Pakistan Crisis: పహల్గామ్ ఉగ్రదాడితో భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇరు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఏ క్షణమైనా యుద్ధం ప్రారంభం కావచ్చన్న వార్తలు పాకిస్తాన్ ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే అక్కడ పరిస్థితులు గందరగోళంగా మారాయి. పాకిస్తాన్ లో ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. బియ్యం, కూరగాయలు, మాంసం, పండ్ల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇది ఇలా ఉంటే పాకిస్తాన్ లో మరో సంక్షోభం మొదలైంది. జనం రోడ్ల మీద ట్రక్కులు వదిలేస్తున్నారు. దీంతో అక్కడ రచ్చ రచ్చగా ఉంది.
సింధు నదిపై వివాదాస్పద కాలువ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు సింధ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను స్తంభింపజేశాయి. వేలాది ట్రక్కులు రోడ్ల మీదే చిక్కుకుపోయాయి. దీంతో ముడి పదార్థాల కొరత ఏర్పడి తయారీదారులు ఉత్పత్తిని నిలిపివేశారు. రాబోయే సంక్షోభం గురించి పోర్ట్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
నిరసనకారులను చెదరగొట్టడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేదు. సింధ్‌లోని అనేక ప్రాంతాల్లో జాతీయ రహదారులను దిగ్బంధించారు. దీంతో సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. ప్రతిపాదిత కాలువ ప్రాజెక్టును అధికారికంగా రద్దు చేసే వరకు ధర్నాలు కొనసాగిస్తామని జాతీయవాద పార్టీలు, న్యాయవాదులు, పౌర సమాజ సంఘాలు, నిరసనకారులు ప్రతిజ్ఞ చేశారు. ప్రాజెక్ట్ ను వాయిదా వేస్తామని అధికారులు హామీ ఇచ్చినప్పటికీ నిరసనలు ఆగడం లేదు.
నివేదికల ప్రకారం.. కాంధ్‌కోట్, కాష్మోర్, ఘోట్కి, సుక్కూర్, ఖైర్‌పూర్ జిల్లాల్లో వేలాది భారీ వాహనాలు పొడవైన క్యూలలో చిక్కుకున్నాయి. రోడ్లను ఖాళీ చేయాలని సింధ్ ప్రభుత్వం నిరసనకారులకు పదే పదే పిలుపునిచ్చినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
Also Read: పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ సహా పాకిస్తానీ యూట్యూబర్లకు బిగ్ షాకిచ్చిన భారత్
ఆదివారం పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ కరాచీలో సింధ్ ముఖ్యమంత్రి మురాద్ అలీ షాతో సమావేశమయ్యారు. నిరసనలు, దాని పర్యవసానాలపై చర్చించారు. రాజకీయ పార్టీలు “స్వార్థ ప్రయోజనాల” కోసం ఈ సమస్యను ఉపయోగించుకుంటున్నాయని తెలిపారు. శాంతిని పునరుద్ధరించడానికి , ప్రజల ఫిర్యాదులను పరిష్కరించడానికి తీసుకుంటున్న చర్యల గురించి అధ్యక్షుడికి వివరించారాయన.
మరోవైపు ట్రాన్స్‌పోర్టర్లు తమ నిరసనను మరింత ఉధృతం చేయాలని యోచిస్తున్నారు. ఆల్ పాకిస్తాన్ గూడ్స్ ట్రాన్స్‌పోర్ట్ అలయన్స్ సింధ్ ముఖ్యమంత్రి ఇంటి వెలుపల నిరసన ప్రదర్శన ప్రకటించింది. ఎగుమతి సరుకు ఇకపై రావడం లేదని, దిగుమతి చేసుకున్న వస్తువులు పోర్టులో పేరుకుపోతున్నాయని, పరిస్థితి ఇలాగే కొనసాగితే తీవ్ర రద్దీ ఏర్పడుతుందనే భయాలు పెరుగుతున్నాయని కరాచీ పోర్ట్ ట్రస్ట్ అధికారి హెచ్చరించారు.
డ్రైవర్లు, సహాయకులు తమ వాహనాలతోనే చిక్కుకుపోయారని ట్రాన్స్‌పోర్టర్లు వాపోయారు. ఆల్ పాకిస్తాన్ గూడ్స్ ట్రాన్స్‌పోర్టర్స్ అసోసియేషన్‌కు చెందిన నిసార్ జాఫ్రీ అంచనా ప్రకారం దాదాపు 30వేల ట్రక్కులు, ఆయిల్ ట్యాంకర్లు నిలిచిపోయాయి. దాదాపు 90వేల నుండి లక్ష మంది డ్రైవర్లు, సహాయకులు 10 రోజులకు పైగా ఆహారం, నీరు అందుబాటులో లేక విలవిలలాడుతున్నారు. ఒక్కో వాహనంలో 10 మిలియన్ల విలువైన సరుకు ఉన్నట్లు తెలిపారు.
రోడ్లపై నిలిచిపోయిన వాహనాలను నిరసనకారులు ధ్వంసం చేశారని వాపోయారు. రవాణా చేస్తున్న 100కి పైగా బలి జంతువులు సుదీర్ఘమైన దిగ్బంధం కారణంగా చనిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో రోడ్లను క్లియర్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు.
Also Read: 13 లక్షల బుకింగ్స్ క్యాన్సిల్.. జమ్ముకశ్మీర్ పర్యాటక రంగాన్ని తీవ్రంగా దెబ్బతీసిన పహల్గాం ఉగ్రదాడి..
మరింత ఆర్థిక నష్టాన్ని నివారించడానికి రోడ్డు దిగ్బంధనాలను ముగించాలని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు మంత్రి మెమన్. “మూసివేతల కారణంగా, ప్రజలు, పశువులు, దిగుమతి ఎగుమతి రంగాలు, రైతులు, పేదలు తీవ్రంగా ప్రభావితమవుతున్నారు” అని ఆయన వాపోయారు. అటు వ్యాపార, పరిశ్రమ వర్గాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. లాజిస్టిక్స్‌కు అంతరాయాలు తీవ్ర సంక్షోభాన్ని సృష్టిస్తున్నాయని హెచ్చరించారు. రోడ్లపై చిక్కుకుపోయిన వాటిలో దాదాపు 800 నుండి 1,000 చమురు ట్యాంకర్లు ఉన్నాయి. అయితే, ఈ కారణంగా తక్షణ ఇంధన కొరత వచ్చే అవకాశం లేదన్నారు.
ఏది ఏమైనా ఈ దిగ్బంధనం ఇలానే కొనసాగితే సరఫరాలో అంతరాయాలు ఏర్పడి బహుళ రంగాలలో పూర్తి స్థాయి సంక్షోభానికి దారితీయవచ్చనే భయాందోళనలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.