Jammu Kashmir Tourism: 13 లక్షల బుకింగ్స్ క్యాన్సిల్.. జమ్ముకశ్మీర్ పర్యాటక రంగాన్ని తీవ్రంగా దెబ్బతీసిన పహల్గాం ఉగ్రదాడి..

ఆగస్టు వరకు, విదేశాల నుండి వచ్చే వారితో సహా దాదాపు 13 లక్షల మంది పర్యాటకులు లోయను సందర్శించడానికి స్థానిక హోటళ్ళు, అతిథి గృహాలలో బస చేయడానికి ముందస్తు బుకింగ్‌లు చేసుకున్నారు.

Jammu Kashmir Tourism: 13 లక్షల బుకింగ్స్ క్యాన్సిల్.. జమ్ముకశ్మీర్ పర్యాటక రంగాన్ని తీవ్రంగా దెబ్బతీసిన పహల్గాం ఉగ్రదాడి..

Updated On : April 28, 2025 / 4:56 PM IST

Jammu Kashmir Tourism: పహల్గాం ఉగ్రదాడి యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదం నింపిందీ ఘటన. కళ్ల ముందే తమ వారిని కోల్పోయిన కుటుంబాలు ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేకపోతున్నాయి. మాటు వేసిన ముష్కరులు అదను చూసి మారణహోమం సృష్టించారు. టూరిస్టులే లక్ష్యంగా దాడి చేశారు. అత్యంత క్రూరంగా వారిని కాల్చి చంపారు. ఉగ్రవాదుల దుశ్చర్య ఇప్పుడు జమ్ముకశ్మీర్ పర్యాటక రంగంపై పెను ప్రభావమే చూపింది.

ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రవాద దాడి కేవలం ప్రజలను చంపడమే కాదు.. జమ్మూ కాశ్మీర్ ఆర్థిక వ్యవస్థకు దోహదపడే వాటిలో ఒకటైన పర్యాటక రంగంపైనా ఇది దీర్ఘకాలిక ప్రభావం చూపుతుంది. గతంలో కశ్మీర్ లో జరిగిన దాడుల్లో ఒకేసారి ఇంత మంది పర్యాటకులు మరణించింది లేదు.

ఉగ్రదాడి తర్వాత పర్యాటకులు భయంతో వణికిపోతున్నారు. జమ్ముకశ్మీర్ పేరు చెబితేనే వారి వెన్నులో వణుకు పుడుతోంది. ఉగ్రదాడితో కశ్మీర్‌లోని పర్యాటక స్థలాలన్నీ ఖాళీ అవుతున్నాయి. వివిధ ప్రాంతాలను సందర్శించేందుకు వచ్చిన వేలాది మంది పర్యాటకులు భయంతో వెనుదిరుగుతున్నారు. ఉగ్రదాడి తర్వాత గంటల వ్యవధిలోనే వేలాది మంది శ్రీనగర్‌ను వీడారు.

మరోవైపు త్వరలో కశ్మీర్‌లో పర్యటించేందుకు ఏర్పాట్లు చేసుకున్న వారు సైతం.. తమ ప్రయాణ టికెట్లు, హోటల్‌ బుకింగ్స్‌ రద్దు చేసుకుంటున్నారు. ఉగ్రదాడి జరిగాక ఒక్క రోజులోనే జమ్ముకశ్మీర్‌కు 90 శాతం బుకింగ్స్‌ రద్దవడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఇప్పటివరకు ఏకంగా 13 లక్షల బుకింగ్స్ క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది.

Also Read: మూడేళ్లు జైలు, 3 లక్షలు జరిమానా.. పాకిస్తానీయులకు భారత్ మరో బిగ్ షాక్..

జావేద్ అహ్మద్ ఏప్రిల్ 21 వరకు పహల్గాంలోని తన 20 గదుల హోటల్‌లో బుకింగ్‌లతో బిజీగా ఉన్నాడు. ఏప్రిల్ 22న బైసరన్ వ్యాలీలో ముష్కరుల దాడితో అతని పరిస్థితి అకస్మాత్తుగా మారిపోయింది. హోటల్ ఖాళీ అయిపోయింది. గదులను బుక్ చేసుకున్న వారు క్యాన్సిల్ చేసుకున్నారు. దాంతో వారికి డబ్బు వాపసు చేసినట్లు అతడు తెలిపాడు. తనకు తీవ్రమైన నష్టం జరిగిందని అతడు వాపోయాడు. పహల్గాం హిల్ రిసార్ట్ లో జావెద్ ఓ హోటల్ ని నడుపుతున్నాడు. బైసరన్ వ్యాలీకి 5 కిలోమీటర్ల దూరం అతడి హోటల్ ఉంది. అదే అతడికి జీవనాధారం. మే నెల వరకు అడ్వాన్స్ బుకింగ్స్ ఉన్నాయి. “సాధారణంగా మేము ఖర్చులో 25 శాతం ముందుగానే తీసుకుంటాము. ఇప్పుడు దాడి తర్వాత పరిస్థితి తలకిందులైంది. మే నెలకు వరకు దాదాపు 4 లక్షలు తిరిగి చెల్లించాలి” అని అతడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.

