INSL3
INSL3 : పురుషులలో వయస్సు పెరిగేకొద్దీ ఎముకల బలహీనత, లైంగిక పనిచేయకపోవడం, మధుమేహం , క్యాన్సర్, హృదయ సంబంధ వ్యాధులతో సహా వివిధ రకాల వయస్సు సంబంధిత అనారోగ్యాలు వంటి సమస్యలు వస్తుంటాయి. స్థిరమైన స్థాయిలో కనిపించే ఒకే ఒక్క హార్మోన్ ద్వారా అంచనా వేయవచ్చని తాజా పరిశోధనలో వెల్లడైంది. ఆ హార్మోన్ ‘INSL3’.. అంటే పురుషులకు భవిష్యత్తులో వచ్చే వ్యాధులను ముందుగానే తెలుసుకోవచ్చంటున్నారు పరిశోధకులు. INSL3 హార్మోన్ స్థాయిలను బట్టి తెలుసుకోవచ్చంటున్నారు.
పురుషులలో టీనేజ్ (కౌమార దశ) ఆరంభంలో ఈ హార్మోన్ తయారీ మొదలవుతుందట. అక్కడి నుంచి జీవితాంతం ఒకే స్థాయిలో ఈ హార్మోన్ స్థాయిలు ఉంటాయి. కానీ శరీరంలో వృద్ధాప్యం లక్షణాలు ప్రారంభమైనే ఈ హర్మోన్ స్థాయిలు కాస్త తగ్గుతాయట. అంటే ఆ హార్మోన్ స్థాయినులను బట్టి వృద్ధాప్యం సమస్యలు రావటాన్ని గుర్తించవచ్చంటున్నారు పరిశోధకులు. యుక్త వయసులో ఈ హార్మోన్ తక్కువగా ఉన్న మగవారికి వృద్ధాప్యంలో మరింత తక్కువగా ఉంటుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది.
ఈ INSL3 హార్మోన్ యుక్త వయసులో తక్కువగా ఉందంటే భవిష్యత్తులో మరింత తగ్గినప్పుడు కచ్చితంగా వ్యాధులు చుట్టుముడతాయనేది అంచనా వేస్తున్నారు. అంటే ఈ హార్మోన్ స్థాయిలు ఎక్కువగా ఉంటే వృద్ధాప్యంలో వచ్చే ఆరోగ్య సమస్యలు లేటుగా వస్తాయన్నమాట. చిన్న వయసులోనే ఈ INSL3 హార్మోన్ స్థాయిలను తెలుసుకోవడం ద్వారా భవిష్యత్తులో వారు వ్యాధుల బారిన పడకుండా ముందస్తు నివారణ చర్యలు తీసుకోవడానికి వీలు పడుతుందని భావిస్తున్నారు పరిశోధకులు.
సాధారణంగా వయస్సు పెరిగే కొద్దీ అనారోగ్య సమస్యలు పెరుగుతుంటాయి. ఆయా సమస్యలకు చికిత్స చేయించుకున్నా ఉపశమనం తక్కువ స్థాయిలోనే ఉంటుంది. కొంత మందికి వయసు పెరిగేకొద్దీ అనారోగ్యం, వ్యాధులు ఎందుకొస్తాయన్నది అర్థం కాదు. కానీ అది తెలుసుకోవటం చాలా అవసరం. అలా తెలుసుకుంటే నివారణ లేదా నియంత్రణ చర్యలు తీసుకోవచ్చు. అలా తీసుకుంటే సదరు వ్యక్తులు దీర్ఘకాలం పాటు ఆరోగ్యంగా జీవించే మార్గాలను కనుగొనగలం అంటున్నారు పరిశోధకులు. అంతేగా మరి సమస్య తెలిస్తేనే పరిష్కారం తెలుసుకోవచ్చు.
దీన్ని అర్థం చేసుకునేందుకు మా INSL3 హర్మోన్ ఆవిష్కరణ ఓ కీలకమైన అడుగు అవుతుందంటున్నారు. సమాజంలో ఆరోగ్య సంరక్షణ సంక్షోభాన్ని అధిగమించడానికి ఈ మార్గం సుగమం చేస్తుందంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ నాటింగ్ హమ్ రీప్రొడక్టివ్ ఎండోక్రైనాలజిస్ట్ రవీంద్ర ఆనంద్ ఇవెల్. టెస్టోస్టెరాన్‌ను ఉత్పత్తి చేసే వృషణాలలోని అదే కణాల ద్వారా INSL3 తయారు చేయబడుతుంది. టెస్టోస్టెరాన్ వలె కాకుండా..పురుషులు వయస్సు పెరిగేకొద్దీ INSL3 హెచ్చుతగ్గులకు లోనవుతుంది.
రక్తంలో INSL3 స్థాయిని పర్యవేక్షించడానికి..పరిశోధకులు ఐరోపాలోని ఎనిమిది వేర్వేరు ప్రాంతీయ కేంద్రాలలో 2,200 కంటే ఎక్కువ మంది పురుషుల నుంచి నమూనాలను సేకరించారు. వీరిలో కొంతమంది పురుషుల INSL3 స్థాయిలు కాలక్రమేణా స్థిరంగా ఉన్నాయి. మరికొందరిలో వీటి స్థాయిలు గణనీయంగా మారుతూ ఉన్నాయని గుర్తించారు.