Taliban : అసలు ఎవరీ తాలిబన్లు..వీళ్ల లక్ష్యం ఏంటీ!

అఫ్ఘానిస్తాన్ ని మళ్లీ తాలిబన్లు తమ చేతుల్లోకి తీసుకున్నారు. మరికొద్ది గంటల్లో అఫ్ఘానిస్తాన్ లో మధ్యంతర తాలిబన్ ప్రభుత్వం ఏర్పడనుంది.

Taliban : అసలు ఎవరీ తాలిబన్లు..వీళ్ల లక్ష్యం ఏంటీ!

Af (1)

Taliban  అఫ్ఘానిస్తాన్ ని మళ్లీ తాలిబన్లు తమ చేతుల్లోకి తీసుకున్నారు. మరికొద్ది గంటల్లో అఫ్ఘానిస్తాన్ లో మధ్యంతర తాలిబన్ ప్రభుత్వం ఏర్పడనుంది. కొత్త అఫ్ఘాన్ అధ్యక్షుడిగా తాలిబన్‌ కామాండర్‌ ముల్లా అబ్దుల్‌ ఘనీ బరదార్‌(53) బాధ్యతలు చేపట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అయితే అసలు అఫ్ఘానిస్తాన్ లో ఈ తాలిబన్ల ఎవరు, వీళ్ల లక్ష్యం ఏంటీ, రెండు దశాబ్దాల తర్వాత అఫ్ఘానిస్తాన్ లో మళ్లీ రక్తపాతం ఎందుకు జరుగుతోంది. అప్ఘానిస్తాన్ లో ప్రస్తుత పరిస్థితికి అమెరికానే కారణమా అనే విషయాలు ఇప్పుడు చూద్దాం

అసలు తాలిబన్ అంటే ఏంటీ..వీళ్ల ఉద్యమం ఎలా మొదలైంది..లక్ష్యం ఏంటీ
తాలిబ‌న్ అనే ప‌దం తాలిబ్ అనే అర‌బిక్ ప‌దం నుంచి వచ్చింది. తాలిబ్ అంటే విద్యార్థి అని అర్థం. పాకిస్తాన్ కి చెందిన మ‌త‌ప‌ర‌మైన స్కూలు విద్యార్థులు దీనిని స్థాపించారు కాబ‌ట్టి ఈ మిలిటెంట్ గ్రూప్‌కు తాలిబ‌న్లు అనే పేరు వ‌చ్చింది. పాకిస్తాన్‌లోని ఆదివాసీ ప్రాంతాల్లో పఖ్తూన్ హక్కుల కోసం మొదలైన ఈ ఉద్యమం మొదట్లో మత సంస్థలలోనే కనిపించేది. సున్నీ అతివాద ఇస్లాం బోధలు చేసే ఈ మత సంస్థలకు నిధులు చాలా వరకు సౌదీ అరేబియా నుంచి అందేవి. తమకు కనుక అధికారం వస్తే పాకిస్తాన్, అఫ్గానిస్తాన్‌ల మధ్య ఉండే పఖ్తూన్ ప్రాంతంలో ‘కఠినమైన షరియా లేదా ఇస్లాం చట్టాన్ని అమలు చేసి శాంతిభద్రతలు నెలకొల్పుతామని తాలిబన్లు అక్కడి వారికి హామీ ఇచ్చారు.

ప్రస్తుతం 75 వేల మంది వరకు ఉన్న తాలిబన్ గ్రూప్ ని..1989లో పఖ్తూన్ తెగ‌కు చెందిన ముల్లా మొహ‌మ్మ‌ద్ ఒమ‌ర్ ద‌క్షిణ అఫ్ఘ‌ానిస్తాన్ లో ప్రారంభించాడు. ముజాహిదీన్ క‌మాండ‌ర్‌గా మారిన అత‌డు..ఆ ఏడాది సోవియ‌ట్ల‌ను దేశం నుంచి త‌రిమివేయ‌డంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించాడు. 1994లో కాంద‌హార్ చేరిన ముల్లా.. 50 మంది అనుచ‌రుల‌తో ఓ గ్రూప్ ఏర్పాటు చేశాడు. అక్క‌డి నుంచి త‌న సంస్థ‌ను బ‌లోపేతం చేసుకుంటూ వెళ్లిన ముల్లా.. రెండేళ్ల‌లోనే కాంద‌హార్‌తోపాటు రాజ‌ధాని కాబూల్‌ను కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

