DOGE Vacancy : వారానికి 80 గంటల పని, సూపర్ హై ఐక్యూ, జీతం లేకుండా పనిచేసేవారు కావాలి : డోజ్ శాఖ

DOGE Vacancy : డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫిషియెన్సీ (DOGE) శాఖకు నాయకత్వం వహించేందుకు మస్క్, వివేక్ రామస్వామిని ట్రంప్ నియమించారు. తాజాగా దీనికి సంబంధించి ఒక పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

DOGE Vacancy ( Image Source : Google )

DOGE Vacancy : ప్రపంచ బిలియనీర్, టెస్లా అధినేత ఎలన్ మస్క్, రిపబ్లికన్ పార్టీ నేత భారతీయ సంతతికి చెందిన వివేక్ రామస్వామిలకు డొనాల్డ్ ట్రంప్ కీలక బాధ్యతలను అప్పగించారు. వచ్చే జనవరి 20న ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు.

ఈ నేపథ్యంలో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫిషియెన్సీ (DOGE) శాఖకు నాయకత్వం వహించేందుకు మస్క్, వివేక్ రామస్వామిని ట్రంప్ నియమించారు. తాజాగా ఈ డోజ్ శాఖకు సంబంధించి ఒక పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎలన్ మస్క్‌, వివేక్‌ కోసం పనిచేసేందుకు ఆసక్తిగల వారు కావాలనేది ఈ పోస్టు సారాంశం. దీని ప్రకారం.. వారానికి 80 గంటలు పనిచేసేవారు, హై ఐక్యూతో పనిచేసేవారు కావాలని అందులో ఉంది.

డోజ్‌ శాఖ కోసం పనిచేసేందుకు ఇష్టపడేవారు ఎవరైనా ఎక్స్‌ అధికారిక అకౌంటుకు దరఖాస్తులు పంపించాలని కోరుతున్నారు. అయితే, ఇందులో ఒక షరతు విధించారు. డోజ్ కోసం పనిచేసేవారికి తప్పనిసరిగా ఎక్స్ ప్రీమియం అకౌంట్ సబ్‌స్ర్కిప్షన్  ఉండాలని సూచించారు. అలాంటి వారే ఈ పోస్టుకు అర్హులుగా పేర్కొన్నారు.

ఎంపిక చేసిన ఒక శాతం దరఖాస్తులను మస్క్, వివేక్ పరిశీలిస్తారని పోస్టులో వెల్లడించారు. అలాంటి వ్యక్తుల కోసం వెతుకుతున్నామని తెలిపారు. అంతేకాదు.. పార్ట్‌ టైమ్‌ ఐడియాస్ ఇచ్చేవారు తమకు అవసరం లేదని ప్రకటనలో స్పష్టం చేశారు. డోజ్ శాఖలో వర్క్ చేసేవారికి నిర్దిష్ట విద్యార్హత లేదా వృత్తిపరమైన అనుభవం అవసరం లేదని, తమ సీవీలను ఎక్స్‌లో డైరెక్ట్‌ మెసేజ్‌ ద్వారా పంపాలని సూచించారు.

ప్రస్తుతం అమెరికా ప్రభుత్వం అనేక వృథా ఖర్చులు చేస్తోందని, అందుకే ‘డోజ్‌’ ప్రాజెక్టు రూపొందించినట్టు అధికారులు వెల్లడించారు. ఈ డోజ్ శాఖను మస్క్, వివేక్‌ సమర్థంగా ముందుకు నడిపిస్తూ అనేక మార్పులు చేపడతారని భావిస్తున్నట్టుగా ట్రంప్‌ పేర్కొన్నారు.

ప్రతి ఏడాది అమెరికా ప్రభుత్వం ఖర్చుపెట్టే 6.5 ట్రిలియన్‌ డాలర్లలో అవినీతితో పాటు అనవసర ఖర్చులకు అడ్డుకట్ట వేస్తామని తెలిపారు. ‘సేవ్‌ అమెరికా’ ఉద్యమానికి రాబోయే మార్పులు అవసరమని ట్రంప్ అభిప్రాయపడ్డారు. మరోవైపు ఈ డోజ్ నియామకంపై మస్క్ మాట్లాడుతూ.. వ్యవస్థలో అనేక ప్రకంపనలు సృష్టించనున్నట్టు తెలిపారు. అమెరికా ఫెడరల్ బడ్జెట్ నుంచి కనీసం 2 ట్రిలియన్ డాలర్లను తగ్గించుకోవచ్చునని మస్క్ అంచనా వేశారు.

Read Also : Narayana Murthy : ‘నన్ను క్షమించండి.. పని గంటలపై నాది అదేమాట.. తుదిశ్వాస వరకు మారదు.. ఇన్ఫోసిస్ మూర్తి