Anita Anand: కెనడా ప్రధాని రేసు నుంచి తప్పుకున్న భారత సంతతికి చెందిన అనితా ఆనంద్.. కారణం ఏమిటంటే?
ట్రూడో తరువాత కెనడా ప్రధానిగా బాధ్యతలు చేపట్టేందుకు భారత సంతతి ఎంపీ అనితా ఇందిరా ఆనంద్ కు కూడా మెరుగైన అవకాశాలే ఉన్నాయి. అయితే, ఆమె తాజాగా కీలక ప్రకటన చేశారు.

Anita Anand Drops Out from Canada PM Race
Anita Anand: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తన పదవికి రాజీనామా చేయనున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. లిబరల్ పార్టీ కొత్త ప్రధాని అభ్యర్థిని ఎంపిక చేసే వరకు తాను పదవిలో కొనసాగుతానని, ఆ తరువాత పదవి నుంచి తప్పుకుంటానని ట్రూడో స్పష్టం చేశారు. దీంతో.. ట్రూడో స్థానంలో కొత్త నాయకుడిని ఎన్నుకునే పనిలో పార్టీ నాయకత్వం నిమగ్నమైంది. ఈ క్రమంలో పలువురు పేర్లు తెరపైకి వచ్చాయి. ప్రధాని రేసులో ప్రముఖంగా లిబరల్ పార్టీ నేతలు క్రిస్టినా ఫ్రీలాండ్ ఉన్నారు. ఆమె ఇటీవల ఉపప్రధాని పదవికి రాజీనామా చేశారు. ఆ సమయంలో ట్రూడో పాలనావిధానాలపై విమర్శలు చేశారు. ఆ తరువాత స్థానాల్లో మార్క్ కార్నీ, డొమినిక్ లీ బ్లాంక్, మెలనీ జోలీ, ఫ్రాంకోయిస్ ఫిలిప్పీ, క్రిస్టీ క్లార్క్ తో పాటు భారత సంతతికి చెందిన ఎంపీలు అనిత ఆనంద్, జార్జ్ చాహల్ పేర్లు వినిపిస్తున్నాయి.
Also Read:
ట్రూడో తరువాత ప్రధాని బాధ్యతలు చేపట్టేందుకు భారత సంతతి ఎంపీ అనితా ఇందిరా ఆనంద్ కు కూడా మెరుగైన అవకాశాలే ఉన్నాయి. అయితే, ఆమె తాజాగా కీలక ప్రకటన చేశారు. కెనడా ప్రధాని రేసు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా లేఖను విడుదల చేశారు. వచ్చే ఎన్నికల వరకు ఓక్విల్లే పార్లమెంట్ ఎంపీగా తనకు ఉన్న బాధ్యతలను నిర్వర్తిస్తానని చెప్పారు. ఓక్విల్లే పార్లమెంట్ ఎంపీగా మరలా ఎన్నికవ్వాలని నేను కోరుకోవడం లేదని అన్నారు. తనను ఎన్నుకున్నందుకు ఓక్విల్లే ప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తు లో విద్యారంగంలో సేవలందించాలని అనుకుంటున్నట్లు అనిత పేర్కొన్నారు.
లిబరల్ పార్టీలో పార్లమెంట్ సభ్యురాలిగా తనకు అవకాశం కల్పించి.. కీలకమైన మంత్రి పదవి అప్పగించినందుకు ట్రూడోకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ‘‘మనం దేశానికి, సమాజానికి అనేక విధాలుగా సేవ చేయవచ్చు. నేను పుట్టకముందే నా తల్లిదండ్రులు కెనడాకు వలస వచ్చారు. నా చిన్నతనం నుంచి ఈ దేశం గొప్పదనాన్ని, ఈ దేశ ప్రజలు మాకు అందించిన సహకారాన్ని నా తల్లిదండ్రులు చెబుతూ పెంచారు. మా లిబరల్ టీమ్ కోసం, ఓక్విల్లే కోసం.. అన్నింటికంటే కెనడా కోసం నేను ఇక్కడ ఉంటాను’’ అంటూ అనిత తెలిపారు.
57ఏళ్ల అనిత ఆనంద్ భారతీయ మూలాలు కలిగిన కెనడా ఎంపీ. ఆమె తండ్రి తమిళనాడుకు చెందిన ఫిజీషియన్, తల్లి పంజాబ్ కు చెందిన వారు. అనిత ఆనంద్ 2019లో ఓక్వెల్లే నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ వెంటనే ట్రూడో కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు. పలు శాఖల్లో మంత్రిగా పనిచేశారు.
Please see my statement. pic.twitter.com/UePgtYFUHJ
— Anita Anand (@AnitaAnandMP) January 11, 2025