×
Ad

ఇరాన్‌ ఆందోళనల్లో 5,000 మంది మృతి.. 24,000 మందికి పైగా అరెస్టు.. ఇంకా ఏం జరగనుంది?

ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. “ఇరాన్‌కు కొత్త నాయకత్వం రావాల్సిన సమయం వచ్చింది” అని అన్నారు.

Iran Protests (Image Credit To Original Source)

  • మృతుల్లో 500 మంది భద్రతా సిబ్బంది
  • మృతుల సంఖ్యను ధ్రువీకరించామన్న అధికారి
  • అమెరికా, ఇజ్రాయెల్‌పై ఆరోపణలు

Iran Protests: ఇరాన్ వ్యాప్తంగా జరిగిన నిరసనల్లో ఇప్పటివరకు దాదాపు 5,000 మంది మరణించారని ఆ దేశ అధికారి ఒకరు చెప్పారు. మృతుల్లో దాదాపు 500 మంది భద్రతా సిబ్బంది ఉన్నారని తెలిపారు.

అమాయక పౌరులపై ఉగ్రవాదులు, సాయుధ అల్లరిమూకలు దాడులు చేశాయని ఆయన ఆరోపించారు. మృతుల సంఖ్యను ధ్రువీకరించామని, ఆ సంఖ్య భారీగా పెరిగే అవకాశం లేదని ఆయన చెప్పారు. నిరసనల్లో పాల్గొన్నవారికి విదేశాల నుంచి మద్దతు, ఆయుధాలు అందాయని ఆరోపించారు.

ఇరాన్‌ వ్యాప్తంగా డిసెంబర్ 28న నిరసనలు ప్రారంభమయ్యాయి. ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థ కుదేలు కావడంపై ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుని ఆందోళనలు చేపట్టారు.

ఇరాన్ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ నేతృత్వంలోని ఇస్లామిక్‌ పాలనకు చరమగీతం పాడడమే లక్ష్యంగా నిరసనలు కొనసాగుతున్నాయి. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత ఆ స్థాయిలో మళ్లీ ఇప్పుడు అంతటి ప్రాణనష్టం జరిగింది.

Also Read: పాక్‌ను ఆశ్రయించిన బంగ్లా.. టీ20 ప్రపంచ కప్-2026లో మేమూ ఆడాలా? వద్దా? పాక్‌ పునరాలోచన?

కొన్ని రోజులుగా జరుగుతున్న హింసకు విదేశీ శత్రువులే కారణమని ఇరాన్ అధికారులు పదేపదే ఆరోపిస్తున్నారు. అమెరికా, ఇజ్రాయెల్ వల్లే ఇరాన్‌లో అశాంతి నెలకొందని ఖమేనీ ఆరోపిస్తూ, వేలాది మంది మరణించారని కూడా చెప్పారు.

24,000 మందికి పైగా అరెస్టు
అమెరికాలో ఉన్న మానవ హక్కుల కార్యకర్తల వార్తా సంస్థ (HRANA) శనివారం నాటికి 3,308 మంది మృతి చెందినట్లు తమ రికార్డుల్లో రాశామని తెలిపింది. మరో 4,382 కేసులు పరిశీలనలో ఉన్నాయని పేర్కొంది. 24,000 మందికి పైగా అరెస్టయ్యారని ఆ సంస్థ తెలిపింది. ఇరాన్ మానవ హక్కుల ఉల్లంఘనలపై సమాచారాన్ని సేకరించే సంస్థే హెచ్ఆర్ఏఎన్ఏ.

ట్రంప్ హెచ్చరిక
నిరసనకారులపై హత్యాకాండకు పాల్పడితే అమెరికా జోక్యం చేసుకునే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. సామూహిక ఉరి శిక్షలను ఇరాన్‌ నిలిపివేసిందని, అలా చేసినందుకు ఆ దేశ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని తాజాగా అన్నారు.

అయితే, ఉరి శిక్షలు కొనసాగవచ్చంటూ ఆదివారం ఇరాన్ న్యాయవ్యవస్థ సంకేతమిచ్చింది. శనివారం అంతర్జాతీయ వార్తా మాధ్యమం పొలిటికోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. “ఇరాన్‌కు కొత్త నాయకత్వం రావాల్సిన సమయం వచ్చింది” అని అన్నారు.

మరోవైపు, “దేశాన్ని యుద్ధంలోకి లాగం, అలాగే.. దేశీయ లేదా అంతర్జాతీయ నేరస్తులను శిక్షించకుండా వదలము” అని ఖమేనీ చెప్పారు. న్యాయవ్యవస్థ ప్రతినిధి అస్గర్ జహంగీర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కొన్ని కేసులను మొహరెబ్‌గా వర్గీకరించామని తెలిపారు. మొహరెబ్ అంటే దేవుడిపై యుద్ధం చేయడం అనే ఇస్లామిక్ చట్టపరమైన పదం. ఇరాన్‌లో దీని ప్రకారం మరణశిక్ష విధిస్తారు.