వరల్డ్ టాప్ 10 బెస్ట్ ఫైటర్ జెట్స్. రఫెల్ యుద్ధ విమానాల ప్లేస్ ఏంటి?

  • Publish Date - July 29, 2020 / 08:09 PM IST

ఏ దేశానికైనా ఎయిర్ ఫోర్స్‌లో ఫైటర్ జెట్స్ కీలకం. వైమానిక దళం పాటవాన్ని నిర్ణయించేది యుద్ధ విమానాలే. ఫ్రాన్స్ నుంచి ఇండియా కొనుగోలు చేసిన రఫెల్ ఫైటర్ జెట్స్ ఇండియాకు వస్తున్నాయి. ఇరవై ఏళ్లుగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో కొత్త యుద్ధ విమానాల్లేవు.

సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్తతలు తలెత్తిన సమయంలో 5 రఫెల్ యుద్ధ విమానాలు ఇండియా వస్తున్నాయి. ప్రపంచంలోని 10 అత్యంత ఆధునిక యుద్ధ విమానాల్లో రఫెల్ ఒకటి. ప్రపంచంలోని పది బెస్ట్ ఫైటర్ జెట్స్ గురించి తప్పక తెలుసుకోవాల్సిన అంశాలు ఇవే.. అవేంటో ఓసారి చూద్దాం..
1. లాక్ హీడ్ మార్టిన్ F-35 లైటినింగ్ టూ :
లాక్ హీడ్ మార్టిన్‌కు చెందిన ‘F- 35 లైటెనింగ్ టూ’.. ప్రపంచంలో నంబర్ వన్ ఫైటర్ జెట్. 5వ జెనెరేషన్ మల్టీ రోల్ ఫైటర్ ప్రపంచంలో ప్రముఖమైనదిగా చెబుతున్నారు. అమెరికాకు చెందిన మూడు భాగస్వామ్య సంస్థలతో కలిసి లాక్ హీడ్ మార్టిన్ దీన్ని తయారు చేసింది. 2006లో మొదటిసారి గగనతలనానికి ఎగిసింది. ఇందులో మూడు రకాలున్నాయి. సంప్రదాయంగా టేక్ ఆఫ్, లాండింగ్ చేసేది ఒకటిగా ఉంది.



కొద్ది దూరంతో టేక్ ఆఫ్, లాండింగ్ చేసేది మరొకటి. ఏకంగా నిట్ట నిలువుగా టేక్ ఆఫ్ , లాండింగ్ చేసేది మూడోది. అమెరికన్ నేవీ, ఎయిర్ ఫోర్స్ లో ఉన్న 5 రకాల యుద్ధ విమానాల స్థానాన్ని ఇది భర్తీ చేస్తుంది. ‘లాక్ హీడ్ మార్టిన్ F-35 లైటెనింగ్ టూ’ సింగల్ సీట్ ఫైటర్ జెట్. అత్యాధునిక ఆయుధాలు మోసుకెళ్లే వ్యవస్థలు ఇందులో ఉన్నాయి. సైడ్ విండర్, స్టార్మ్ షాడో, జాయింట్ డైరెక్ట్ ఎటాక్ దీని ప్రత్యేకతలు. మిగిలిన అన్ని ఫైటర్ జెట్స్‌తో పోల్చితే వ్యూహాత్మకంగా నంబర్ వన్‌గా చెప్పవచ్చు.

2. లాక్ హీడ్ మార్టిన్ F- 22 రాఫ్టర్ :
ప్రపంచంలో రెండోది కూడా లోక్ హీడ్ మార్టిన్ నుంచే వచ్చింది. ఈసారి బోయింగ్‌తో కలిసి కోక్ హీడ్ మార్టిన్ దీన్ని తయారు చేసింది. ఇదే ‘ఎఫ్ – 22 రాఫ్టర్’. ఇది కూడా సింగల్ సీట్ ఫైటర్. రెండు ఇంజన్ల రాఫ్టర్ కూడా ఫిఫ్త్ జెనెరేషన్ ఫైటర్. అంతేకాదు అత్యంత ఆధునిక వ్యూహాత్మక ఫైటర్. స్టెల్త్ , ఇంటిగ్రేటెడ్ ఏవియానిక్స్ కలిసి దీన్ని సూపర్ పెరఫార్మెన్సు ఫైటర్‌గా నిలబెట్టాయి. అమెరికన్ ఎయిర్ ఫోర్స్‌లో ఇది మల్టీ మిషన్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్‌గా విధులు నిర్వహిస్తోంది. 1997లో మొదటిసారి గగనతలానికి దూసుకెళ్లింది.

వాణిజ్య పరంగా మొదటిసారి ఉత్పత్తి చేసిన ఈ జెట్స్ 2003లో అమెరికా ఎయిర్ ఫోర్స్‌కు అందాయి. 2005లో ఇవి లాంఛనంగా ఎయిర్ ఫోర్స్‌లో భాగమయ్యాయి. ఎయిర్ టూ ఎయిర్, ఎయిర్ టూ గ్రౌండ్ మిస్సైల్స్‌ను ఇది ప్రయోగిస్తుంది. ఎటాక్ కోసమే కాదు.. నిఘా, పర్యవేక్షణ విధుల కోసం కూడా దీన్ని ఉపయోగిస్తారు. ఎలక్ట్రానిక్స్ వార్‌లోనూ, సిగ్నల్ ఇంటలిజెన్స్ లోనూ ఇది నంబర్ వన్.

3. చెంగ్డు j- 20 ఫైటర్ జెట్ :
మొదటి రెండూ అమెరికా గొప్పదనమైతే. ఇది చైనా సొంతం. ఇది కూడా ఫిఫ్త్ జెనెరేషన్, సింగల్ సీట్, రెండు ఇంజన్లు ఉన్న స్టెల్త్ ఫైటర్. చైనాకు చెందిన చెంగ్డు ఎయిర్ క్రాఫ్ట్ ఇండస్ట్రీ గ్రూప్ దీన్ని తయారు చేసింది. వైమానిక దాడులు జరపడానికి చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్‌లోకి దీన్ని తీసుకున్నారు. చూపుకు అందని దూరాన్ని ఛేదించే ఎయిర్ టూ ఎయిర్ మిస్సైల్స్ , షార్ట్ రేంజ్ మిస్సైల్స్ ప్రయోగించవచ్చు.



అనేక రకాల ఆయుధాలను ఇది మోసుకు పోతుంది. ఎయిర్ టూ సర్ఫేస్ మిస్సైల్స్, యాంటీ రేడియేషన్ మిస్సైల్స్, లేజర్ గైడెడ్ బాంబ్స్ కూడా ప్రయోగిస్తారు. ఇందులో మరికొన్ని ఆధునిక టెక్నాలజీ వ్యవస్థలు కూడా ఏర్పాటు చేశారు. మొదటిసారి ఇది 2011లో గగనతలానికి ఎగిసింది. 2016లో అధికారికంగా ప్రకటించారు. 2017లో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్‌లో చేరింది.

4. సుఖోయ్ Su- 57 ఫైటర్ జెట్ :
ఆధునిక ఆయుధాల తయారీలో రష్యా పనితనానికి గుర్తు సుఖోయ్. సోవియట్ యూనియన్ విచ్చిన్నమైన తరువాత రష్యా‌కు మిగిలిన నైపుణ్యమిది. సుఖోయ్ ఫైటర్ జెట్స్ రేంజ్ లో ‘సు – 57’ అత్యంత ఆధునిక జెట్. ప్రపంచంలో తన స్థాయి ఫైటర్ జెట్స్ మాదిరిగానే ఇది కూడా ఫిఫ్త్ జెనెరేషన్, సింగల్ సీట్, రెండు ఇంజన్లు, మల్టీ రోల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్. రష్యా‌లోని యునైటెడ్ ఎయిర్ కాఫ్ట్ కార్పొరేషన్‌కు సుఖోయ్ అనుబంధ సంస్థ. ప్రాధమికంగా దీన్ని రష్యా ఎయిర్ ఫోర్స్ , రష్యా నేవీ కోసం తయారు చేశారు. వైమానిక దాడుల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేశారు.

గగనతలం నుంచీ, భూమిపై నుంచీ ఎదురయ్యే ఎలాంటి ప్రమాదాల నుంచైనా ఇది తనను తానూ రక్షించుకుంటుంది. సుదూర శత్రు లక్ష్యాలపై దాడులు చేస్తుంది. పది టన్నుల బరువుగల సుఖోయ్ సు- 57 నుంచి షార్ట్ రేంజ్ ఎయిర్ టూ ఎయిర్ మిస్సైల్స్, ఎయిర్ టూ సర్ఫేస్ మిస్సైల్స్ ప్రయోగించవచ్చు.

షార్ట్, మీడియం రేంజ్ గైడెడ్, ఆన్ గైడెడ్ వెపన్స్ కూడా ఇది మోసుకెళుతుంది. 250 కిలోల నుంచి 1,500 కిలోల ఏరియల్ బాంబులు ప్రయోగించడం దీని ప్రత్యేకత. కాకపోతే ఇది ఇంకా టెస్టింగ్ దశలో ఉంది. 2029 నాటికీ రష్యా ఎయిర్ ఫోర్స్‌లో చేరనుంది.

5. యూరో ఫైటర్ టైఫూన్ ఫైటర్ జెట్ :
ఐరోపాకు చెందిన అయిదు దేశాలు సంయుక్తంగా రూపొందించిన అత్యాధునిక ఫైటర్ జెట్ యూరో ఫైటర్ టైఫూన్ . బ్రిటన్ , జర్మనీ , ఫ్రాన్స్ , ఇటలీ , స్పెయిన్ కలిసి దీన్ని డిజైన్ చేశాయి . ప్రస్తుతం ఏడు దేశాలు దీన్ని తమ వైమానిక దళాల్లో చేర్చుకున్నాయి . మరో రెండు దేశాలు దీన్ని కొనుగోలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి . నిజానికి రఫెల్ కన్నా ముందు ఇండియా కూడా దీనికోసం ప్రయత్నించింది . కారణాలు తెలియదుగానీ తరువాత మనసు మార్చుకుని రఫెల్ కొనుగోలు ఖరారు చేసుకుంది.



ఇది న్యూ జనరేషన్ మల్టీ రోల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్. ఇదొక ఫోర్ ప్లేన్ , డెల్టా వింగ్ ఎయిర్ క్రాఫ్ట్ . మోడరన్ ఏవియానిక్స్ , సెన్సార్లు , డిఫెన్సివ్ ఎయిడ్స్ సబ్ సిస్టం ఇందులో ఉన్నాయి . అంతే కాదు ప్రత్యేకమైన ఆధునిక ఆయుధాలను దీన్నుంచి ప్రయోగించవచ్చు . కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీతో ఐరోపా ఆయుధ పరిశ్రమకు ఇది తలమానికంగా నిలిచింది . 2011 లో లిబియాపై దాడుల్లో నాటో దళాలు దీన్ని ఉపయోగించాయి.

టెక్నాలజీ అభివృద్ధి చెందేకొద్దీ యుద్ధం తీరుతెన్నులు మారిపోతున్నాయి. యుద్ధంలో టెక్నాలజీ పాత్రకు ప్రాధాన్యం బాగా పెరిగింది. ఎక్కడో కూర్చుకుని.. మరెక్కడో సుదూర ప్రాంతాల్లో ఉన్న శత్రు దేశపు లక్ష్యాలను ఛేదిస్తున్నారు. ఆధునిక యుద్ధంలో వైమానిక దళానికి ఉన్న ప్రాధాన్యత చాలా ఎక్కువ. ఆర్మీకి, నేవీకి కూడా ఎయిర్ ఫోర్స్ దన్నుగా నిలుస్తుంది. అందుకే ఎప్పటికప్పుడు కొత్త ఫైటర్ జెట్స్ పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఫైటర్ జెట్స్ తయారీలో ఇప్పటికైతే అమెరికా, ఐరోపా దేశాలు, రష్యా ముందున్నాయి. పదేళ్ల క్రితమే చైనా కూడా ఆ క్లబ్బులో చేరింది.

6. ఆరో స్థానంలో సుఖోయ్ సు- 35 :
టైఫూన్ తరువాతి స్థానం ఆక్రమించింది ‘సుఖోయ్ సు – 35’ ఎయిర్ క్రాఫ్ట్. ‘సు – 27’ కు ఇది మాడిఫైడ్ వెర్షన్. ఫోర్త్ జెనెరేషన్‌కు చెందినదైనా ఇందులో ఫిఫ్త్ జెనెరేషన్ టెక్నాలజీ అమర్చారు. దాంతో ఇది ప్రపంచంలోని ఫోర్త్ జెనెరేషన్ ఫైటర్ జెట్స్‌లో ముందు నిలిచింది. 2007లో దీన్ని అభివృద్ధి చేశారు. లాంగ్, షార్ట్ రేంజ్ ఎయిర్ టూ ఎయిర్ మిస్సైల్స్  దీన్నుంచి ప్రయోగించవచ్చు. ఎయిర్ టూ గ్రౌండ్ మిస్సైల్స్, బాంబులు కూడా ప్రయోగించవచ్చు. ఇందులో ఉన్న నాలుగు హార్డ్ పాయింట్స్‌లో ఎనిమిది టన్నుల ఆయుధాలు మోసుకుపోవచ్చు.



7. బోయింగ్ FA- 18 ఈ ఎఫ్ సూపర్ హార్నెట్ :
నెక్స్ట్ జెనెరేషన్ మల్టీ రోల్ స్ట్రైక్ ఫైటర్ సామర్ధ్యం దీని సొంతం. అనేకసార్లు తన సామర్ధ్యాన్ని నిరూపించుకుంది. పాత హార్నెట్‌ను మరింత అభివృద్ధి చేసి దీన్ని రూపొందించారు. అమెరికా, ఆస్ట్రేలియా దీన్ని ఉపయోగిస్తున్నాయి. ఆఫ్ఘన్ యుద్ధంలో, ఇరాక్ యుద్ధంలో ఇది తన పనితనాన్ని నిరూపించుకుంది. ఆర్మీకి మంచి దన్నుగా పనిచేస్తుంది. ఇందులో ఆయుధాలు మోసుకుపోవడానికి 11 స్టేషన్స్ ఉన్నాయి. వీటిల్లో రకరకాల ఆయుధాలు తీసుకుపోవచ్చు.

8. దస్సాల్ట్ రఫెల్ :
పేరుకు ఎనిమిదో స్థానంలో ఉన్నా … పనితనంలో ముందు నిలిచింది రఫెల్. ఇది రెండు ఇంజన్ల మల్టి రోల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్. గగనతలంలో ఆధిపత్యం సాధించడం దీనికి ప్రత్యేకత. సుదూరంలో ఉన్న లక్ష్యాలను గురితప్పకుండా ఛేదిస్తుంది. దీన్నుంచి అణ్వాయుధాలు కూడా ప్రయోగించవచ్చు . నిఘా, పర్యవేక్షణలకు కూడా దీన్ని ఉపయోగిస్తారు.

ఫ్రెంచ్ ఎయిర్ ఫోర్స్, నేవీ దీన్ని ఉపయోగిస్తున్నాయి. ఆధునిక ఏవియానిక్స్, స్మార్ట్ సెన్సార్ సిస్టం దీని సొంతం. దీన్నుంచి 30 ఎమ్మెమ్ క్యానన్స్ , ఎయిర్ టూ ఎయిర్, ఎయిర్ టూ గ్రౌండ్ మిస్సైల్స్ ప్రయోగించవచ్చు. అణు బాంబులు, యుద్ధ నౌకల విధ్వంసక క్షిపణులు కూడా దీన్నుంచి ప్రయోగిస్తారు. అనేక రకాల క్షిపణులు, బాంబులు కూడా దీన్నుంచి ప్రయోగించవచ్చు. 2002లో ఇది ఫ్రెంచ్ ఎయిర్ ఫోర్స్‌లో చేరింది. ఆఫ్ఘన్ , లిబియా, మాలి యుద్ధాల్లో ఇది పాల్గొంది. మూడు రకాల్లో ఇది లభిస్తోంది.



9. బోయింగ్ F- 15 ఈ స్ట్రైక్ ఈగల్ :
ఇది అమెరికా ఎయిర్ ఫోర్స్‌కు దన్నులా పనిచేస్తోంది. F15 AD నుంచి దీన్ని అభివృద్ధి చేశారు. ధ్వని వేగంకన్నా రెండు రెట్లు పైగా వేగం దీని ప్రత్యేకత. ఆధునిక ఏవియానిక్స్ కారణంగా వైమానిక యుద్ధ విద్యలో ఇది నంబర్ వన్‌. అన్ని రకాల వాతావరణాలలో కూడా ఇది పని చేస్తుంది.

రాత్రి, పగలు కూడా ఇది యుద్ధంలో పాల్గొంటుంది. మిగిలిన ఇతర యుద్ధ విమానాల తరహాలోనే అన్నిరకాల ఆయుధాలు దీన్నుంచి ప్రయోగించవచ్చు. రెండు ఇరాక్ యుద్ధాల్లోనూ ఇది పాల్గొన్నది. ఆఫ్గనిస్తాన్ యుద్ధంలో పాల్గొంది. మరో నాలుగు ఆపరేషన్లలో విజయవంతంగా విధులు నిర్వర్తించింది.

10. చివరి స్థానంలో సు – 30 MKI :
ఇది రెండు సీట్ల లాంగ్ రేంజ్ మల్టీ రోల్ ఫైటర్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దీన్ని ఉపయోగిస్తోంది. రష్యాకు చెందిన సుఖోయ్ దీన్ని డిజైన్ చేసింది. సుఖోయ్ లైసెన్సుతో హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ దీన్ని అసెంబుల్ చేసింది.

సుఖోయ్ రూపొందించిన మొదటి యుద్ధ విమానం సు – 30 MKI. 2002 నుంచి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దీన్ని ఉపయోగిస్తోంది. దీనికి చెందిన విడిభాగాలు 6 దేశాలకు చెందిన 14 కంపెనీలు సరఫరా చేస్తున్నాయి. బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిస్సైల్స్‌ను ఇది మోసుకుపోతుంది. అనేక రకాల బాంబులు దీన్నుంచి ప్రయోగించవచ్చు.

ట్రెండింగ్ వార్తలు