రెండేళ్ల పాపకు వింత వ్యాధి : ముట్టుకుంటే ఎముకలు విరిగిపోతాయి

  • Publish Date - October 31, 2019 / 07:32 AM IST

ఆ పాపకు రెండేళ్లు ఉంటాయి. వింత జబ్బుతో బాధపడుతోంది. పాప పేరు ఎయిన్‌స్లే గ్రే. ఆస్టియోజెనిసిస్ ఇంపెర్ఫెక్టా టైప్-3 అనే జన్యు పరమైన వ్యాధి సోకినట్టు వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాధి కారణంగా శరీరంలోని ఎముకులు గుల్లబారిపోతాయి. పొరపాటున మీ చేయి తగిలినా, లేదా పట్టుకున్నా చాలు.. వెంటనే పాప శరీరంలోని ఎముకలు ఇట్టే విరిగిపోతాయి. సున్నితమైన గ్లాసు మాదిరిగా ఎముకలు ముక్కలైపోతాయి. పుట్టిన రెండేళ్లలోనే ఈ పసిపాపకు 100 సార్లు ఫ్రాక్చర్లు అయ్యాయి. 3 సార్లు బ్రెయిన్ సర్జరీలు చేసినట్టు వైద్యులు తెలిపారు.

ప్రస్తుతం ఆ చిన్నారి ఆరోగ్య పరిస్థితి అత్యంత సున్నితంగా మారింది. పొరపాటున పాప శరీరాన్ని టచ్ చేసినా ఎముకలు విరిగిపోతాయి. ఒకవైపు మృత్యువుతో పోరాటడుతునే ఆ చిన్నారి చిరునవ్వులను చిందిస్తోంది. పాప పరిస్థితి చూసిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరైపోతున్నారు. పాపను ఎలా బతికించుకోవాలో తెలియక ఆందోళన చెందుతున్నారు.

ఏం పాపం చేసిందని దేవుడు తమ పాపకు ఇలాంటి శిక్ష విధించాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రికే పరిమితమైన చిట్టి చిన్నారిని చూస్తే దు:ఖం తన్నుకు వస్తున్నప్పటికీ తండ్రి.. ఆడించేందుకు ప్రయత్నించడం అందరిని కంటతడి పెట్టిస్తోంది. తండ్రి ముఖాన్ని చూస్తూ పసికందు నవ్వులు చిందించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తండ్రి చెప్పే కబర్లు వింటూ తన తలను ఆడిస్తూ కేరింతలు కొడుతోంది. శరీరమంతా పైపులతో చికిత్స అందిస్తున్న పరిస్థితుల్లో కూడా తండ్రితో ఆడేందుకు చిన్నారి పడే ఆరాటం చూస్తుంటే హృదయం ద్రవించుకుపోతోంది. వైరల్ అవుతున్న వీడియో ఇదే..