Canada: జస్టిన్ ట్రూడో రాజీనామా.. కెనడా నూతన ప్రధాని ఎవరు..? ఆ ముగ్గురిలో ఛాన్స్ ఎవరికి దక్కబోతుంది..
జస్టిన్ ట్రూడో రాజీనామా తరువాత కెనడా తదుపరి ప్రధాని ఎవరనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. అయితే, నూతన ప్రధాన మంత్రి పదవికోసం ముగ్గురి పేర్లు వినిపిస్తున్నాయి.

Justin Trudeau Resigns_ Who Will Be the Next Prime Minister of Canada
Canada Next PM: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau) ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అదేవిధంగా లిబరల్ పార్టీ (Liberal Party) నాయకత్వ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు తెలిపారు. తన స్థానంలో కొత్తవారిని ఎంపిక చేసే వరకు ప్రధాని పదవిలో కొనసాగుతానని పేర్కొన్నారు. ఖలిస్థానీ వేర్పాటు వాదులకు మద్దతు పలుకుతూ ఇటీవల కాలంలో భారతదేశంపై ట్రూడో విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అయితే, ట్రూడో రాజీనామా తరువాత ఆయన స్థానంలో ఎవరు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపడతారనే చర్చ విస్తృతంగా సాగుతుంది. అయితే, ఈ రేసులో ప్రధానంగా ముగ్గురి పేర్లు వినిపిస్తున్నాయి.
Also Read: Justin Trudeau : కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో రాజీనామా..!
కొత్త నాయకుడి ఎంపికకు ఎంత సమయం పడుతుంది…
ట్రూడో రాజీనామా తరువాత లిబరల్ పార్టీ నాయకత్వం రెండు ప్రధాన ఎంపికలు చేయాల్సి ఉంటుంది. మొదటిది ప్రధాని పదవికి తాత్కాలిక నాయకుడిని పార్టీ ఏకగ్రీవంగా ఎన్నుకోవాలి. కెనడాలో ఈ సంవత్సరం అంటే అక్టోబర్ 2025లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో రాబోయే కాలంలోనూ పార్టీని విజయతీరాలకు నడిపించే నేతను ఎంపిక చేయాల్సి ఉంటుంది. అయితే, కెనడాలో కూడా బ్రిటన్, అమెరికా తరహాలో పార్టీ అధినేతను ఎన్నుకోవడం కష్టమైన పని. నిబంధనల ప్రకారం.. లిబరల్ పార్టీ పూర్తిస్థాయి ప్రధానమంత్రిని చేయాలనుకుంటే, ఆ పార్టీ నేతల్లో ఒకరిని ఎంపిక చేయడానికి ప్రత్యేక సమావేశం నిర్వహించాలి. పార్టీ నుంచి ప్రధాన మంత్రి పదవికోసం పోటీలో నిలిచేవారి నుంచి ఆహ్వానాలు కోరతారు. అయితే, ప్రధాని పదవికోసం ఎంత మంది నాయకులు పోటీపడుతారనే ప్రక్రియపై నూతన ప్రధాని ఎంపిక ఆధారపడి ఉంటుందని తెలుస్తోంది. అయితే, ఎన్నికలు ముంచుకొస్తుండటంతో ఈ ప్రక్రియను బుధవారం జరిగే పార్టీ సమావేశంలో ముగింపుపలికే అవకాశం లేకపోలేదు.
Also Read: Cm Revanth Reddy : రాష్ట్ర అభివృద్ధి కోసం ఎవరితోనైనా కలిసి పని చేస్తాం- సీఎం రేవంత్ రెడ్డి
పోటీలో ఆ ముగ్గురు నేతలు..
జస్టిన్ ట్రూడో రాజీనామా తరువాత కెనడా తదుపరి ప్రధాని ఎవరనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. అయితే, క్రిస్టియా ఫ్రీలాండ్, డొమినిక్ లెబ్లాంక్, మార్క్ కార్నీ వంటి నేతల్లో ఒకరు ట్రూడో వారసుడిగా ఎంపికయ్యే అవకాశం ఉంది.
క్రిస్టియా ఫ్రీలాండ్ : క్రిస్టియా ఫ్రీలాండ్ ట్రూడో కేబినెట్ లో ఉప ప్రధాన మంత్రిగానూ, ఆర్థిక మంత్రిగానూ కొనసాగారు. అయితే, ఆమె గత నెల ప్రారంభంలో ట్రూడో కేబినెట్ నుంచి తప్పుకున్నారు. ఈక్రమంలో ట్రూడో ఆర్థిక విధానాలపై తీవ్రస్థాయిలో ఆమె విమర్శలు చేశారు. అయితే, ట్రూడో కేబినెట్ లో ఆమె కీలక సభ్యురాలిగా కొనసాగారు. ప్రస్తుతం, ట్రూడో రాజీనామా నేపథ్యంలో అతని స్థానాన్ని భర్తీచేసే వారిలో ఫ్రీలాండ్ పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది.
డొమినిక్ లెబ్లాంక్ : ట్రూడో కేబినెట్లో డొమినిక్ లెబ్లాంక్ మంత్రిగా కొనసాగుతున్నారు. క్రిస్టియా ఫ్రీలాండ్ కేబినెట్ నుంచి తప్పుకున్న తరువాత ఆమె ఆర్థిక శాఖను ప్రస్తుతం లెబ్లాంక్ చూస్తున్నారు. ఆయన న్యాయవాదిగానూ పనిచేశారు. లిబరల్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవంతోపాటు, అనుభవజ్ఞుడైన రాజకీయ నాయుకుడిగా అతనికి పేరుంది. ట్రూడో స్థానాన్ని భర్తీచేసే క్రమంలో లెబ్లాంక్ బలమైన పోటీదారుగా ఉన్నారు.
మార్క్ కార్నీ : కార్నీ గతంలో బ్యాంక్ ఆఫ్ కెనడా, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ సారథ్య బాధ్యతలను నిర్వహించారు. ఎప్పటి నుంచో రాజకీయాల్లో ప్రవేశించాలని, ప్రధాని కావాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఆయనను తన ప్రభుత్వంలో చేర్చుకోవాలని ట్రూడో భావించారు. మరో వైపు దేశానికి అందించిన సేవలకుగానూ ట్రూడోకు కార్నీ కృతజ్ఞతలు తెలిపారు.
మరోవైపు.. నూతన ప్రధానమంత్రి పదవి రేసులో భారత సంతతి వ్యక్తులు కూడా ఉన్నారు. భారత సంతతికి చెందిన అనితా ఆనంద్, జార్జ్ చాహల్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అనిత ఆనంద్ గతంలో రక్షణ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం రవాణా, అంతర్గత వాణిజ్య మంత్రిగా కొనసాగుతున్నారు. తాత్కాలిక నేతగా కొనసాగుతున్న చాహల్ పేరు కూడా ప్రధాని పదవి రేసులో వినిపిస్తోంది. అయితే, ఆయనకు అవకాశం దక్కకపోవచ్చునని సమాచారం.