వీళ్లు త‌మ‌కు తాము ఇస్లామిక్ ఎమిరేట్స్ ఆఫ్  అఫ్ఘానిస్తాన్ గా చెప్పుకుంటారు. రాజ‌కీయ అస్థిర‌త‌, ప్ర‌జ‌ల్లో నెల‌కొన్న భ‌యాన్ని ఆస‌రాగా చేసుకొని తాలిబ‌న్లు చాలా వేగంగా దేశం మొత్తం విస్త‌రించారు. 1996-2001 మధ్య కాలంలో అఫ్ఘానిస్తాన్ లో తాలిబన్లు అధికారంలో ఉన్నారు. కఠినమైన ఇస్లామిక్ చట్టాలను అప్పట్లో తాలిబన్లు అమలు చేశారు. తొలినాళ్లలో, దేశంలో అవినీతిని అణచివేయడంలో, చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టడంలో,వాళ్ళ అధీనంలో ఉన్న రోడ్లు, ప్రాంతాలను వ్యాపారాభివృద్ధికి అనువుగా చేయడంతో తాలిబన్లు బాగా పాపులారిటీ సంపాదించారు.

కానీ, వీటితో పాటు తాలిబన్లు శిక్ష పడిన హంతకులను, మోసం చేసినవారిని బహిరంగంగా ఉరి తీయడం, దొంగతనం చేసిన వారికి కాళ్లు చేతులు విరిచి అంగవికలుగా చేయడం లాంటి ఇస్లామిక్ శిక్షలను కూడా ప్రవేశపెట్టారు. పురుషులందరూ కచ్చితంగా గెడ్డం పెంచుకోవాలని, మహిళలు బురఖా ధరించాలనే నియమాలను కూడా విధించారు. టెలివిజన్, సినిమాలు చూడటాన్ని, సంగీతం వినడాన్ని నిషేధించారు. 10 ఏళ్లు నిండిన అమ్మాయిలను బడికి పంపడాన్ని కూడా ఆమోదించలేదు. అయితే అమెరికాలోని వ‌ర‌ల్డ్ ట్రేడ్ సెంట‌ర్‌పై దాడిలో ప్ర‌ధాన సూత్ర‌ధారి అయిన ఒసామా బిన్ లాడెన్‌కు ఈ తాలిబ‌న్లే ఆశ్ర‌యం క‌ల్పించారు. బిన్ లాడెన్ ని త‌మ‌కు అప్ప‌గించాల్సిందిగా అమెరికా డిమాండ్ చేసినా తాలిబ‌న్లు విన‌క‌పోవ‌డంతో.. ఇక అగ్ర‌రాజ్య ద‌ళాలు ఆ దేశంలో అడుగుపెట్టాయి. దీంతో ముల్లా ఒమ‌ర్‌, మిగ‌తా తాలిబ‌న్ లీడ‌ర్లు అఫ్ఘ‌ానిస్తాన్ నుంచి పారిపోయి పాకిస్తాన్ త‌ల‌దాచుకున్నారు. 2001 నుంచి మొన్నటివరకూ అమెరికా ద‌ళాలు అఫ్ఘానిస్తాన్ లో ఉన్న విషయం తెలిసిందే.ఇప్పుడు అమెరికా సేనలు వెళ్లిపోవడంతో మళ్లీ అప్ఘానిస్తాన్ లో అధికారం చేపట్టేందుకు తాలిబన్లు రెడీ అయ్యారు.

ప్రస్తుత పరిస్థితికి అమెరికానే కారణమా

దాదాపు రెండు దశాబ్దాలు అఫ్ఘానిస్తాన్‌లో తమ బలగాలను మోహరించింది అమెరికా. రెండు దశాబ్దాల పాటు.. ప్రపంచంలోనే మేటి ఆర్మీగా పేరున్న అమెరికా.. అఫ్ఘాన్ సైన్యానికి శిక్షణ ఇచ్చింది. అఫ్ఘానిస్థాన్ ఆర్మీకి అత్యాధునిక శిక్షణ ఇవ్వడానికి అమెరికా చేసిన ఖర్చు రూ.6.6 లక్షల కోట్లు పైమాటే. అఫ్ఘ‌ానిస్తాన్ లో 3 ల‌క్ష‌ల మంది సుశిక్షుతులైన సైనికులు ఉన్నారు. వాళ్ల దేశాన్ని వాళ్లు కాపాడుకునే స‌త్తా వారికి ఉంది అని అమెరికా చెబుతూ వ‌చ్చింది. కానీ వాస్త‌వం మాత్రం మ‌రోలా ఉంది. తాలిబన్లను ఏరేసి ఆ దేశాన్ని ఉద్ధరిస్తామని చెప్పిన అగ్రరాజ్యం ఇప్పుడు పెట్టాబేడా సర్దుకొని దేశం వీడింది. ఇన్నాళ్లూ ఏ లక్ష్యం కోసం పనిచేసిందో.. ఇప్పుడది కళ్ల ముందే నీరుగారిపోతున్నా.. ఏమీ పట్టనట్లు చోద్యం చూస్తోంది.

