Army Seizes Power In Guinea Arrests President (1)
army seizes power in guinea arrests president : అఫ్గాన్ ను తాలిబన్లు స్వాధీనం చేసుకుంటే..ఆఫ్రికా దేశమైన గినియాలో సైనిక తిరుగుబాటుతో అక్కడ ప్రభుత్వం కూలిపోయింది. ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన సైన్యం గినియా ప్రెసిడెంట్ ఆల్ఫా కోండేను ఆదివారం అదుపులోకి తీసుకుని ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకుంది. అనంతరం అధ్యక్షుడు ఆల్ఫా కోండే ప్రభుత్వం రద్దయినట్లు ప్రకటించింది సైన్యం. అనంతరం దేశంలో కర్ఫ్యూ విధించారు.
అంతేకాదు అధ్యక్షుడిని అరెస్టు చేసిన అనంతరం దేశ రాజ్యాంగాన్ని రద్దు చేయాలని నిర్ణియించినట్లు గినియా ఆర్మీ కల్నల్ మామాడి డౌంబౌయా ప్రకటించారు.దేశంలో ప్రజారంజకమైన పాలన సాగిస్తామని ఆ దేశ ఆర్మీ కల్నల్ మామాడి డౌంబౌయా తెలిపారు. ఈక్రమంలో దేశ సరిహద్దుల్ని కూడా మూసివేశారు. దేశంలో ఒక ఒకే వ్యక్తి చేతిలో రాజకీయం అనేది ముగిసింది. ఇకపై రాజకీయాలను ఒక వ్యక్తికి అప్పగించబోమని, అధికారాన్ని ప్రజలకే అందిస్తామని ఆర్మీ అధికారి వెల్లడించారు. ఇక రాజ్యాంగం కూడా రద్దయిందని కూడా తెలిపారు. దేశాన్ని హస్తగతం చేసుకున్న సైన్యం దేశ సరిహద్దులతోపాటు, ఆకాశ మార్గాలను కూడా మూసివేశాని ప్రకటించారు.
తదుపరి ఆదేశాలు వచ్చేవరకు దేశంలో కర్ఫ్యూ అమల్లో ఉంటుందని స్పష్టంచేశారు. సోమవారం ఉదయం 11 గంటలకు (భారత కాలమానం ప్రకారం) క్యాబినెట్ సమావేశం ఉంటుందని చెప్పారు. దేశంలో గవర్నర్లు, ఇతర అత్యున్నత పదవుల్లో మిలటరీ అధికారులను నియమిస్తామని తెలిపారు. గినియాలో ఈ పరిస్థితి ఏర్పడిన తరువాత కమ్యూనికేషన్ ను కూడా సైన్యం నిలిపివేసింది. దేశంలో తిరుగుబాటుకు సంబంధించి అధికారిక టెలివిజన్ ఎటువంటి ప్రకటన చేయకపోవడం గమనించాల్సిన విషయం.
కొనాక్రీలోని అధ్యక్ష భవనం వద్ద ఆదివారం తెల్లవారు జామున భారీ ఎత్తున కాల్పులు జరిగాయి. ఈ కాల్పులు గంటల పాటు కొనసాగాయని స్థానిక మీడియా వెల్లడించింది. సైనిక ఆక్రమణలు..తిరుగుబాటు చరిత్ర కలిగిన పశ్చిమాఫ్రికా దేశంలో భద్రతా సమస్యలపై ఆందోళన వ్యక్తం చేశాయి.కాగా గినియా పరిస్థితిపై అమెరికా స్పందించింది.గినియాలో అధ్యక్షుడిని అదుపులోకి తీసుకొని సైనికులు పాలనను హస్తగతం చేసుకోవడాన్ని తప్పుపట్టింది. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొంది.