Taliban Govt : అఫ్ఘాన్ ప్రభుత్వంలో ఐదుగురు ఉగ్రవాదులు.. అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి తలపై 73 కోట్ల రివార్డు

గతనెల 15న కాబూల్ అక్రమణతో యుద్ధం ముగిసిందని ప్రకటించిన తాలిబన్లు ఎట్టకేలకు మంగళవారం అఫ్ఘానిస్తాన్ లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

Miisters

Taliban Govt గతనెల 15న కాబూల్ అక్రమణతో యుద్ధం ముగిసిందని ప్రకటించిన తాలిబన్లు ఎట్టకేలకు మంగళవారం అఫ్ఘానిస్తాన్ లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తాలిబన్ ఆపద్ధర్మ ప్రభుత్వంలో 33 మంది మంత్రులను నియమించగా…వీరిలో ఐదుగురు ఐక్యరాజ్యసమితి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ లిస్ట్ లో ఉన్నారు.

పాక్‌ తొత్తులుగా వ్యవహరించే హక్కానీ నెట్‌వర్క్‌కే కీలక పదవులు లభించాయి. ఎవరు ఊహించని విధంగా ముల్లా మహ్మద్‌ హసన్‌ అఖుండ్ కు ప్రధానమంత్రి పదవి దక్కింది. తాలిబన్ల సుప్రీం లీడర్‌ అకుంజాదాకు మహ్మద్‌ హసన్‌ అత్యంత సన్నిహితుడు. తాలిబన్లకు అధికార ప్రతినిధిగా వ్యవహరించిన ఆయన్ను ప్రధానిగా ఎంపిక చేశారు.

బయటి ప్రపంచానికి తక్కువగా తెలిసిన ముల్లా మహ్మద్‌ హసన్‌ అఖుండ్ ఐక్య‌రాజ్య‌స‌మితి ఉగ్ర‌వాద జాబితాలో ఉన్నాడు. ముల్లా మొహ‌మ్మ‌ద్ హ‌స‌న్ అఖుండ్…కాందహార్ ప్రాంతానికి చెందినవాడు. తాలిబ‌న్ వ్య‌వ‌స్థాప‌క స‌భ్యుల్లో ఆయ‌న ఒక‌రు. 20 ఏళ్ల పాటు తాలిబ‌న్ల లీడ‌ర్‌ షిప్ కౌన్సిల్ “రెహ‌బారీ షురా”కు అఖుండ్ నాయ‌క‌త్వం వ‌హించాడు. గత తాలిబన్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించాడు. మిలిట‌రీ నేత‌లా కాకుండా.. ఎక్కువ శాతం మ‌త‌ప‌ర‌మైన ఆదేశాలు ఇస్తుంటాడు.

ఇద్దరికి డిప్యూటీ ప్రధాని పదవులు లభించాయి. తాలిబన్‌ సహ వ్యవస్థాపకుడు ముల్లా బరాదర్‌కు డిప్యూటీ ప్రధాని మాత్రమే లభించింది. హక్కానీ నెట్‌వర్క్‌తో ఆధిపత్యపోరులో ఆయన వెనుకబడిపోయారు. తాలిబన్ల ప్రభుత్వానికి బరాదర్‌ నేతృత్వం వహిస్తారని జోరుగా ప్రచారం జరిగింది. కాని ఆయనకు షాకిచ్చారు తాలిబన్లు. మౌల్వీ అబ్దుల్‌ హనాఫీకి కూడా డిప్యూటీ ప్రధాని లభించింది. ఐక్యరాజ్యసమితిలో తాలిబన్ల తరపున ఆయన చర్చలు జరిపారు. అమెరికాతో శాంతిచర్చల్లో కీలక పాత్ర పోషించారు.

అదే సమయంలో అమెరికా యొక్క ప్రమాదకరమైన గ్వాంటనామో బే జైలు నుంచి విడుదలైన వ్యక్తి ఆఫ్ఘనిస్తాన్ నిఘా సంస్థ అధిపతిగా వ్యవహరిస్తున్నాడు.
Taliban : అసలు ఎవరీ తాలిబన్లు..వీళ్ల లక్ష్యం ఏంటీ!

ముల్లా యాకూబ్‌కు కీలకమైన రక్షణశాఖ మంత్రి పదవి లభించింది. తాలిబన్ల వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్‌ కుమారుడే ముల్లా యాకూబ్‌. ముల్లా అమీర్‌ఖాన్ విదేశాంగశాఖ మంత్రిగా వ్యవహరిస్తారు. గత ప్రభుత్వంలో కూడా ఆయన మంత్రిగా పనిచేశారు. అబ్బాస్‌ స్టాన్‌కిజాయ్‌కి విదేశాంగశాఖ సహాయమంత్రి పదవి దక్కింది. ఖతార్‌ లోని తాలిబన్ల బృందానికి ఆయన నేతృత్వం వహించారు. శాంతిచర్చల్లో కీలకపాత్ర పోషించారు.

అఫ్ఘానిస్తాన్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రిగా నిమితులైన సిరాజుద్దీన్ హక్కానీ(హక్కానీ నెట్ వర్క్ వ్యవస్థాపకుడి కుమారుడు) తలపై రూ. 73కోట్ల బహుమతి ఉంది. పాక్​లో ఉన్నట్లు భావిస్తున్న ఇతడి ఆచూకీ, అరెస్టు కోసం అమెరికా ప్రభుత్వం 5 లక్షల డాలర్లు ప్రకటించింది. 2008లో కాబుల్​ హోటల్​పై దాడి, అమెరికా దళాలపై దాడికి కుట్ర, 2008లో అప్పటి అఫ్ఘాన్ అధ్యక్షుడు హమిద్ కర్జాయ్ హత్యకు యత్నం వంటి కేసుల్లో మోస్ట్​ వాంటెడ్​గా చేర్చింది అమెరికా ఎఫ్​బీఐ. 2012 లో హక్కానీ నెట్‌వర్క్‌ను అమెరికా నిషేధించింది. సిరాజుద్దీన్.. అతని తండ్రి 2008 లో కాబూల్‌లోని భారత రాయబార కార్యాలయంపై కూడా దాడి చేశాడు. ఈ దాడిలో 58 మంది ప్రాణాలు కోల్పోయారు. పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఉన్న తాలిబాన్ల ఆర్థిక, సైనిక ఆస్తులను హక్కానీ గ్రూపు పర్యవేక్షిస్తుంది. ఆఫ్ఘనిస్తాన్‌లో ఆత్మాహుతి దాడులను ప్రారంభించిన వ్యక్తి హక్కానీ.

హక్కానీ నెట్ వర్క్ ఏంటి-పాక్ తో సంబంధాలు-భారతీయులు లక్ష్యంగా దాడులు 
హక్కానీ నెట్ వర్క్ ని పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ అనుబంధ సంస్థగానే విశ్లేషకులు భావిస్తారు. తాలిబన్ లో భాగమని చెప్పినా.. ఇతర లక్ష్యాలపై కూడా ఇది పనిచేస్తుంది. 1980ల్లో జలాలుద్దీన్ హక్కానీ అనే వ్యక్తి హక్కానీ నెట్ వర్క్ ని స్థాపించాడు. ఇతను మాజీ ముజాహిద్దీన్ కమాండర్. 1980ల్లో అఫ్ఘానిస్తాన్ లో సోవియట్ యూనియన్ కి వ్యతిరేకంగా పోరాడేందుకు ఇతనికి అమెరికా నిఘా సంస్థ సిఐఏ శిక్షణ ఇచ్చింది. పాకిస్తాన్ లోని వజీరిస్థాన్ ప్రాంతంలోని జద్రాన్ తెగ వారు ఎక్కువగా ఉన్నారు. 10 వేల మంది దాకా ఉగ్రవాదులు ఈ గ్రూప్ లో ఉన్నారు.

