Imran Khan Arrest: ఈ టైములో ఇమ్రాన్ అరెస్టు అవసరమా.. పాకిస్థాన్ లో ఇంతకీ ఏం జరుగుతుంది..?

పాక్‌లో పూర్తికాలం పనిచేసిన ప్రధానిగా అరుదైన రికార్డును ఇమ్రాన్ సొంతం చేసుకుని ఉండేవారు. కానీ అలా జరగలేదు. ఎందుకంటే అది పాకిస్థాన్.

Imran Khan Arrest: ఈ టైములో ఇమ్రాన్ అరెస్టు అవసరమా.. పాకిస్థాన్ లో ఇంతకీ ఏం జరుగుతుంది..?

Imran Khan Arrest: ఇమ్రాన్ ఖాన్ అరెస్టుతో వాట్ నెక్ట్స్? ఎన్నికలు జరుగుతాయా? లేదా? ఇమ్రాన్‌ అరెస్టుకు కారణాలేంటి? పాక్ మాజీ ప్రధానిపై ఉన్న కేసులెన్ని..? దాయాది దేశంలో ఏం జరుగుతుంది? సాధారణ జనజీవనం ఏమనుకుంటుంది? ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కాల్సిన టైములో ఈ రాజకీయాలేమిటి? ఇంతకీ పాక్‌లో ఏం జరుగుతుంది?

ఎందుకంటే అది పాకిస్థాన్..
పాక్‌లో రాజకీయం చాలా సెపరేట్. ఒకప్పుడు ఆ దేశంలో మాజీ ప్రధానులు బెనజీర్ భుట్టో.. నవాజ్ షరీఫ్‌ పార్టీలు రాజ్యమేలేవి. ఏ ఒక్కరూ పూర్తికాలం అధికారంలో కొనసాగకపోయినా.. ఈ ఇద్దరు నేతలకు చెందిన పార్టీల మధ్యే రాజకీయం ఉండేది. కానీ, 1996లో మాజీ క్రికెటర్ ఇమ్రాన్‌ఖాన్ పాకిస్థాన్ తెహ్రిక్-ఇ-ఇన్సాఫ్‌ (Pakistan Tehreek-e-Insaf)ను స్థాపించి మూడో రాజకీయ శక్తిగా ఎదిగారు. 2018లో సైన్యం సహకారంతో అధికారంలోకి వచ్చారు. 2022 వరకు ఇమ్రాన్ పాక్ ప్రధానిగా పనిచేశారు. ఏడాదిలో ఆయన పదవీకాలం పూర్తి చేసుకుంటే.. పాక్‌లో పూర్తికాలం పనిచేసిన ప్రధానిగా అరుదైన రికార్డును సొంతం చేసుకుని ఉండేవారు. కానీ అలా జరగలేదు. ఎందుకంటే అది పాకిస్థాన్. ఎప్పుడు రాజకీయం ఏ మలుపు తీసుకుంటుందో తెలియని పరిస్థితి. సాఫీగా సాగిపోతుందనుకున్న దశలో ఇమ్రాన్ పార్టీ కట్టుతప్పింది. సైన్యంతో ఇమ్రాన్‌కు విభేధాలు తలెత్తడంతో ప్రభుత్వం అర్థాంతరంగా పతనమైంది.

తప్పించుకోలేకపోయిన ఇమ్రాన్‌
గత ఏడాది ఏప్రిల్‌లో ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) పదవి కోల్పోయిన తర్వాత ఆయనకు కష్టాలు ఎక్కువయ్యాయి. 100కి పైగా కేసులు నమోదయ్యాయి. ఇందులో అక్రమాస్తులు కూడబెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదే సమయంలో ఇమ్రాన్‌పై హత్యాయత్నం కూడా జరిగింది. గత జనవరిలో కూడా ఇమ్రాన్‌ను అరెస్టు చేయడానికి సిద్ధమయ్యారు పోలీసులు. ఇమ్రాన్ ఇంటికి వెళ్లి తలుపుతట్టారు. విషయం తెలుసుకున్న ఇమ్రాన్‌ఖాన్ వెనుక గేటు నుంచి పరారయ్యారు. ఇప్పుడు మాత్రం ఇమ్రాన్ తప్పించుకోలేకపోయారు. వేరే కేసులో కోర్టుకు వచ్చిన ఇమ్రాన్‌ను వందల మంది రేంజర్లు చుట్టుముట్టి అరెస్టు చేశారు.

