×
Ad

Switzerland: న్యూఇయర్‌ వేళ తీవ్ర విషాదం.. స్విట్జర్లాండ్‌లో పేలుడు.. 40 మంది మృతి

అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియరాలేదని దక్షిణ పశ్చిమ స్విట్జర్లాండ్ వాలిస్ కాంటన్ పోలీసు ప్రతినిధి గేటాన్ లాథియాన్ చెప్పారు.

  • మాంటానాలోని ఒక బార్‌లో భారీ అగ్నిప్రమాదం
  • న్యూఇయర్‌ సంబరాలు చేసుకుంటున్న సమయంలో ఘటన
  • ప్రమాదానికి కారణాలు తెలియరాలేదంటున్న పోలీసులు

Switzerland: స్విట్జర్లాండ్ క్రాన్స్ మాంటానాలోని ఒక బార్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించి, 40 మంది మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. నూతన సంవత్సర వేడుకల వేళ విలాసవంతమైన ఆల్పైన్ స్కీ రిసార్ట్ నగరం క్రాన్స్ మాంటానాలోని లే కాన్‌స్టెల్లేషన్ బార్‌లో మంటలు చెలరేగినట్లు స్విస్ పోలీసులు గురువారం తెల్లవారుజామున తెలిపారు.

అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియరాలేదని దక్షిణ పశ్చిమ స్విట్జర్లాండ్ వాలిస్ కాంటన్ పోలీసు ప్రతినిధి గేటాన్ లాథియాన్ చెప్పారు. నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తూ ప్రజలు సంబరాలు చేసుకుంటున్న సమయంలో అర్ధరాత్రి దాటాక 1.30 గంటల సమయంలో కాన్‌స్టెల్లేషన్ బార్‌లో అగ్నిప్రమాదం జరిగింది.

బార్‌లో ఆ సమయంలో 100 మందికి పైగా ఉన్నారు. మృతులు, గాయపడినవారిలో ఎక్కువ మంది పర్యాటకులే ఉండొచ్చని అనుమానిస్తున్నట్లు గేటాన్ లాథియాన్ చెప్పారు.

“ఇది అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన స్కీ రిసార్ట్, పర్యాటకులు అధికంగా ఉంటారు. దర్యాప్తు ప్రారంభ దశలోనే ఉంది” అని గేటాన్ లాథియాన్ తెలిపారు.

ప్రాంతీయ దినపత్రిక లె నూవెల్లిస్ట్ ప్రమాదం గురించి వివరాలు తెలిపింది. భారీ నష్టం జరిగిందని, సుమారు 40 మంది మృతి చెందారని, 100 మంది గాయాలయ్యాయని పేర్కొంది.

అగ్నిప్రమాద వీడియో వైరల్
సామాజిక మాధ్యమాల్లో అగ్ని ప్రమాద వీడియోలు వైరల్ అవుతున్నాయి. పోలీసు సిబ్బంది, అగ్నిమాపక బృందాలు, పలు హెలికాప్టర్లు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. బాధితుల బంధువులు వివరాలు తెలుసుకోవడానికి ఒక హాట్‌లైన్ ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతాన్ని పూర్తిగా మూసివేసి, ఎవరినీ రానివ్వడం లేదు. క్రాన్స్ మాంటానాపై నో-ఫ్లై జోన్ అమలు చేశారు.

కాన్సర్ట్ సమయంలో పైరోటెక్నిక్స్ వాడకం కారణంగా మంటలు చెలరేగి ఉండవచ్చని స్విస్ మీడియా పేర్కొంటోంది. అయితే, అగ్ని ప్రమాదానికి కారణం గురించి నిర్ధారణ జరగలేదని పోలీసులు చెప్పారు.