1996 లో తాలిబన్..అఫ్ఘానిస్తాన్ ని చేజిక్కించుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత జలాలుద్దీన్ హక్కానీ సరిహద్దులు, ఆదివాసీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు. ఈ సమయంలో తాలిబన్లలో అయన పరపతి గణనీయంగా పెరిగింది. 9/11 దాడుల తర్వాత అఫ్ఘానిస్తాన్ పై అమెరికా యుద్ధం ప్రకటించింది. ఆ సమయంలో తాలిబన్ లతో కలిసి నాటో దళాలపై హక్కానీ నెట్ వర్క్ దళాలు దాడులు చేశాయి. బిన్ లాడెన్ ని అఫ్ఘానిస్తాన్ నుంచి పాకిస్తాన్ కి తరలించడంలో హక్కానీ నెట్ వర్క్ పాత్ర ఉంది. అమెరికా దాడుల్ని తప్పించుకోవడానికి పాక్ లోని ఉత్తర వజీరిస్థాన్ లో హక్కానీ తీవ్రవాదులు దాక్కున్నట్లు అమెరికా అనుమానించింది. జలాలుద్దీన్ హక్కానీ పాకిస్తాన్ లో శరణు పొందాడు. ఇక తాలిబన్లకు పాక్ ఆశ్రయం ఇచ్చింది.

2012లో పాకిస్తాన్ లోని వజీరిస్థాన్ లో అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో జలాలుద్దీన్ హక్కానీ కుమారుడు. బద్రుద్దీన్ హక్కానీ చనిపోయాడు. మరో కుమారుడు నసీరుద్దీన్ హక్కానీ కూడా 2013 లో ఇస్లామాబాద్ దగ్గర్లో హత్యకు గురయ్యాడు. ఇతడు హక్కానీ నెట్ వర్క్ లో కీలకమైన వ్యక్తి. సౌదీ,యూఏఈ వంటి దేశాల నుంచి నిధులు సమకూర్చేవాడు

ఈ సమయంలోనే 2013లో తాలిబన్ వ్యవస్థాపకుడు మూల్లా మహమ్మద్ ఒమర్ చనిపోయాడు. ముల్లా ఒమర్ చనిపోయిన విషయం 2015లో ప్రపంచానికి తెలిసింది. ఈ సమయంలో జలాలుద్దీన్ హక్కానీ కింగ్ మేకర్ గా ఎదిగాడు. ముల్లా అక్తర్ మహమ్మద్ మన్సూర్ ని తాలిబన్ చీఫ్ చేయగా…జలాలుద్దీన్ హక్కానీ తన మరో కుమారుడు సిరాజుద్దీన్ హక్కానీని రెండో ర్యాంక్ కి ప్రమోట్ చేశాడు. అల్ ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ కి చెందిన కీలక వ్యక్తులతో కలిసి పనిచేసిన సిరాజుద్దీన్ హక్కానీ అమెరికా మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో ఉన్నాడు.

2018లో జలాలుద్దీన్ హక్కానీ చనిపోవడంతో అయన స్థానాన్ని కుమారుడు సిరాజుద్దీన్ హక్కానీ దక్కించుకున్నాడు. ప్రస్తుతం తాలిబన్ లో డిప్యూటీ అమీర్ గా సిరాజుద్దీన్ హక్కానీ కొనసాగుతున్నారు. సిరాజ్ మేనల్లుడు ఖలీల్ హక్కానీ చేతిలోనే ప్రస్తుతం కాబుల్ రక్షణ బాధ్యతలు ఉన్నాయి. ఇతడు కూడా అమెరికా మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్నాడు.

కొన్నేళ్లుగా అఫ్ఘానిస్తాన్ లో మైనారిటీలు లక్ష్యంగా దాడులకు పాల్పడుతోంది హక్కానీ నెట్ వర్క్. భారతీయులను లక్ష్యంగా చేసుకొని పలు దాడులకు పాల్పడింది. 2008లో భారత దౌత్య కార్యాలయం పైకి దాడి ఈ గ్రూప్ పనే. ఈ ఘటనలో 58 మంది మరణించారు. ఇదేకాకూండా పలు ఆత్మాహుతి దాడులు,బాంబు పేలుళ్లకు పాల్పడింది ఈగ్రూప్. ఇటీవల కాబుల్ ఎయిర్ పోర్ట్ వద్ద ఆత్మాహుతి దాడులు జరిపిన ఐసిస్-కే ఉగ్ర సంస్థతో కూడా హక్కానీ నెట్ వర్క్ కి మంచి సంబంధాలు ఉన్నాయి.