Afghanistan Earthquake: అప్ఘానిస్థాన్ లో భూకంపం భారీ విధ్వంసం సృష్టించింది. పెను విషాదాన్ని నింపింది. పెద్ద సంఖ్యలో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. ఆదివారం రాత్రి 6.0 తీవ్రతతో వచ్చిన శక్తివంతమైన భూకంపం కునార్, నంగర్‌హార్ ప్రావిన్స్‌లను కుదిపేసింది. భూకంప విధ్వంసానికి ఊళ్లకు ఊళ్లే మాయమయ్యాయి. మృతుల సంఖ్య అంతకంతకు భారీగా పెరుగుతోంది. ఇప్పటివరకు 1400 మందికి పైగా చనిపోయారు. 3వేల మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ విపత్తులో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్న వార్తలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. భూకంపం వల్ల పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో రహదారులు మూసుకుపోయి సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు వాపోయారు.
భూకంపం సంభవించిన ప్రాంతంలో పరిస్థితులు చాలా దయనీయంగా ఉన్నాయి. అక్కడి దృశ్యాలు హృదయవిదారకంగా ఉన్నాయి. శిథిలాల కింద చాలా మంది చిక్కుకుపోయారు. వారిని కాపాడుకునేందుకు బంధువులు చేస్తున్న ప్రయత్నాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. వారు తమ చేతులతోనే మట్టిని తవ్వి తీస్తున్నారు. వేల సంఖ్యలో ప్రజలు ఇంకా శిథిలాల కిందే ఉండొచ్చని తెలుస్తోంది.
రాత్రి వేళ ప్రజలు గాఢ నిద్రలో ఉన్న సమయంలో భారీ భూకంపం సంభవించింది. ఇళ్ల పైకప్పులు కూలి చాలామంది సజీవ సమాధి అయ్యారు. భూకంప కేంద్రం కేవలం 8 కిలోమీటర్ల లోతులోనే ఉండటంతో తీవ్రత ఎక్కువగా ఉందని అధికారులు తెలిపారు.
ముఖ్యంగా కునార్ ప్రావిన్స్ లో ప్రాణ నష్టం ఎక్కువగా ఉంది. అక్కడ పెద్ద సంఖ్యలో ప్రజలు చనిపోయారు. గత కొన్ని దశాబ్దాల్లో అఫ్ఘానిస్థాన్ లో సంభవించిన అత్యంత శక్తివంతమైన భూకంపాల్లో ఇదొకటి అని అధికారులు చెప్పారు. ప్రపంచంలోని అత్యంత పేద దేశాల్లో అప్ఘానిస్థాన్ ఒకటి. 2021లో తాలిబన్లు అధికారంలోకి వచ్చారు.
కునార్ లో 5వేల 400 ఇళ్లు నేలమట్టం అయ్యాయి. శిథిలాల కింద పెద్ద సంఖ్యలో ప్రజలు చిక్కుకుని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా ఆ ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
Also Read: ఇండియాపై ట్రంప్ మరో బాంబు.. ఫార్మాపై ఏకంగా 200 శాతం టారిఫ్?.. అదే జరిగితే..