అట్టుడుకుతున్న పాకిస్థాన్
ఇమ్రాన్ అరెస్టుతో పాక్‌ అట్టుడికిపోతోంది. ఆయన మద్దతుదారులు, అభిమానులు పాక్ షట్‌డౌన్‌కు పిలుపునిచ్చారు. పాక్‌లో కొన్నాళ్లుగా ఇమ్రాన్‌కు మద్దతు పెరుగుతోంది. ఆర్థిక సంక్షోభాన్ని ప్రస్తుత ప్రభుత్వం సరిదిద్దలేకపోతోందని ప్రజలు భావిస్తున్నారు. ఇమ్రాన్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. గతంలో 37 శాతంగా ఉన్న ఇమ్రాన్ ప్రజాదరణ రేటు కొద్ది రోజుల క్రితం 60 శాతానికి పైగా చేరిందంటే అక్కడ పరిస్థితి ఎంతలా మారిందో చెప్పొచ్చు. కానీ, పాక్‌లో ప్రజాభిప్రాయానికి పెద్దగా విలువ ఉండదు. ప్రజాస్వామ్య బద్దంగా గెలిచిన ప్రభుత్వానికే చోటు లేని ఆ దేశంలో ఇక సర్వేల ఫలితాలకు ఏమాత్రం విలువనిస్తారు. ఇమ్రాన్ పరపతి పెరగడం జీర్ణించుకోలేని పాలకులు.. మిలటరీ (Pakistan Arm) సహకారంతో ఇమ్రాన్‌ను అరెస్టు చేయగలిగారు. పాక్‌లో ఓటు కంటే మిలటరీ రూల్‌కే ఎక్కువ బలం. 75 ఏళ్లలో సగానికి కన్నా ఎక్కువ కాలం మిలటరీ పాలనలోనే మగ్గిపోయింది ఆ దేశం. ఇప్పుడు కూడా మిలటరీ చీఫ్‌తో ఇమ్రాన్‌ఖాన్‌కు విబేధాలు తలెత్తడం వల్లే ఆయనకీ దుస్థితి వచ్చిందంటున్నారు.

Also Read: లాహోర్‌లో ఆగని నిరసనలు.. నెమళ్లు దొంగిలించిన ఇమ్రాన్‌ఖాన్ మద్దతుదారులు

వరుస కేసులు.. వెనక్కి తగ్గని ఇమ్రాన్‌
మిలటరీ సహకారంతో గద్దెనెక్కిన ఇమ్రాన్‌కు 2021 నుంచి కష్టాలు మొదలయ్యాయి. మిలటరీ అధికారులతో ఇమ్రాన్‌కు సంబంధాలు దెబ్బతినడమే దీనికి కారణమంటున్నారు. పాక్‌లో అత్యంత శక్తిమంతమైన మిలటరీ ఆగ్రహానికి గురై.. గత ఏడాది పదవిని కోల్పోవాల్సివచ్చింది. కానీ, ఇమ్రాన్ తీరులో మార్పురాలేదు. ఆయనపై వరుసగా కేసులు నమోదు చేస్తున్నా ఎక్కడా తగ్గలేదు. తనను హత్య చేయడానికి మిలటరీ ప్లాన్ చేస్తోందని ఒక్క రోజు క్రితమే ఆరోపించారు ఇమ్రాన్. అంతేకాకుండా అరెస్టు కావడానికి కొద్ది సేపటి క్రితం కూడా కెన్యాలో జరిగిన ఓ జర్నలిస్టు హత్యకు పాకిస్థాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటిలిజెన్స్ -ISI కారణమని ఆరోపించాడు. తనపై ఉన్న కేసుల్లో శిక్ష పడితే ఇక పోటీ చేయడానికి వీలుకాదని తెలిసినా.. వెరవలేదు ఇమ్రాన్. ఇక అతడిని ఎంతమాత్రం ఉపేక్షించకూడదని భావించిన పాక్ ప్రభుత్వం.. మిలటరీ సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టి అరెస్టు చేశారు. ఇమ్రాన్ అరెస్టుతో నవంబర్‌లో జరగాల్సిన ఎన్నికలపై సస్పెన్స్ ఏర్పడింది. ఎన్నికలు జరిగినా.. లేకున్నా.. ఇప్పుడు ఒకటేనని అంటున్నారు పరిశీలకులు.

Also Read: జాగ్రత్తగా వినండి, నన్ను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోంది.. అరెస్టుకు ముందు ఇమ్రాన్ వీడియో సందేశం