Imran Khan: డర్టీ హ్యారీ అని ఇమ్రాన్ ఖాన్ ఎవరిని అన్నారు? అరెస్టుకు చక్రం తిప్పింది ఎవరు? ఆయన అంత డేంజరా?

Imran Khan: ఇమ్రాన్ ఖాన్ డర్టీ హ్యారీ అని అన్నది ఎవరినో కాదు..

Imran Khan: డర్టీ హ్యారీ (Dirty Harry).. పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) నోటి నుంచి వచ్చిన మాట ఇది. అవినీతి ఆరోపణలపై ఇమ్రాన్ ఖాన్ ను పాకిస్థాన్ రేంజర్స్ అరెస్టు చేసి జైలుకి తరలించిన విషయం తెలిసిందే. అంతకుముందు ఇమ్రాన్ ఖాన్ వీడియో రూపంలో మాట్లాడారు.

అందులోనే బ్రిగేడియర్, డర్టీ హ్యారీ అని ఓ వ్యక్తిని ఉద్దేశించి అన్నారు. ఆయనే ఇంతకు ముందు తనపై జరిగిన హత్యాయత్న ప్రయత్నాల వెనుక ఉన్నారని ఇమ్రాన్ చెప్పారు. తాను ఎదుర్కొంటున్న పరిస్థితులకు ఆయనే కారణమని అన్నారు. పాక్ రాజకీయాలను శాసిస్తున్నారన్న ఆరోపణలు ఆ దేశ మిలటరీపై చాలా కాలంగా ఉన్నాయి.

జర్నలిస్టు హత్య వెనుక డర్టీ హ్యారీ?

జర్నలిస్ట్ అర్షద్ షరీఫ్ హత్యకు కూడా ఆ డర్టీ హ్యారీనే బాధ్యుడని ఇమ్రాన్ ఖాన్ ఇటీవలే తెలిపారు. ఇదే ఆరోపణ చేస్తూ గత ఏడాది పాకిస్థాన్ చీఫ్ జస్టిస్ ఉమర్ అటా బండియాల్ కు షరీఫ్ తల్లి రిఫత్ అరా అల్లీ కూడా గతంలో లేఖ రాశారు.

తన కుమారుడి హత్యపై ఉన్నతస్థాయి జ్యుడీషియల్ కమిషన్ తో విచారణ జరిపించాలని కోరారు. గత ఏడాది ఏప్రిల్ లో పాకిస్థాన్ లో ఇమ్రాన్ ఖాన్ కు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెట్టడం వెనుక ఆర్మీ జోక్యం ఉందని ఎన్నో ఆరోపణలు వచ్చాయి. ఆ విషయంలో ఆర్మీకి వ్యతిరేకంగా జర్నలిస్ట్ షరీఫ్ వ్యవహరించారని, అందుకే ఆయనను కాల్చి చంపారని ఆయన తల్లి చెప్పింది.

డర్టీ హ్యారీ ఎవరు?
ఇమ్రాన్ ఖాన్ డర్టీ హ్యారీ అని అన్నది ఎవరినో కాదు.. పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ-ISI) మేజర్ జనరల్ ఫైజల్ నజీర్‌ (Faisal Naseer )ని. ఆయన పాకిస్థాన్ ఆర్మీలో 1992లో చేరారు. గత ఏడాది అక్టోబరులో బ్రిగేడియర్ నుంచి మేజర్ జనరల్ ర్యాంకుకు పదోన్నతి పొందారు.

బలూచిస్థాన్, సింధ్ లో సూపర్ స్పై పాత్ర పోషించారు. ఐఎస్ఐ డీజీ తర్వాత నంబరు 2 పదవి అయిన డీజీ(సీ) గానూ గత ఏడాది మేజర్ జనరల్ ఫైజల్ నియమితుడయ్యారు. పాకిస్థాన్ రాజకీయాల్లో ఆర్మీ జోక్యం బాగా ఉంటుంది. మేజర్ జనరల్ ఫైజల్ నజీర్‌ ఇందులో కీలక పాత్ర పోషించారని ఆరోపణలు ఉన్నాయి.

ఫైజల్ పై ఇమ్రాన్ ఖాన్ బహిరంగంగానే ఆరోపణలు చేశారు. ప్రధాని షెహబాజ్ షరీఫ్, మంత్రి రాణాతో కలిసి ఫైజల్ కుట్ర పన్నారని, తనను గత నవంబరులో హత్య చేయడానికి ప్రణాళికలు వేసుకున్నారని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. పాకిస్థాన్ రాజకీయాల్లో ఆర్మీ చీఫ్ చాలా శక్తిమంతమైన వ్యక్తని చెప్పారు.

పాకిస్థాన్ ప్రభుత్వ ఖజానా ‘తోషఖానా’కు నష్టం కలిగించారని ఇమ్రాన్ ఖాన్ ను అరెస్టు చేసేందుకు పోలీసులు చాలా కాలంగా ప్రయత్నించారు. వారిని అడ్డుకునేందుకు పీటీఐ పార్టీ కార్యకర్తలు ఇమ్రాన్ నివాసం వద్దే ఉండసాగారు. ఇమ్రాన్ ను అరెస్టు చేసేందుకు చేసిన ప్రయత్నాలు పలు సార్లు విఫలమయ్యాయి. చివరకు సోమవారం అరెస్టు చేశారు.

Arun Bothra IPS : ఐపీఎస్ ఆఫీసర్ అరుణ్ బోత్రా అలా మోసపోయారేంటి?

ట్రెండింగ్ వార్తలు