Taliban Attack
Taliban Attack : అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా బలగాలు వెనుదిరగడంతో తాలిబన్లు దాడులు ప్రారంభించారు. ఇంతకాలం కొంత ప్రశాంతంగా ఉన్న అఫ్గాన్.. బాంబుల మోతలు.. బుల్లెట్ల శబ్దాలతో అట్టుడుకుతోంది. అమెరికా దళాలు వెళ్ళిపోయి వారం కూడా కాలేదు అప్పుడే 431 జిల్లాలను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. తాలిబన్ల చేతిలోకి వెళ్లిన ప్రాంతాల్లోని ప్రజలు ప్రాణభయంతో ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు.
ఇక ఇదిలా ఉంటే తాలిబన్ ఉగ్రవాదుల దాడులు తట్టుకోలేక అఫ్గాన్ సైన్యం పక్కదేశానికి పారిపోయింది. సుమారు 1000 మంది అఫ్గాన్ బలగాలు తమ దేశంలోకి వచ్చినట్లుగా పక్కదేశం తజికిస్తాన్ తెలిపింది. ఈ పరిస్థితిపై తజికిస్థాన్ ఆందోళన వ్యక్తం చేసింది. భద్రతాపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే సరిహద్దుల్లో భద్రత పెంచింది. ప్రజలు కూడా వచ్చే అవకాశం ఉండటంతో ఆ దేశం ఆందోళన వ్యక్తం చేస్తుంది.
తజికిస్థాన్ అధ్యక్షుడు తాజా పరిణామాలను అఫ్గానిస్థాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘానీ దృష్టికి తీసుకెళ్లారు. అప్గాన్ సైనికులు ఇలా బలవంతంగా సరిహద్దు దాటటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ఈ నేపథ్యంలోనే అఫ్గాన్ సైనికులు తలదాచుకునేందుకు కాందిశీకుల శిబిరాలు ఏర్పాటు చేయాలనీ తజికిస్థాన్ ప్రభుత్వం భావిస్తుంది. ప్రజలు తమ దేశంలోకి వస్తే ఆహార కొరత ఏర్పడే అవకాశం ఉందని తజికిస్తాన్ ప్రధాని పేర్కొన్నారు.