గత వారం జరిగిన ఉగ్రదాడి కేవలం ప్రజలను చంపడమే కాదు, పర్యాటక రంగంపై దీర్ఘకాలిక ప్రభావం చూపుతుందని హోటళ్ల యజమానులు వాపోతున్నారు. పహల్గాం ఉగ్రదాడి కారణంగా పర్యాటకులు పెద్ద సంఖ్యలో టిక్కెట్లను రద్దు చేసుకున్నారు. ఇది ముందస్తు బుకింగ్‌లపై ప్రభావం చూపింది. ఆగస్టులో లోయ అంతటా షెడ్యూల్ చేయబడిన కనీసం 13 లక్షల బుకింగ్‌లు రద్దు చేయబడ్డాయని జమ్మూ కాశ్మీర్ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బాబర్ చౌదరి తెలిపారు.

Also Read: ‘లొంగిపోరా.. కనీసం మేమన్నా ప్రశాంతంగా బతుకుతాం’..- ఉగ్రదాడి కేసులో ప్రధాన అనుమానితుడి తల్లి తీవ్ర ఆవేదన..

ఈ అసోసియేషన్ ఆధ్వర్యంలో 240 వరకు హోటల్స్, రెస్టారెంట్స్ ఉన్నాయి. సాధారణంగా ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు కశ్మీర్ కు 25 మంది వరకు పర్యాటకులు వస్తుంటారు. ఈ ఏడాది భయం కారణంగా వారిలో 90శాతం మంది కశ్మీర్ కు వచ్చే పరిస్థితి లేకుండా పోయిందని వాపోయారు.

ఆగస్టు వరకు, విదేశాల నుండి వచ్చే వారితో సహా దాదాపు 13 లక్షల మంది పర్యాటకులు లోయను సందర్శించడానికి స్థానిక హోటళ్ళు, అతిథి గృహాలలో బస చేయడానికి ముందస్తు బుకింగ్‌లు చేసుకున్నారు. ఏప్రిల్ 22 ఉగ్రవాద దాడి తర్వాత, పర్యాటకులు తమ బుకింగ్‌లను రద్దు చేసుకోవడం ప్రారంభించారు.

కాశ్మీర్‌లో వసంతకాలం ఇప్పుడే ప్రారంభమైంది. శ్రీనగర్‌లోని తులిప్ గార్డెన్ ప్రారంభించిన 26 రోజుల్లోనే దాడి జరిగే వరకు 8.5 లక్షల మంది సందర్శకులను ఆకర్షించింది. ఈ వేసవిలో పర్యాటకులకు సౌకర్యవంతమైన బసను కల్పించేందుకు తాము సన్నద్ధమవుతున్నట్లు టూర్ ఆపరేటర్లు తెలిపారు. ఇంతలోనే ఈ దారుణం జరిగిపోయిందన్నారు. ఉగ్రవాదులు కేవలం మనుషుల ప్రాణాలు మాత్రమే తీసుకోలేదు, వారు మా జీవనాధారంపై దెబ్బకొట్టారు. ఈ మధ్య కాలంలోనే మాకు కాస్త ఉపాధి లభిస్తోంది, ఇంతలోనే ఈ ఘోరం జరిపోయింది అని వాపోయారు.

భద్రతా కారణాల దృష్ట్యా కశ్మీర్ కు 90 శాతం వరకు ప్రయాణ బుకింగ్‌లు రద్దు చేయబడ్డాయని ఢిల్లీకి చెందిన ట్రావెల్ ఏజెన్సీలు తెలిపాయి. 2025 మే -డిసెంబర్ మధ్య కాశ్మీర్‌కు ప్రయాణ లేదా తీర్థయాత్ర బుకింగ్‌లు చేసుకున్న 62 శాతం కుటుంబాలు ఏప్రిల్ 22 పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత ఇప్పుడు తమ ప్రణాళికలను రద్దు చేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.