తమను తాము రక్షించుకునేలా అఫ్ఘన్ సైన్యాన్ని సిద్ధం చేశామని చెప్పుకున్నా..అలాంటి ఆర్మీని నెల రోజుల్లోపే సునాయాసంగా మట్టి కరిపించిన తాలిబన్లు ఇప్పుడు అగ్రరాజ్య వైఫల్యాన్ని ప్రపంచానికి కళ్లకు కట్టినట్లు చూపించారు. చాలా చోట్ల అప్ఘాన్ ప్రభుత్వ దళాలు కనీస పోరాటం కూడా లేకుండా తాలిబన్లకు లొంగిపోయారు. కొన్ని చోట్ల తాలిబన్లు రాక ముందే తమ పోస్టులు వదిలి పారిపోయారు. మరికొన్ని చోట్ల వాళ్లతో పోరాడలేక శాంతి ఒప్పందాలు చేసుకొని తమ ఆయుధాలను అప్పగించేశారు. కొన్ని ప్రావిన్స్‌ల గవర్నర్లే.. తమ భద్రతా సిబ్బందికి లొంగిపోవాలని ఆదేశించినట్లు అమెరికా అధికారులు చెబుతున్నారు. ఇలా తాలిబన్లు ఒక్కో నగరాన్ని హస్తగతం చేసుకుంటూ.. మొత్తం దేశాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవడానికి కొన్ని రోజుల వ్యవధి మాత్రమే పట్టింది.

ద‌ళాలు వెన‌క్కి ఎందుకు

2018లో తాలిబాన్లు నేరుగా అమెరికాతో చర్చలు జరపడం మొదలుపెట్టారు. చివరకు దోహాలో ఫిబ్రవరి 2020లో రెండు వర్గాలు శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఆ ఒప్పందాన్ని అనుసరించి అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా తమ సేనలను ఉపసంహరించుకునేందుకు, తాలిబాన్లు అమెరికా సేనలపై దాడులు జరపకుండా ఉండేందుకు అంగీకారం కుదిరింది. తాలిబాన్ల నియంత్రణలో ఉన్న ప్రాంతాల్లో మిలిటెంట్ గ్రూప్ అల్ ఖైదా లేదా ఇతర మిలిటెంట్ గ్రూపులను తమ కార్యకలాపాలు నిర్వహించేందుకు అనుమతించకూడదన్నది కూడా ఈ ఒప్పందంలో ఉంది. వీటితో పాటు జాతీయ శాంతి చర్చలు నిర్వహించేందుకు ముందుకు కదలాలని కూడా నిర్ణయించుకున్నారు. కానీ, ఈ ఒప్పందం చేసుకున్న మరుసటి సంవత్సరమే, తాలిబన్లు అఫ్గాన్ భద్రతా దళాలను, పౌరులను లక్ష్యంగా చేసుకోవడం ప్రారంభించాయి.

దోహ ఒప్పందం ప్రకారం 2011 నుంచి చేస్తున్న పోరాటానికి ముగింపు పలుకుతూ అమెరికా సైనికులు అప్ఘాన్ నుంచి వెళ్లిపోయిన నేపథ్యంలో మళ్లీ తాలిబాన్లు అప్ఘాన్ వ్యాప్తంగా తమ ప్రాబల్యాన్ని పెంచుకున్నారు. అమెరికా బ‌ల‌గాల మ‌ద్ద‌తు లేక‌పోవ‌డంతో అఫ్ఘ‌ాన్ సేన‌లు వారికి ఎదురు నిల‌వ‌లేక‌ వారికి సరెండర్ అయ్యారు. అమెరికాకు ఇచ్చిన హామీని తాలిబ‌న్లు తుంగ‌లో తొక్కుతున్నారు. శాంతియుతంగా ప్ర‌భుత్వంతో చ‌ర్చ‌లు జ‌రుపుతామ‌న్న హామీని కూడా తాలిబ‌న్లు ప‌ట్టించుకోలేదు. అయితే అప్ఘానిస్తాన్ నుంచి దళాల ఉపసంహరణ విషయంలో తమ నిర్ణయం సరైనదేనని ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెబుతున్నారు.