవేటర్ నుంచి మట్టిని తొలగిస్తున్న క్రమంలో గ్యారీ జాన్సన్ అనే కార్మికుడు విచిత్రమైన ఆకారాలను గుర్తించాడు. ఆ తరువాత ఆ ప్రాంతంలో పరిశోధకులు తవ్వకాలు ప్రారంభించారు.
ఆక్స్‌ఫర్డ్, బర్మింగ్‌హామ్ విశ్వవిద్యాలయాలకు చెందిన వంద మందితో కూడిన బృంద సభ్యులు ఈ పరిశోధనల్లో పాల్గొన్నారు. అక్కడ సుమారు 200 పాదముద్రలు బయటపడ్డాయి. ఈ తవ్వకాల్లో డైనోసార్ల పాదముద్రలతో కూడిన పొడవైన ట్రాక్‌వేలను పరిశోధకులు కనుగొన్నారు. వీటి పొడవు 150 మీటర్ల కంటే ఎక్కువ ఉంటుంది. వీటిలో నాలుగు ట్రాక్‌వేలు పొడవాటి మెడ కలిగిన శాఖాహార డైనోసార్ల పాదముద్రలతో కలిగినవిగా గుర్తించారు.వీటిని సారోపాడ్స్ డైనోసార్లు అని పిలుస్తారు. ఐదో ట్రాక్‌వేను మాసం తినే మెగాలోసారస్ డైనోసార్ల పాదముద్రలుగా కనుగొన్నారు. ఇవి పొడవాటి గోళ్లతో కూడిన పాదాలను కలిగి ఉంటాయి. అయితే, ఆ గనిలో కొంతభాగాన్ని మాత్రమే తవ్వడం జరిగిందని, ఇంకా డైనోసార్ల పాదముద్రల మార్గం విస్తరించి ఉండవచ్చునని పరిశోధకులు పేర్కొన్నారు.
ఆక్స్‌ఫర్డ్ మరియు బర్మింగ్‌హామ్ విశ్వవిద్యాలయాలకు చెందిన 100మందితో కూడిన బృందం గత ఏడాది జూన్ నెలలో పరిశోధనలు చేపట్టారు. ఈ బృందం 200 పాదముద్రలను గుర్తించి. 20వేల ఫొటోలను తీసింది. డ్రోన్లను ఉపయోగించి ఆ ప్రాంతం యొక్క విరణాత్మక 3డీ నమూనాలను రూపొందించింది. డైనోసార్లు నడిచిన విధానం, వాటి వేగం, డైనోసార్ల పాదముద్రల పరిమాణం, వాటి మధ్య ఉన్న సంబంధాలను అర్ధం చేసుకుంటే వీటి ద్వారా డైనోసార్ల గురించి ముఖ్యమైన సమాచారాన్ని తెలుసుకోవచ్చునని నిపుణులు భావిస్తున్నారు.