తమ వారు క్షేమంగా ఉంటారని అనుకున్న వారి ఆశలు నెరవేరలేదు. న్యూజిలాండ్ క్రెస్ట్‌చర్చ్‌లోని మసీదుల్లో ఉన్మాదుడు జరిపిన కాల్పుల్లో గల్లంతైన భారతీయుల్లో ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో మహబూబ్ ఖోఖార్, రమీజ్ వోరా, అరీఫ్ వోరా, అన్సీ అలీబావా, ఖాదిర్‌లున్నారు. వీరిలో ముగ్గురు గుజరాతీ వాసులు కాగా ఇద్దరు తెలంగాణ వాసులు. విచక్షణారహితంగా ఉన్మాదుడు జరిపిన కాల్పుల్లో 9 మంది భారతీయులు గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. వారికోసం గాలింపులు చర్యలు చేపట్టామని భారత దౌత్యవేత్తలు ప్రకటించారు. తాజాగా వారిలో కొంతమంది మరణించారని చెప్పడంతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
మార్చి 15వ తేదీ శుక్రవారం మసీదుల్లో ప్రార్థనలు జరుగుతుండగా ఉన్మాది ఇష్టమొచ్చినట్లు కాల్పులు జరిపాడు. ప్రార్థనలు చేస్తున్న వారు అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. మసీదుల్లో రక్తం ఏరులైపారాయి. మొత్తం 49 మంది ప్రాణాలు వదిలారు. ఈ కాల్పుల్లో ఎంతో మంది గాయపడ్డారు. కాల్పులు జరిపిన సమయంలో అక్కడ భారతీయులు ఉన్నట్లు సమాచారం రావడంతో కలకలం ప్రారంభమైంది. వెంటనే భారతీయ విదేశాంగ శాఖ అలర్ట్ అయ్యింది. అక్కడి అధికారులతో మాట్లాడారు. గల్లంతైన వారి ఆచూకి కోసం వెతికారు. మొత్తం 9 మంది భారతీయులు గల్లంతైనట్లు గుర్తించారు. అందులో ఆరుగురు వ్యక్తులు హైదరాబాద్‌కు చెందిన వారని తెలిసింది. కాల్పుల ఘటనలో బాధితుల కోసం న్యూజిలాండ్‌లోని భారత రాయబార కార్యాలయంలో హెల్ప్‌లైన్ ఏర్పాటు కూడా చేశారు. మానవత్వం లేకుండా దాడి జరిగిందని పలువురు పేర్కొన్నారు. ప్రధాన నిందితుడు బ్రెంటన్ టారాంట్ (28) అక్కడి పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.