Triple Conjunction Representative Image (Image Credit To Original Source)
Triple Conjunction: చంద్రుడు, శని, నెప్ట్యూన్ కలిసి ఏర్పడే అరుదైన ట్రిపుల్ కన్జంక్షన్ ఇవాళ రాత్రి ఏర్పడింది. రాత్రి సమయంలో భూమి మీది నుంచి చూసినప్పుడు పడమర దిశలో కనిపించే ఆకాశ భాగంలో ఇవాళ ట్రిపుల్ కన్జంక్షన్ ఏర్పడింది.
సూర్యాస్తమయం తర్వాత చంద్రుడు ప్రకాశవంతమైన శనికి సమీపంగా కనిపించాడు. మసకగా కనిపించే నెప్ట్యూన్ కూడా దగ్గరలోనే ఉండి చిన్న గుంపులా దర్శనమిచ్చింది. శని, నెప్ట్యూన్ కింద స్వల్పంగా వంపుతో ఉండి చంద్రుడు కనపడ్డాడు. దీంతో చిరు నవ్వులు చిందించే ఆకారంలా ట్రిపుల్ కన్జంక్షన్ కనపడింది. మూడు ఖగోళ వస్తువులు భూమి నుంచి చూసినప్పుడు దగ్గరగా కనిపించే సమయంలో ఈ ట్రిపుల్ కన్జంక్షన్ జరుగుతుంది.
ట్రిపుల్ కన్జంక్షన్ అంటే ఏంటి?
ఆకాశంలో ఖగోళ వస్తువులు భూమి నుంచి చూసినప్పుడు దగ్గరగా కనిపించే దృశ్యాన్ని ట్రిపుల్ కన్జంక్షన్ అంటారు. భూమి దృష్టికోణంలో ఖగోళ వస్తువులు ఒకదానికొకటి సమీపంగా కనిపించినప్పుడు ట్రిపుల్ కన్జంక్షన్ జరుగుతుంది.
అవి అంతరిక్షంలో చాలా దూరంగా ఉన్నప్పటికీ మనకు ఇలా కనపడతాయి. ఇవాళ సంధ్యా సమయం తర్వాత చంద్రుడు, శని, నెప్ట్యూన్ చిన్న గుంపులా కనిపించాయి. శని స్థిరంగా మెరుస్తూ, చంద్రుడు ప్రకాశిస్తూ, నెప్ట్యూన్ మాత్రం మసకగా ఉండటంతో దీన్ని చూడడానికి టెలిస్కోప్ అవసరం అవుతుంది.
సూర్యాస్తమయం తర్వాత సుమారు 30 నుంచి 90 నిమిషాల మధ్య కనపడ్డ ట్రిపుల్ కన్జంక్షన్ ఆ తర్వాత పడమర హోరైజన్ కిందకు దిగిపోయాయి.
Also Read: చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో చెప్పిన వృద్ధురాలు.. 3 సార్లు చనిపోయి బతికిందట..
చంద్రుడు-శని-నెప్ట్యూన్ ట్రిపుల్ కన్జంక్షన్ ప్రపంచంలోని చాలా ప్రాంతాల నుంచి కనిపించింది. ఉత్తరార్థగోళంలో అమెరికా, కెనడా, యూరోప్, ఆసియా ప్రాంతాల వారు సూర్యాస్తమయం తర్వాత కొద్దిసేపట్లో ఈ అమరికను చూడవచ్చు. దక్షిణార్థగోళంలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, దక్షిణ అమెరికా కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ దృశ్యం కనిపిస్తుంది.
కన్జంక్షన్లు ఎందుకు జరుగుతాయి?
గ్రహాలు సూర్యుని చుట్టూ దాదాపు ఒకే సమతలంలో పరిభ్రమిస్తాయి. అందువల్ల అప్పుడప్పుడు అవి ఆకాశంలో దగ్గరగా కనిపిస్తాయి. చంద్రుడు, గ్రహాలు అంతరిక్షంలో భౌతికంగా దగ్గరగా ఉండవు. భూమి నుంచి చూసినప్పుడు మాత్రమే సమీపంగా అనిపిస్తాయి.
గ్రహాల కన్జంక్షన్లు తరచుగా జరుగుతుంటాయి. నెప్ట్యూన్ పాల్గొనే ట్రిపుల్ కన్జంక్షన్ మాత్రం అరుదు. ఎందుకంటే నెప్ట్యూన్ చాలా దూరంలో ఉన్న మసక గ్రహం. నెప్ట్యూన్ ప్రకాశం సుమారు మాగ్నిట్యూడ్ ~7.9, సాధారణ పరిస్థితుల్లో కంటికి కనిపించదు.
సూర్యాస్తమయం తర్వాత బయటకు వెళ్లి పడమర హోరైజన్ వైపు చూసిన వారికి ఇది కనపడింది. కాంతి కాలుష్యం తక్కువగా ఉన్న చీకటి ప్రదేశాన్ని ఎంచుకుని చూడాలి.